చైనాకు మరోసారి చుక్కలు చూపిస్తున్న కరోనా

0
645

కరోనా మహమ్మారిని ప్రపంచం మీదకు చైనానే వదిలిందన్న వాదన కూడా ఉంది. ఒకానొక దశలో ప్రపంచ దేశాలు కరోనాతో అల్లాడుతూ ఉంటే చైనాలో మాత్రం పలు ఈవెంట్స్ ను ఎంతో గొప్పగా చేశారు. తాము కరోనాను కట్టడి చేసేశామన్న చైనాపై ఇప్పుడు మహమ్మారి పంజా విసిరింది. చైనాలో మళ్లీ కరోనా రక్కసి కోరలు చాచింది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నడూ లేనంతగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. అక్కడ నిన్న ఒక్కరోజే 31,454 కేసులు నమోదయ్యాయి. వీటిలో 27,517 కేసులు అసింప్టొమేటిక్ అని చైనా నేషనల్ హెల్త్ బ్యూరో వెల్లడించింది. తొలి నుంచి కూడా కరోనా నేపథ్యంలో చైనా కఠినమైన ఆంక్షలు విధిస్తోంది. పలు నగరాలను షట్ డౌన్ చేసేసింది. కఠినమైన ఆంక్షలు విధించడంతో చైనాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చైనాలోని జెంగ్‌జూలో ఉన్న యాపిల్‌ ఐఫోన్‌ ప్లాంట్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జీరో కోవిడ్ పాలసీ పేరుతో విధించిన ఆంక్షలతో విసుగెత్తిన ఉద్యోగులు బుధవారం ఉదయం ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. యాజమాన్యం వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. అదికాస్తా ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో ప్రభుత్వం జెంగ్‌జూ పట్టణంలో లాక్‌డౌన్‌ విధించింది. జెంగ్‌జూ ప్రాంతంలో యాపిల్‌ తయారీ కేంద్రం ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ ఉంది. ఇక్కడ ఐఫోన్లను తయారుచేస్తున్నారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్లాంట్‌లో పనిచేసే ఉద్యోగులు బయటకు వెళ్లకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దీంతోనే ఉద్యోగుల్లో కోపం తారాస్థాయికి చేరుకుని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలయ్యేలా జరిగింది.