శివలింగంపై శాస్త్రీయ పరిశోధనకు నో..! జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు సంచలన తీర్పు..!!

0
727

జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. జ్ఞానవాపిలోని శివలింగం విషయంలో శాస్త్రీయ పరిశోధనలకు వారణాసి డిస్ట్రిక్ట్ కోర్టు నిరాకరించింది. దీంతో జ్ఞానవాపి వివాదంపై మరోసారి స్తబ్ధత నెలకొంది. అసలు జ్ఞానవాపి వివాదంలోకి ఓసారి తొంగిచూస్తే.. మసీదు ప్రాంగణంలోని దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు వీలు కల్పించమని ఐదుగురు మహిళలు గతంలో జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్న వారణాసి కోర్టు వీడియోగ్రఫీ సర్వేకు కోర్టు ఆదేశించగా పురావస్తు అధికారులు వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఇందులో ముస్లింలు కాళ్ళు చేతులు కడుక్కునే వజూఖానాలో ప్రాంతంలో శివలింగం బయట పడింది. దీంతో అది హిందువుల ఆరాధ్య దైవమైన కాశీ విశ్వేశ్వరుడని, శివలింగంపై కార్బన్ డేటింగ్ చేసి అది ఎప్పుడు ప్రతిష్టించబడిందో గుర్తించాలని హిందూ సంఘాలు మరో పిటిషన్ దాఖలు చేశాయి.

ఈ పిటిషన్ విచారణలో భాగంగా హిందూ సంఘాలతో పాటుగా ముస్లిం సంఘాల తరపున కూడా వాదనలు విన్న కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసును విచారించిన ‘అజయ్ కృష్ణ విశ్వేష’ హిందూ సంఘాల పిటిషన్‎ను కొట్టివేశారు. దీంతో శివలింగంపై కార్బన్ డేటింగ్ నిర్వహించే అవకాశం లేకపోయింది. ఈ తీర్పుతో హిందూ సంఘాలకు పెద్ద ఎదురు దెబ్బ అని పలువురు భావిస్తున్నారు. ఇప్పటివరకూ అనుకూలంగా తీర్పులు రాగా,.. తాజాగా వచ్చిన తీర్పులకు కాస్తంత నిరాశ చెందుతున్నారు. పత్రికలు కూడా ఇది హిందువులకు పెద్ద ఎదురుదెబ్బ అని రాశాయి. అయితే, ఈ తీర్పును ఇచ్చేటప్పుడు జడ్జి ‘విశ్వేష’ చేసిన వ్యాఖ్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒకరకంగా ఇది కూడా మంచికేనేమో అనే సందేహం కలుగుతుంది. ఈ తీర్పును వెలువరించే క్రమంలో జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మే 17 న సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉటంకించారు. ఈ తీర్పులో శివలింగం కనిపించిన స్థానాన్ని కాపాడాలని సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో శివలింగంపై కార్బన్ డేటింగ్ కానీ,.. ఏ విధమైన శాస్త్రీయ పరిశోధన కానీ జరిపితే అది పాక్షికంగా ధ్వంసం అయ్యే అవకాశముందని జడ్జి వ్యాఖ్యానించారు. ఒకవేళ అదే జరిగితే సుప్రీం ఆర్డర్ ను ఉల్లంఘించినట్లవుతుందని న్యాయమూర్తి విశ్వేష తెలిపారు. ఒకవేళ అది నిజమైన శివలింగమైతే అది ధ్వంసమైనప్పుడు హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లవుతుందని వ్యాఖ్యానించారు. ఈ కారణాలతోనే హిందూ సంఘాలు దాఖలు చేసిన కార్బన్ డేటింగ్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు జడ్జి అజయ్ కృష్ణ విశ్వేష వ్యాఖ్యానించారు. అయితే ఈ తీర్పు హిందూ పిటిషన్ దారులకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ ఇది తరుపరి విచారణలకు ఏమాత్రం అడ్డంకి కాబోదనే వాదన వినిపిస్తోంది. గతంలో వీడియోగ్రఫీ సర్వేలో హిందూ దేవాలయం లాంటి ఆకారాలు బయటపడటంతో దీనిపై విచారణ యధావిధిగా కొనసాగనుంది.

మొత్తానికి వారణాసి కోర్టు తాజా తీర్పుతో.. జ్ఞానవాపి వివాదం ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఈ సమస్య జ్ఞానవాపిది మాత్రమే కాదు.. దేశంలో ఇలాంటి వివాదాలు ఇస్లామిక్ దండయాత్రల నుండే మొదలయ్యాయి. మొఘలుల కాలంలో భారత్ లో భారీగా సాంస్కృతిక విధ్వంసం జరిగింది. హిందువులకు చెందిన ప్రధాన దేవాలయాలన్నిటినీ ధ్వంసం చేసి మసీదులు నిర్మించారు. అయోధ్య, కాశీ, మథురలు మొదలుకొని కొన్ని వేల దేవాలయాలను మొఘల్ పరిపాలకులు ధ్వంసం చేశారు. ఆ తర్వాత హిందువులు తమ దేవాలయాలను తిరిగి పొందాలని వందల ఏళ్ళుగా న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అయోధ్య విషయంలో విజయం సాధించగా ఇప్పుడు కాశీ విశ్వేశ్వరుడిని కూడా పొందడానికి న్యాయపోరాటం సాగిస్తున్నారు. ఏదేమైనా, కాశీ జ్ఞానవాపి విషయంలో కూడా ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అమలు కాబోదని ఇప్పటికే కోర్టు తేల్చిచెప్పడం కొంత ఊరట కలిగించే అంశం. అయితే జ్ఞానవాపి వివాదానికి సంపూర్ణ పరిష్కారం లభించే అవకాశాలైతే కనిపించడం లేదు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here