National

కరోనా కేసుల అప్డేట్స్.. కోలుకున్న 2,31,456 మంది..!

భారతదేశంలో గత 24 గంటల్లో 1,32,788 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 2,31,456 మంది కోలుకున్నారు. భారతదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,83,07,832కు చేరింది. మరో 3,207 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,35,102కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,61,79,085 మంది కోలుకున్నారు. 17,93,645 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 21,85,46,667 మందికి వ్యాక్సిన్లు వేశారు.

కరోనా సెకండ్ వేవ్ లో చిన్నారులకు కూడా కరోనా సోకుతూ ఉండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చిన్నారుల ఆరోగ్యంపై ప్రకటన చేశారు. చిన్నారుల్లో కరోనా సోకినప్పటికీ లక్షణాలు కనిపించడంలేదని వీకే పాల్ తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న 2 నుంచి 6 వారాల మధ్య పిల్లల్లో ఆరోగ్య సమస్యలు రావొచ్చని.. పిల్లల్లో సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స అందించాలని సూచించారు. వైరస్ సంక్రమణ, ప్రవర్తనలో మార్పులొస్తే కరోనా తీవ్రత పెరిగే అవకాశముందని.. జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు, న్యూమోనియా సమస్యలు వస్తే ఆసుపత్రిలో చేరాలని స్పష్టం చేశారు. కొందరిలో కోలుకున్న 3 వారాల తర్వాత కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయని అన్నారు.

01-06-2021న తెలంగాణ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 94,189 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,493 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 3,308 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 318 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 165, రంగారెడ్డి జిల్లాలో 152 కేసులు గుర్తించారు. గడచిన 24 గంటల్లో 15 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 3,296కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,80,844 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 5,44,294 మంది కోలుకున్నారు. ఇంకా 33,254 మందికి చికిత్స జరుగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − thirteen =

Back to top button