More

    కొడుకు శవం కోసం తల్లిదండ్రుల భిక్షాటన..!

    కన్నబిడ్డను కోల్పోయి పుట్టేడు దుఃఖంతో ఉన్న తల్లిదండ్రుల పట్ల జాలి చూపించాల్సింది పోయి.. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది అత్యంత అమానుషంగా ప్రవర్తించారు.

    రూ.50వేలు లంచం ఇవ్వాలని, లేకుంటే మీ కుమారుడి మృతదేహాన్ని ఇచ్చే ప్రసక్తేలేదని చెప్పారు. తాము పేదవాళ్లమని, అంత మొత్తం ఇచ్చుకోలేమని ఆ దంపతులు కాళ్లావేళ్లాపడి బతిమిలాడినా వాళ్ల రాతి గుండె కరగలేదు. దీంతో ఆ నిరుపేద తండ్రి డబ్బు కోసం ఇంటికి ఇంటికీ తిరుగుతూ బిచ్చమెత్తుకున్నారు.

    ఈ హృదయవిదారక ఘటన బిహార్‌లోని సమస్తీపూర్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుమారుడి మృతదేహాన్ని అప్పగించేందుకు ఆసుపత్రి సిబ్బంది డబ్బులు డిమాండ్‌ చేయడంతో.. డబ్బు కోసం సమస్తీపూర్‌కు చెందిన మహేశ్ ఠాకూర్, అతడి భార్య ఊరంతా తిరుగుతూ భిక్షమెత్తుకున్నారు. మహేశ్ ఠాకూర్ కుమారుడు కొద్ది రోజుల కిందట అదృశ్యమయ్యాడు. అయితే, కుమారుడి మృతదేహం సాదర్ హాస్పిటల్‌లో ఉందని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. అక్కడకు వెళ్లిన దంపతులకు హాస్పిటల్ సిబ్బంది రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

    ‘‘నా కుమారుడు కొద్ది రోజుల కిందట అదృశ్యమమయ్యాడు.. అతడు చనిపోయాడని, సమస్తీపూర్‌లోని సాదర్ ఆసుపత్రిలో మృతదేహం ఉంది.. వచ్చి తీసుకెళ్లాలని నాకు ఇటీవల ఫోన్ కాల్‌ వచ్చింది.. ఆసుపత్రికి వెళ్తే.. శవాన్ని అప్పగించడానికి రూ.50వేలు డిమాండ్ చేశారు.. మేం చాలా పేదవాళ్లం.. అంత మొత్తం ఎక్కడి నుంచి తీసుకొచ్చేది..’’ అంటూ మహేశ్‌ ఠాకూర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అస్పత్రి సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ హాస్పిటల్‌లో చాలా మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులే ఉన్నారు. గత కొన్ని రోజులుగా వారికి జీతాలు సరిగా చెల్లించడం లేదని రోగుల బంధువుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేసి తీసుకుంటున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

    కాగా, ఈ అంశంపై ఆసుపత్రి అధికారులు స్పందించారు. ఇది అమానవీయ ఘటన అని, బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని సివిల్ సర్జన్ ఎస్కే చౌధురి చెప్పారు. మరోవైపు, ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా అదనపు మెజిస్ట్రేట్‌ వినయ్‌ కుమార్‌ రాయ్‌ తెలిపారు. అయితే, మహేశ్ కుమారుడి మృతదేహం పోలీసు కస్టడీలో ఉందని, అందువల్లే అప్పగించడం సాధ్యం కాలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

    Trending Stories

    Related Stories