More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారతదేశంలో గత 24 గంటల్లో 4.54 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 16,159 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 15,394 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 28 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,15,212కి పెరిగింది. ముందు రోజుతో పోల్చితే యాక్టివ్ కేసులు 0.26 శాతం పెరిగాయి. పశ్చిమబెంగాల్, తమిళనాడులో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 4,35,47,809కి పెరిగింది. వీరిలో 4,29,07,327 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,25,270 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.53 శాతంగా, పాజిటివిటీ రేటు 3.56 శాతంగా, మరణాలు రేటు 1.21 శాతంగా, క్రియాశీల రేటు 0.26 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 198.20 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.

    తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో.. చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాల్సిందేనని.. మాస్క్ ధరించని వారికి రూ. 500 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్ ధరించడంతో పాటు… బహిరంగ ప్రదేశాల్లో అందరూ భౌతికదూరాన్ని పాటించాలని ఆదేశించింది. కొనుగోలుదారులను ఒకేసారి పెద్ద సంఖ్యలో అనుమతించవద్దని మాల్స్, వాణిజ్య సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. మాల్స్, థియేటర్స్, వస్త్ర దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పని చేసేవారు మాస్క్ కచ్చితంగా ధరించాలని చెప్పింది. మాస్క్ లేనివారికి తమిళనాడు ప్రజా ఆరోగ్య చట్టం 1939 ప్రకారం రూ. 500 ఫైన్ విధిస్తామని హెచ్చరించింది.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,913 కరోనా పరీక్షలు నిర్వహించగా, 552 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో అత్యధికంగా 316 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 51, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 36, సంగారెడ్డి జిల్లాలో 28 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 496 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,03,374 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,94,510 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,753 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

    Trending Stories

    Related Stories