భారతదేశంలో తయారు చేసిన వ్యాక్సిన్ ‘కొవాగ్జిన్’ను తీసుకున్న వారు ఇకపై ఎలాంటి ఆక్షలు లేకుండా బ్రిటన్ వెళ్లి రావొచ్చు. తాము అధికారికంగా గుర్తించిన టీకాల జాబితాలో కొవాగ్జిన్‌ను కూడా చేర్చినట్టు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. బ్రిటన్ తాజా నిర్ణయంతో కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్నవారు ప్రయాణానికి ముందు కరోనా నిర్ధారణ పీసీఆర్ టెస్టు చేయంచుకోకుండానే ఫ్లైట్ ఎక్కేయొచ్చు. అయితే, బ్రిటన్ చేరుకున్నాక మాత్రం రెండు రోజుల్లోపు పీసీఆర్/లాటరల్ ఫ్లో టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ అనుమతులు (ఈయూఎల్) మంజూరు చేసిన టీకాలన్నింటికీ తాము గుర్తింపునిచ్చినట్టు బ్రిటన్ రవాణాశాఖ తెలిపింది. బ్రిటన్ వెళ్లాలని అనుకుంటున్న చాలా మందికి ఇది ఊరట కలిగించే అంశం.
భారతదేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 7,579 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఇది 543 రోజుల కనిష్టమని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గత 24 గంటల్లో నమోదైన మొత్తం కేసుల్లో 3,698 ఒక్క కేరళలోనే నమోదు అయ్యాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా 236 మంది కరోనాతో మరణించారు. వీటిలోనూ 180 మరణాలు కేరళలోనే నమోదు అయ్యాయి. తాజా కేసులతో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరుకోగా, 4,66,147 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కరోనా నుండి భారతదేశంలో 12,202 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3.39 కోట్లకు పెరిగింది. 1,13,584 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు కేంద్రం తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 117 కోట్లకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 31,514 కరోనా పరీక్షలు నిర్వహించగా, 137 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 54 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 172 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,74,692 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,67,171 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,538 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 3,983కి పెరిగింది.
ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 127 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 22 చొప్పున కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో కరోనా కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 184 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,206 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,71,371కి చేరుకుంది. మొత్తం 20,54,737 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,428 మంది మృతి చెందారు.