బీజేపీ ఆఫీసులో ఆత్మహత్య చేసుకున్న పోలీసు అధికారి

0
715

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం నాడు 48 ఏళ్ల పోలీసు అధికారి తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. డ్యూటీలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాల 4వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్ గా రాజ్‌కుమార్ నేతమ్‌ని నియమించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మౌదాపర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏకాత్మ కాంప్లెక్స్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన డ్యూటీ నిర్వహిస్తూ ఉన్నాడు. రాజ్‌కుమార్ నేతమ్‌ అక్కడే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు కంకేర్ జిల్లాకు చెందిన వాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సీనియర్‌ పోలీసు అధికారులు, సైబర్‌ సెల్‌ అధికారులు, ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో సోదాలు నిర్వహించి క్లూస్ ను సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.