భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,43,364 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,994 కొత్త కేసులు బయటపడ్డాయి. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 16వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 16,354 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 4,41,71,551 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో కేరళ లో ముగ్గురు, గోవా , గుజరాత్ లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతి చెందారు. భారత్ లో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,30,876కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.04 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.77 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ ప్రయాణకులను పరీక్షించేందుకు థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భారత్ నుంచి విదేశాలకు వెళ్లే వారికి మాత్రం కరోనా పరీక్షలు, ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని అధికారులు తెలిపారు.