More

    బాట్లా హౌజ్ కేసు : ఉగ్ర రాక్షసుడికి ఉరి..!

    ఉగ్ర రాక్షసుడికి తగినశాస్తి జరిగింది. బాట్లా హౌజ్ ఎన్‎కౌంటర్ కేసులో దోషిగా తేలిన అరిజ్ ఖాన్‎కు.. న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. బాట్లా హౌజ్ ఘటనను అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించిన ఢిల్లీ హైకోర్టు.. దోషికి మరణదండన విధిస్తూ తీర్పు చెప్పింది. దేశంలో సంచలనం సృష్టించిన బాట్లా ఎన్‎కౌంటర్ కేసులో టెర్రరిస్టు అరిజ్ ఖాన్‌ను దోషిగా తేలుస్తూ మార్చి 8న ఢిల్లీ కోర్టు తీర్పు చెప్పింది. ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన అరిజ్ ఖాన్‌ను దోషిగా నిర్ధారించింది. ఇన్‎స్పెక్టర్ మోహన్ చంద్ శర్మను అరిజ్ ఖాన్ హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ ససాక్ష్యాలతో సహా నిరూపించిందని కోర్టు విశ్వసించింది. దీంతో దోషికి మరణదండన విధిస్తూ తీర్పు వెలువరించింది.

    2008 సెప్టెంబర్‌ 13న ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో 30 మంది చనిపోగా వంద మందికిపైగా గాయపడ్డారు. ఆ తర్వాత 19న ఢిల్లీలోని జామియా నగర్‌లో బాట్ల హౌజ్‌‌ ఎల్‌-18 వద్ద ఉగ్రవాది అరిజ్‌ ఖాన్‌, అతడి నలుగురు అనుచరులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‎కౌంటర్‎లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో.. దేశంలో పలు ఉగ్రవాద దాడులకు పాల్పడిన ఇండియన్‌ ముజాహిదీన్ నాయకుడు, ఆపరేషన్స్ హెడ్ అతిఫ్ అమీన్‌తోపాటు మహ్మద్ సైఫ్, మహ్మద్ సాజిద్ మరణించారు. అయితే అరిజ్ ఖాన్‌, షాజాద్ అహ్మద్ అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఇండియన్‌ ముజాహిదీన్‌కు చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదులలో అరిజ్‌ ఖాన్‌ ఒకడు.

    మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహన్ చంద్ శర్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన మరణానికి అరిజ్‌ ఖాన్, అతడి అనుచరులు కారణమని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పారిపోయిన షాజాద్ అహ్మద్‌ను.. పోలీసులు అరెస్ట్‌ చేయగా 2013లో కోర్టు అతడ్ని దోషిగా నిర్ధారించింది. అయితే అరిజ్ ఖాన్‌ మాత్రం పదేళ్ల పాటు పోలీసుల కళ్లగప్పి తప్పించుకున్నాడు. అజమ్‌గఢ్‌కు చెందిన అతను వృత్తిరీత్యా ఇంజినీర్. ఇండియన్‌ ముజాహిదీన్‌ సభ్యుడిగా కేడర్‌ను బలోపేతం చేయడం, కొత్తవారిని నియమించుకోవడం అతని కీలక బాధ్యతలు. అంతేకాదు, ఉగ్రవాద సంస్థలకు నిధులు కూడా సమకూర్చేవాడు. అరిజ్‌ ఖాన్‌పై పలు కేసులు నమోదు చేసిన ఎన్‌ఐఏ అతడిపై 10 లక్షలు, బాట్లా ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఢిల్లీ పోలీసులు 5 లక్షల రివార్డు ప్రకటించారు. సుదీర్ఘ అన్వేషణ తర్వాత 2018 ఫిబ్రవరిలో ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు అరిజ్ ఖాన్‎ను అరెస్ట్‌ చేశారు.

    తాజాగా బాట్లా హౌజ్ ఎన్‎కౌంటర్ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు.. అరిజ్ ఖాన్‎కు మరణశిక్ష విధించింది. ప్రాసిక్యూషన్‌ సమర్పించిన ఆధారాలనుబట్టి ఆరిజ్‌ఖాన్‌ అతడి సహచరులు జరిపిన కాల్పుల కారణంగానే ఇన్‌స్పెక్టర్‌ ఎంసీ శర్మ మృతిచెందినట్టు భావిస్తున్నామని అడిషనల్‌ సెషన్స్‌ న్యాయమూర్తి సందీప్‌ యాదవ్‌ తెలిపారు. దీంతో ఇన్‎స్పెక్టర్ మరణానికి కారణమైన దోషికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పేు వెలువరించింది.

    Trending Stories

    Related Stories