భారతదేశంలో చిన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేస్తోంది. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. రెండేళ్ల నంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న వారికి కూడా ఈ వ్యాక్సిన్ వేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ సిఫారసు చేసింది. దీనిని అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని సూచించింది. రెండేళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారికి ఎమర్జెన్సీయూసేజ్‌కు కొన్ని నిబంధనలతో అనుమతి ఇవ్వొచ్చని పేర్కొంది. ఈ వ్యాక్సిన్ కేలవం 20 రోజుల గ్యాప్‌తోనే రెండు డోసులు వేయాల్సి ఉంటుంది. పిల్లలపై ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను కంపెనీ ఇంకా కొనసాగించనుంది. తొలి రెండు నెలల పాటు 15 రోజులకోసారి చొప్పున భారత్ బయోటెక్ కంపెనీ తమ వ్యాక్సిన్ సేఫ్టీ డేటాను డీసీజీఐకి అందించాలని నిబంధన విధించారు. ఇప్పటికే భారత్‌లో 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారికి జైడస్ కాడిలా ఫార్మా కంపెనీ డెవలప్ చేసిన వ్యాక్సిన్‌ను వేసేందుకు అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ కరోనా వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. సీరమ్ ఇన్స్టిట్యూట్ సైతం నొవావాక్స్ పేరుతో చిన్నారులకు టీకాను అభివృద్ధి చేసింది. ఏడు నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారుల కోసం రూపొందించిన ఈ టీకా.. క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతించింది. మరికొన్ని కంపెనీలు కూడా పిల్లల కోసం వ్యాక్సిన్లను తీసుకుని వస్తున్నాయి.