ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కాస్త తగ్గుతూ ఉంది. గడచిన 24 గంటల్లో 79,564 కరోనా పరీక్షలు నిర్వహించగా 13,756 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2,301 కొత్త కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో 2,155 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 397 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఏపీలో గత 24 గంటల్లో 104 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనే 20 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో 13 మంది, విశాఖ జిల్లాలో 10 మంది బలయ్యారు. ఈ నేపథ్యంలో మొత్తం మరణాల సంఖ్య10,738కి చేరింది. అదే సమయంలో 20,392 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 16,71,742 పాజిటివ్ కేసులు నమోదు కాగా 14,87,382 మంది కోలుకున్నారు. ఇంకా 1,73,622 మందికి చికిత్స జరుగుతోంది.
చిత్తూరు జిల్లాలో లాక్‌డౌన్ ఆంక్షలు మరింత కఠినతరంగా అమలు చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సరుకులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. జూన్ 1 నుంచి జిల్లాలో ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. చిత్తూరు జిల్లాలో కరోనాను కట్టడి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.
యాంటీ బాడీ కాక్ టెయిల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కూడా కోలుకుంటున్నారు. ఏపీలో ప్రథమంగా గుంటూరులో ఈ ఔషధాన్ని ఉపయోగించారు. గుంటూరులోని శ్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు కరోనా రోగులకు రీజెనరాన్ యాంటీబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ డోసులు ఇచ్చారు. దీన్ని వాడడం వల్ల ఆసుపత్రిలో ఎక్కువరోజుల పాటు చికిత్స పొందాల్సిన అవసరం ఉండదని వైద్యులు తెలిపారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యాక వీలైనంత త్వరగా ఈ ఇంజెక్షన్ ఇవాల్సి ఉంటుందని వివరించారు. ఈ యాంటీబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్లను ప్రభుత్వం విరివిగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు చెబుతూ ఉన్నారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో కరోనా బారినపడినప్పుడు వేసుకున్న ముందుగా అంతర్జాతీయంగా పేరును తెచ్చుకుంది. కాసిరివిమాబ్, ఇమ్‌డెవిమాబ్ అనే రెండు రకాల ఔషధ మిశ్రమమే ఇది. యాంటీబాడీస్ కాక్‌టెయిల్ ఔషధాన్ని అమెరికాకు చెందిన రోచె సంస్థ అభివృద్ధి చేసింది. యాంటీబాడీస్ కాక్‌టెయిల్ మందు ఒక్కోడోసు ధర రూ. 59,750. కాసిరివిమాబ్, ఇమ్‌డెవిమాబ్ అనే రెండు రకాల ఔషధ మిశ్రమమని చెప్పొచ్చు. ప్రముఖ ఫార్మా సంస్థలు సిప్లా-రోచ్ ఇండియా సంయుక్తంగా దీన్ని భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టాయి. ఒక్క ప్యాక్ ను ఇద్దరు రోగులకు వినియోగించవచ్చని తయారీదార్లు తెలిపారు. సాధారణ రిఫ్రిజిరేటర్లలో భద్రపరచవచ్చు. తక్కువ, ఓ మోస్తరు కరోనా లక్షణాలు ఉన్నవారికి దీన్ని అందించవచ్చు. ఇది వాడితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం చాలా తక్కువ అని రోచ్ ఇండియా, సిప్లా వర్గాలు వెల్లడించాయి.