Right Angle

శీతల పర్వత యుద్ధం..
సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు..

‘‘వీరులే లేకపోతే మనం ఏమైపోతాం? చెత్తా చెదారం వలె మురిక్కాలువల్లో కొట్టుకుపోతాం. ఊరు పేరు లేకుండా ఏ తీరానికో కళేబరాలై చేరిపోతాం’’ అంటూ విచారం వ్యక్తం చేశారు అమెరికన్ కాల్పనిక రచయిత బెర్నార్డ్ మాల్మూడ్. శీతల పర్వత సానువుల్లో, చలి కొరడా ఝళిపిస్తుంటే సరిహద్దును కాపాడే యోధులు లేకుండా భారత భూభాగం తోడేళ్ల వశమయ్యేది.ఉత్త రాన కోటగోడలా విస్తరించి ఉన్న హిమాలయ పర్వతాలు భారత్‌కు పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్ దేశాలతో సరిహద్దుగా ఉంది. వ్యూహాత్మకంగా, ఆర్థికంగా హిమాలయ పర్వతాలు భారత్ కు కీలకం. ఉత్తర ప్రాంతం నుంచి సైనిక దాడులను నిరోధించి రక్షణ కల్పించడంలో హిమాలయాలు ప్రధానపాత్రను పోషిస్తున్నాయి.

2008-12 మినహాయిస్తే గడచిన ఎనమిదేళ్లుగా డ్రాగన్ సరిహద్దును తాకి సాహసాన్ని పరీక్షిస్తోంది. సైనిక పాటవానికి సవాలు విసురుతోంది. 2013 ఏప్రిల్ లో దౌలత్ బేగ్ ఓల్డీకి దక్షిణ ముఖంగా ప్రవహించే మృత నదిగా పిలిచే ష్యోక్ రివర్ మీదుగా… మరకత నీలవర్ణంతో మిలమిల మెరిసే ప్యాంగాంగ్ సో సరస్సు వైపు దూసుకు వచ్చింది చైనా యుద్ధ విమానం. అదే ఏడాది ఏప్రిల్ 17న తూర్పు లఢాక్ లోని డెప్సాంగ్ మైదానాలవైపు చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేశాయి పీఎల్ఏ బలగాలు. ఏప్రిల్ 23 నుంచి జరిగిన చర్చల నేపథ్యంలో మే 5న అధీన రేఖ నుంచి వెనక్కి తగ్గాయి చైనా సేనలు. తిరిగి గతేడాది కరోనా మహమ్మారి కోరలు సాచిన వేళ తూర్పు లఢాక్ లో తిరిగే డెప్సాంగ్-ప్యాంగాంగ్ సో ల వైపు చైనా బలగాలు చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేశాయి. వారిని నిలువరించే క్రమంలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ ఏడాది సరిగ్గా రెండో దఫా కరోనా మృత్యువు మోసుకొచ్చిన వేళ మళ్లీ యుద్ధజపం చేస్తోంది డ్రాగన్. భారత్ కూడా అందుకు తగినట్టుగానే భారీ ఎత్తున ఆయుధ సంపత్తిని అతి ఎత్తైన శీతల పర్వత సానువులకు చేర్చింది. వ్యూహాత్మక ప్రాంతాల్లో అధునాతన ట్యాంకర్లను మోహరించింది. శీతాకాలంలో సైబీరియా నుంచి దక్షిణాసియా వైపు వీచే అతి శీతల పవనాలు కనిపించని శతృవు వలె భారత సైన్యాన్ని వెంటాడతాయి.

ప్ర‌పంచంలో అత్యంత విధ్వంస‌కారి అయిన భీష్మ టీ-90 యుద్ధ ట్యాంకుల‌ను మోహ‌రించింది. కొంత కాలంగా గాల్వ‌న్ లోయ‌లో క‌వ్వింపు చ‌ర్య‌లకు పాల్ప‌డుతున్న చైనాకు గట్టి బుద్ధి చెప్పాలని భారత్ భావిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తేలికపాటి ట్యాంకర్ లను మోహరించింది. ఈ ఏప్రిల్ మాసంలో మ‌ధ్య‌, తూర్పు ల‌డ‌ఖ్ ప్రాంతానికి 25 టన్నుల బరువుగల 350 తేలికపాటి ట్యాంకర్లను తరలించింది. తక్కువ బరువు గల ట్యాంకర్లను అవసరమైతే జల, వాయు, రహదారి మార్గంలో వేగంగా తరలించేందుకు అనుగుణంగా వీటిని తయారు చేసింది భారత ఆయుధ పరిశోధన సంస్థ. డ్రాగన్ కవ్వింపు చర్యల నేపథ్యంలో భారత సైన్యం.. యుద్ధ సన్నద్ధత చాటుతోంది. తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంట భారీగా బలగాల మోహరింపు హిమగిరుల్లో వేడి పెంచుతోంది. 14,500 అడుగుల ఎత్తులో భారీ ట్యాంకర్లు, దళాలతో చైనాతో-చలితో సమరానికి సై అంటోంది భారత్. వర్షాకాల ఆరంభం నాటికి మోహరింపులను తీవ్రం చేయాలని నిర్ణయించింది భారత సైన్యం. శత్రువుపై విరుచుకుపడగలిగే అధునాతన ట్యాంకర్లు. వర్ష రుతువులోనూ ప్రత్యర్థిని చీల్చిచెండాడే సుశిక్షిత పదాతిదళాలు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రణక్షేత్రంలో దేశానికి కాపలాగా నిల్చున్నాయి. గతేడాది చైనా కవ్వింపు చర్యలకు పాల్పడినపుడు 50 టన్నుల బరువుగల టి-90, టి-72 ట్యాంకర్లను మోహరించింది. తాజాగా 68.5 టన్నుల బరువుగల అర్జున్ ట్యాంకర్లను సరిహద్దుకు తరలించింది.

వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధ సన్నద్ధతో ఉండే offensive mountain corps-OMC బలగాల కోసం డీఆర్డీఓ-ఎల్ అండ్ టీ సంస్థలు ఉమ్మడిగా తక్కువ బరువుగల ట్యాంకర్లను తయారు చేశాయి. ట్యాంకర్ల మోహరింపునకు సంబంధించి గతంలో అవలంబించిన కాంపోజిషన్ టేబుల్ ను మార్చింది. ప్రమాదం పొంచి ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో మెరుపువేగంతో దాడికి దిగేందుకు అనుగుణమైన ఆయుధ సామాగ్రిని సమకూర్చింది. తూర్పు లద్దాఖ్లోని చుమార్-దెమ్చోక్ నియంత్రణ రేఖ వద్దకు… భారీగా సైన్యాన్ని, యుద్ధ పరికరాలను తరలించింది. చైనా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు టీ-90, టీ-72 ట్యాంకులను మోహరించింది భారత ఆర్మీ. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని -40 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద పోరాడగల బీఎంపీ-2 పదాతిదళాన్ని సన్నద్ధం చేసింది. ట్యాంకుల్లో ఇంధనం గడ్డకట్టుకుపోకుండా 3 రకాల ఇంధనాలను 2020 డిసెంబర్ చివరి వారం నాటికే అందుబాటులో ఉంచింది. సింధూ నది ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని.. అడ్డంకులన్నీ అధిగమించేలా ట్యాంకులను సిద్ధం చేసుకుంటోంది. అవాంఛనీయ సంఘటనలు జరిగితే నిమిషాల్లోనే నియంత్రణ రేఖ వద్దకు చేరుకునేలా చూసుకుంటోంది సైన్యం. ఇదే దూకుడుతో ప్రస్తుతం దక్షిణ పాంగాంగ్ సరస్సు వద్ద కీలక శిఖరాలపై పట్టు సాధించింది.

భారత్-చైనా సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు ఇప్పుడప్పుడే చల్లారే సూచనలు కనిపించటం లేదు. చైనా దురాక్రమణలను దీటుగా తిప్పికొడుతున్న భారత్.. ప్రస్తుతం ఎల్ఏసీ వెంబడి 50,000 మంది సైనికులను మోహరించింది. శత్రుసైన్యాన్ని ఎదుర్కొనేందుకు పదాతిదళాలతో పాటు శతఘ్నులు, ట్యాంకులు సన్నద్ధంగా ఉన్నాయి. చైనా వ‌ద్ద కూడా టీ 90 ట్యాంక‌ర్లు ఉన్నాయి. భీష్మా త‌ర‌హాలోనే ఉన్నా.. మ‌న ట్యాంక‌ర్ల‌తో ఢీకొట్ట‌లేవు. చైనా వ‌ద్ద 3500 టి 90 ట్యాంక‌ర్లు ఉండ‌గా, మ‌న వ‌ద్ద 4292 భీష్మా టీ90 ట్యాంక‌ర్లు ఉన్నాయి. స‌రిహ‌ద్దుల్లోకి చైనా సాయుధ వాహ‌నాల‌ను త‌ర‌లిస్తోంద‌న్న స‌మాచారం అంద‌గానే భార‌త్ కూడా అన్ని విధాలా సిద్ధ‌మౌతోంది. లడఖ్ ప్రాంతంలోని చైనా స‌రిహ‌ద్దుల్లో పోరాటానికి అత్యంత అనువైన యుద్ధ ట్యాంకు భీష్మా. ఇసుక నేల‌ల్లో వేగంగా దూసుకుపోగ‌ల సామ‌ర్థ్యం దీని సొంతం. డెమ్‌చౌక్, స్పాంగూర్ ప్రాంతాల్లో ఇలాంటి నేల‌లే ఉంటాయి. అందుకే త‌గిన ఆయుధాన్ని భార‌త్ సిద్ధం చేసుకుంది. చైనా రహదారి డెమ్‌చౌక్, స్పాంగూర్ గ్యాప్ నుంచి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో వీటిని మోహ‌రించార‌ని స‌మాచారం. చైనా వైపు నుంచి ఏమాత్రం క‌వ్వింపు చ‌ర్య‌లు మొద‌లైనా భీష్మాతో విరుచుకుప‌డటం ఖాయంనగా కనిపిస్తోంది. సైనిక మోహరింపులను వెనక్కి తీసుకుంటున్నట్టూ ఒకవైపు చెపుతూనే మరోవైపు పశ్చిమ హిమాలయాల్లో బలగాలను దింపుతోంది చైనా. గత ఏప్రిల్ చివరి వారం-మే మొదటి వారంలో సైన్యం చేతికి అందిన ఉపగ్రహ చిత్రాలు చూసిన భారత సైన్యం సుమారు 2వందల ట్యాంకులను మోహరించినట్టూ గుర్తించింది.

అతి ఎత్తైన హిమాలయ సానువుల్లో భారీ ఆయుధ సామాగ్రిని మోహరించడం కష్టం. వాయుపీడన శక్తి తక్కువగా ఉండటం, గడ్డకట్టే స్వభావం కారణంగా ట్యాంకర్లను సంభాళించడం కష్టం. కొన్ని సందర్భాల్లో ట్యాంకర్లు ఎందుకూ పనిరాకుండా పోయే ప్రమాదమూ ఉంటుంది. ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి కనీసం అరగంట పాటైనా వాటిని స్టార్ట్ చేసి ఉంచాలి. లేదంటే శీతల వాతావరణం కారణంగా పనిచేయవు. ఈ కారణంగానే ప్యాంగాంగ్ సో సరస్సు వద్ద గల సరిహద్దుల నుంచి భారత్-చైనాలు ఉద్రిక్తత తగ్గగానే ట్యాంకర్లను ఉపసంహరించుకుంటాయి. అయితే గతేడాది నుంచి అలాంటి స్థితి లేదంటారు సైనిక రంగ నిపుణులు. వాయుసేన-అర్టిలరీ బలగాలను హిమాలయాల్లో సుదీర్ఘకాలం మోహరించడం అసాధ్యం. ఈ కారణంగానే 1962 ఇండో-చైనా యుద్ధంలో ఈ రెండు బలగాలూ పరిమిత పాత్రను పోషించాయి. ఈ యుద్ధ సమయంలోనే మూడు తక్కువ బరువుగల AMX-13 ట్యాంకర్లను దక్షిణ ప్యాంగాంగ్ సో వద్దకు చేరవేయడానికి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ కారణంగానే భారీ యుద్ధ ట్యాంకర్ల మోహరింపు క్లిష్టంగా మారుతుందంటారు సైనిక వ్యూహకర్తలు.

మోహరింపులు-ఆయుధ సామాగ్రి చేరవేతలో సాహసం చేయని కారణంగానే 1962 ఇండో-చైనా యుద్ధంలో సుమారు 8వేల మంది భారత సైనికులు వీరమరణం పొందారు. వందల మంది చైనా సైన్యం చేతికి చిక్కారు. మరింత మంది గాయపడ్డారు. అంతిమంగా అక్సాయ్ చిన్ ను కోల్పోయాం. ఈ యుద్ధంలో చైనా కోల్పోయింది కేవలం 722 మంది సైనికులను. మరో 1697 మంది చైనా సైనికులు గాయపడ్డారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న భారత సైన్యం మారిన సాంకేతికత సాయంతో భారీ యుద్ధ ట్యాంకర్లను, వాటికి సాయంగా తక్కువ బరువు గల ట్యాంకర్లను మోహరించాలని నిర్ణయించింది. MBTలు గా పిలిచే ప్రధాన యుద్ధ ట్యాంకుల తయారీ విషయంలో భారత్ ముందు జాగ్రత్త కారణంగా రష్యా సాయం తీసుకున్నది. అర్జున ట్యాంకర్ మాత్రం పూర్తి పూర్తి సాంకేతిక పరిఙ్ఞానంతో తయారైంది.

రష్యా సాంకేతికతతో తయారైన ట్యాంకులు శీతల యుద్ధ మైదానాల్లో సమర్థవంతంగా పనిచేస్తాయి. ప్రస్తుతం భారత్ యుద్ధ ట్యాంకుల సామర్థ్యం సుమారు 4వేలు. చైనా ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచీ ట్యాంకర్ తయారీపై దృష్టి సారించింది. Type 59, Type 69, Type 80/88 ట్యాంకర్లను రక్షణ కోసం ప్రస్తుతం వాడుతోంది. మరో మూడు రకాల అధునాతన ట్యాంకర్ మోడళ్లు Type 96, Type 99 లు మెయిన్ బ్యాటిల్ ట్యాంకర్లు. ఇటీవలి కాలంలో చైనా తయారు చేసింది Type 15 మాత్రమే! చైనా అమ్ములపొదిలో ఉన్న టైప్-96, 99 మోడళ్లు 42, 54 టన్నుల బరువున్న భారీ ట్యాంకర్లు. వీటికి 125mm గన్స్ ను అమర్చింది. భారత ట్యాంకర్లతో పోల్చితే మన వద్ద ఉన్న టి-72, టి-90 సహా అర్జున్ ట్యాంకర్ల బరువు 41, 46, 68 టన్నుల బరువు ఉంటాయి. టి-72,90 ట్యాంకర్లకు 125 ఎంఎం గన్స్, అర్జున ట్యాంకర్ కు 120 ఎంఎం గన్స్ అమర్చబడ్డాయి. ప్రస్తుతం టిబెట్ సరిహద్దుల్లో మోహరించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాల వద్ద టైప్-15 ట్యాంకర్లు ఉన్నాయని తెలుస్తోంది. వీటికి 105 ఎంఎం గన్స్ అమర్చారు. అయితే శీతల యుద్ధ మైదానాల్లో పనిచేసేందుకు టైప్-15 అనుగుణంగా ఉండటం కారణంగానే వాటి మోహరింపు విషయంలో చైనా శ్రద్ధ తీసుకుందంటారు నిపుణులు. భారత్ సైతం ఇదే తరహా తేలికపాటి ట్యాంకర్లను మోహరించింది.

హిమాలయ పర్వతాల్లోని కనుమలు చాలా ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. 1962 యుద్ధంలో అరుణాచల్ హిమాలయాల్లోని తవాంగ్ కనుమలను రక్షించుకోలేకపోవడంతోనే చైనా సైన్యాలు సులువుగా అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించగలిగాయి. తూర్పు హిమాలయ ప్రాంతంలో భారత్-చైనాలను విడదీసే ‘మెక్‌మోహన్ రేఖ’వద్ద హిమాలయ పర్వతాలు, వాటి కనుమలను పూర్తిగా భారతదేశం కిందకు తేవడంతో చైనా ఈ ప్రాంతంలో భారత్‌లోకి చొచ్చుకు రావడం చాలా కష్టం. అయితే కొన్నిసందర్భాల్లో ఊహించని విధంగా చొచ్చుకు వచ్చినా ప్రతిఘటించే విధంగా సైన్యం సన్నద్ధమైంది. మొత్తంగా మరోసారి భారత్-చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు చెలరేగితే ప్రాణ నష్టం జరగకుండా శతృవును నిలువరించేందుకు సర్వసన్నద్ధంగా ఉంది. కరోనా వేళ దేశ రక్షణకోసం ప్రాణాల్ని ఫణంగా పెట్టిన సైన్యానికి మనమంతా మద్దతుగా ఉందాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

2 + 20 =

Back to top button