More

  మతం మారిన వారికి రిజర్వేషన్లెందుకు..? కేంద్ర ప్రభుత్వ కమిటీపై VHP ఆగ్రహం..!

  కొన్ని శతాబ్దాలుగా నిమ్నకులాల వారు భారత్‎లో తీవ్ర అణచివేతకు గురవుతున్నారు. అందుకే, సమాజంలో అసమానతలను రూపుమాపడానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపరిచారు. నిమ్నకులాల వారు ఆర్థికంగా స్థిరపడితే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని ఆయన భావించారు. అయితే, ఆ మహనీయుడు రిజర్వేషన్లకు ఆనాడే పరిమితులు కూడా విధించారు. రిజర్వేషన్లు నిమ్నవర్గాలను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేవరకేనంటూ స్పష్టంగా తెలియజేశారు. కానీ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా.. నిమ్నవర్గాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడంలో మన పాలకులు విఫలమయ్యారు. పైగా అట్టడుగు వర్గాలను ఓటుబ్యాంకులుగా మార్చుకుని రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. దీంతో ఇప్పటికీ రిజర్వేషన్ల అవసరం కొనసాగుతోంది.

  మొదట ఈ రిజర్వేషన్ల వ్యవస్థ కేవలం హిందూ మతంలోని కులాల్లో మాత్రమే ఉండేది. ఆ తర్వాత 1956 లో సిక్కులకు, 1990లలో బౌద్దమతంలోని నిమ్నకులాలకు కూడా ఈ రిజర్వేషన్లు లభించేలా రాజ్యాంగాన్ని సవరణ చేశారు. కాలక్రమంలో ఈ మూడు మతాలకు చెందిన నిమ్నవర్గాలకు చెందిన కొందరు ప్రజలు.. క్రిస్టియన్, ఇస్లాం మతాల్లోకి మారడం జరగింది. అయితే, ఆ మతాల్లో కుల ప్రస్తావన ఉండదు కాబట్టి.. వారికి రిజర్వేషన్లు అవసరం లేదని రాజ్యాంగ రూపకర్తల నుంచి సుప్రీం కోర్టు దాకా అందరూ భావించారు. అయినా కూడా ఆయా వర్గాల నుంచి పదే పదే విజ్ఞప్తులు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ వర్గాలకు రిజర్వేషన్ పై సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఓ కమిటీని రూపొందించింది. సుప్రీం కోర్డు మాజీ న్యాయమూర్తి కేజీ బాలకృష్ణణ్ అధ్యక్షతన నియమించిన కమిటీ దీనిపై అధ్యయనం చేయనుంది. అయితే ఈ కమిటీపై హిందూ సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం ద్వారా నిజమైన షెడ్యూల్డ్ కులాల వారికి తీవ్రంగా అన్యాయం జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఈ కమిటీని తాజాగా వీహెచ్‎పీ తీవ్రంగా వ్యతిరేకించింది.

  షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లను అబ్రహామిక్ మతాల వారికి ఇవ్వడాన్ని వీహెచ్ పీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సంస్థ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు అలోక్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి వీహెచ్ పీ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ కమిటీ గురించి అలోక్ రెమార్ బెంగళూరులో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. గతంలో నెహ్రూతో పాటు రాజీవ్ గాంధీ, దేవెగౌడ, మన్మోహన్ సింగ్ లాంటి ప్రధానులు కూడా ఇదే విధంగా ఇతర మతాలవారికి రిజర్వేషన్ కల్పించడానికి పూనుకున్నారన్నారు. కానీ, ఈ ప్రధానులందరిపైనా షెడ్యూల్డ్ కులాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వారందరూ రిజర్వేషన్ పై వెనక్కితగ్గారని గుర్తుచేశారు. 2005లో సచార్ కమిటీ, 2009లో రంగనాథ్ కమిటీ లు కూడా ఈ రిజర్వేషన్ లపై కొన్ని సూచనలు చేసినా, నివేదికల్లో ఆచరణ సాధ్యం కాని తప్పులున్నాయని అలోక్ కుమార్ అన్నారు. క్రిష్టియన్, ఇస్లాం మతాల్లో కులాలు లేనప్పుడు రిజర్వేషన్లెందుకని ప్రశ్నించారు. దీంతో పాటు సుప్రీం కోర్టు సైతం గతంలో ఇచ్చిన ఎన్నో తీర్పుల్లో మత మార్పిడీ చేసుకున్నవారి రిజర్వేషన్లను వ్యతిరేకించిందని తెలియజేశారు. అందుకే నిజమైన షెడ్యూల్డ్ కులాలకు చెందిన రిజర్వేషన్లను ఇతర మతాల వారు దొంగిలించడాన్ని వీహెచ్ పీ ఏమాత్రం ఒప్పుకోదనీ,.. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తామని అంతర్జాతీయ కార్యదర్శి అలోక్ కుమార్ అన్నారు.

  ఇక కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏవిధమైన నివేదిక ఇస్తుందోననే సందేహాలు ప్రతిఒక్కరిలో నెలకొన్నాయి. ఇతర మతాల్లో కులాల ప్రస్తావన ఉండదు కాబట్టి వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తుందో, లేక ఆ మతాల్లో కూడా అంటరానితనం ఉందని గుర్తించి వారికి రిజర్వేషన్లను తీసుకురావాలని నిర్ణయిస్తుందో వేచి చూడాల్సిందే..

  Trending Stories

  Related Stories