కేంద్ర ప్రభుత్వం మరో మంచి వార్త తెలిపింది. వంట నూనెల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వంటనూనె ధరలను తగ్గిస్తున్నట్లు శుక్రవారం కేంద్రం వెల్లడించింది. లీటర్ వంట నూనెపై రూ. 5 నుంచి, రూ. 20 వరకు తగ్గించింది. పామాయిల్‌పై రూ. 20, వేరుశెనగ నూనెపై రూ. 18, సోయాబీన్‌పై రూ. 10, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై రూ. 7 తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో దేశ ప్రజలకు కాస్త ఊరట కలిగినట్లైంది.
ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గింపుతో సహా పలు చర్యలతో దేశవ్యాప్తంగా ప్రధాన రిటైల్ మార్కెట్లలో వంట నూనెల ధరలు కిలోకు రూ.5-20 తగ్గాయని ఆహార కార్యదర్శి సుధాన్సు పాండే శుక్రవారం తెలిపారు. బ్రాండెడ్ ఆయిల్ తయారీదారులు కూడా కొత్త స్టాక్ ధరలను సవరించారని కోరారు. “అధిక ధరల నుండి వినియోగదారులకు ఉపశమనం లభించేలా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ప్రధాన రిటైల్‌లో ఎడిబుల్ ఆయిల్ ధరలు కిలోకు రూ. 5 మరియు 20 రేంజ్‌లో గణనీయంగా తగ్గాయి” అని పాండే విలేకరుల సమావేశంలో అన్నారు. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ధరలను స్థిరీకరించడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
తగ్గిన పెట్రోల్-డీజిల్ ధరలు:
దీపావళి పండుగ సందర్భంగా జనాలకు కేంద్ర ప్రభుత్వం కొంత ఊరట కలిగించింది. పెట్రోల్, డీజిల్ పై సుంకాన్ని తగ్గిస్తున్నట్టు తెలిపింది. లీటరు పెట్రోల్ పై రూ. 5, లీటరు డీజిల్ పై రూ. 10 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుంకాలను తగ్గిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కొన్ని గంటల్లోనే బీజేపీ అధికారంలో ఉన్న తొమ్మిది రాష్ట్రాల్లో కూడా పెట్రోలు, డీజిల్ ధరలపై పన్నులను స్వల్పంగా తగ్గించాయి. అస్సాం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ధరలు తగ్గించాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.6.07, డీజిల్ ధర లీటర్ రూ.11.73 తగ్గింది. దీనితో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు వరుసగా రూ.104.01, రూ.86.71కి చేరాయి. చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ రూ.5.27 తగ్గి రూ.101.38 వద్ద ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.11.15 తగ్గి రూ.91.42 వద్దకు చేరింది. బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ రూ.6.29 తగ్గి రూ.107.62 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర రూ.12.45 తగ్గి రూ.92.02 వద్దకు చేరింది. ముంబయిలో పెట్రోల్ ధర లీటర్ రూ.5.87 తగ్గి రూ.109.96 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.12.46 దిగొచ్చి రూ.94.13 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా లీటర్‌కు రూ.5.82, రూ.11.75 పైసల చొప్పున తగ్గాయి. దీనితో లీటర్ పెట్రోల్ ధర రూ.104.65 వద్దకు చేరింది. డీజిల్ ధర లీటర్ రూ.89.78 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో పెట్రోల్ లీటర్ ధర రూ. 6.33 తగ్గి రూ. 108.18గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 12.79 తగ్గి రూ. 94.61గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిలో లీటరు పెట్రోల్ ధర రూ.110.67కు, డీజిల్ ధర రూ.96.08కు తగ్గింది.