మరో గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్.. ఆ వేరియంట్లపై కూడా సమర్థంగా

0
748

భారత్ బయోటెక్ తమ ‘కొవ్యాక్సిన్’ విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ లోని వేరియంట్ల పైనా, యూకే వేరియంట్ల పైనా కొవ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తోందని భారత్ బయోటెక్ తెలిపింది. కొవాగ్జిన్‌ టీకాతో భారత్‌లో ప్రబలంగా ఉన్న బీ.1.167 కరోనా రకంతో పాటు యూకే వేరియంట్‌ అయిన బీ.1.1.7 రకంపైనా సమర్థంగా పనిచేస్తోందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. అధ్యయన ఫలితాలను ఓ ప్రముఖ జర్నల్‌లో ప్రచురించింది. ఇప్పటి వరకూ కనుక్కున్న అన్ని వేరియంట్ల పైనా కొవ్యాక్సిన్ ప్రభావం చూపిస్తూ ఉందని.. ఈ రెండు రకాలను సమర్థంగా ఎదుర్కోగలిగే యాంటీబాడీలు కొవాగ్జిన్‌ టీకా వల్ల ఉత్పత్తవుతున్నాయని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ అధ్యయన పత్రాన్ని సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కొవ్యాక్సిన్ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని.. కొత్త వేరియంట్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడం గొప్ప విశేషమని సుచిత్ర ఎల్లా అన్నారు. జర్నల్ కు సంబంధించిన లింక్ ను కూడా షేర్ చేసుకున్నారు. అయితే వ్యాక్సిన్ పెద్ద ఎత్తున అందుబాటులోకి ఎప్పుడు వస్తుందో చెప్పాలని పలువురు కోరారు.

కొవ్యాక్సిన్ కు దేశీయంగా అత్యవసర వినియోగానికి ఆమోదం జనవరిలోనే లభించింది. భారత్‌తో పాటు వివిధ దేశాల్లో వెలుగులోకి వస్తున్న కరోనా రకాలపై టీకాలు ఏ మేర పనిచేస్తాయన్న దానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో భారత్‌ బయోటెక్‌ మంచి వార్తను చెప్పింది. మరో వైపు టీకాల ఉత్పత్తి సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉండడంతో వీలైనంత త్వరగా ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్లు వేయాలని భావిస్తూ ఉన్నారు.

సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య విరామాన్ని కేంద్రం ఇటీవల పొడిగించింది. కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలకు పెంచుతూ మే 13న నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఈ గడువు 4-6 వారాలుగా ఉండేది. పాత వ్యవధి ప్రకారం రెండో డోసు కోసం కొవిన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వాళ్ళు ఆసుపత్రులకు వెళితే.. సిబ్బంది వారిని తిప్పి పంపుతున్నారు. రెండో డోసు తీసుకోవాల్సిన గడువును ప్రభుత్వం పెంచిందని చెబుతున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికే రెండో డోసు కోసం రిజిస్టర్‌ చేసుకొని ఆసుపత్రికి వచ్చే వారిని తిప్పి పంపొద్దని స్పష్టం చేసింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

1 + eight =