నెలలు గడుస్తున్నా నుపుర్ శర్మ వివాదాన్ని మాత్రం ముస్లిం వర్గం వదలడం లేదు. ఇప్పటి వరకు దేశంలో ఎన్నో వివాదాలు జరిగినా కొద్ది రోజులకే పరిమితం అయ్యాయి. కానీ నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మాత్రం ఆ వర్గం వాళ్లు విడిచిపెట్టడం లేదు.
ఎంతసేపు ఈ వివాదాన్ని మరింత జఠిలం చేసే విధంగా ప్రయత్నిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకప్పుడు నిందించిన సుప్రీంకోర్టు కూడా నుపుర్ శర్మకు అండగా నిలిచింది. అయినా కూడా ఆమెకు ప్రాణహాని ముప్పు తప్పడం లేదు. నుపుర్ శర్మను చంపేందుకు ఏకంగా పాకిస్తానీ దేశ సరిహద్దులు దాటి రావడం ఒక ఎత్తు అయితే.. నుపుర్ వీడియోలు చూస్తున్న ఓ వ్యక్తిపై దుండగులు కత్తితో దాడి చేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మను చంపేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి సరిహద్దు దాటి భారత్‌లోకి వచ్చాడు. సరిహద్దు వద్ద పెట్రోలింగ్ టీమ్‌కు అనుమానాస్పదంగా కనిపించిన ఆ వ్యక్తిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 11 అంగుళాల కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. నిందితుడిని పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని మండీ బహౌద్దీన్ పట్టణానికి చెందిన రిజ్వాన్ అష్రాఫ్‌గా గుర్తించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సంయుక్త బృందం అతడిని విచారిస్తోంది.
జులై 16న రాత్రి 11 గంటల సమయంలో రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్ జిల్లాలోని హిందుమాల్కోట్ బోర్డర్ అవుట్‌పోస్ట్ సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందికి ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో కనిపించాడు. వెంటనే అతడిని నిర్బంధంలోకి తీసుకొని విచారించినట్టు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. నిందితుడి వద్ద ఉన్న బ్యాగులో కత్తితో పాటు మతపరమైన సాహిత్యం, దుస్తులు, ఆహారం, ఇసుకను గుర్తించినట్టు తెలిపారు. తన పేరు రిజ్వాన్ అష్రాఫ్ అని, మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను హత్య చేసేందుకు అంతర్జాతీయ సరిహద్దులు దాటుకొని వచ్చినట్టు ప్రాథమిక దర్యాప్తులో అతడు చెప్పాడని పోలీసులు చెబుతున్నారు. తొలుత అజ్మీర్ దర్గాను దర్శించుకొని ఆ తర్వాత తన ప్రణాళిక అమలు చేయాలని భావించినట్లు విచారణలో అతడు అంగీకరించాడని చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ 8 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, మిలటరీ ఏజెన్సీలతో కూడిన సంయుక్త బృందం అతడిని విచారిస్తోంది.
మరోవైపు ఇటీవల నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన ఇద్దరు వ్యక్తుల్ని దారుణంగా చంపేయడం కలకలం రేపింది. ఉదయ్ పూర్, అమరావతి ఘటనలు మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బీహార్ రాష్ట్రంలోని సీతామర్హిలో ఇలాంటి ఘటనే తెరపైకి వచ్చింది. నుపుర్ శర్మ వీడియోను చూస్తున్న వ్యక్తిని కొంతమంది దుండగులు చంపేందుకు ప్రయత్నించారు. పరిగెత్తిస్తూ కత్తితో దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బాధితుడిని సీతామర్హి ప్రాంతానికి చెందిన అంకిత్ ఝాగా గుర్తించారు. ఈ దాడిలో అంకిత్ ఝా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కూడా జూలై 16నే జరగడం గమనార్హం. ఈ ఘటనలో మొత్తం ఐదుగురి ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు వీరిలో నాన్ పూర్ గ్రామానికి చెందిన గౌరా అలియాస్ మహ్మద్ నిహాల్, మహ్మద్ బిలాల్ గా గుర్తించారు.
అంకిత్ ఝా పాన్ షాప్ వద్ద నిలబడి నుపుర్ శర్మ వీడియో చూస్తున్న క్రమంలో అక్కడే సిగరెట్ తాగుతున్న వ్యక్తితో వాగ్వాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తర్వాత నిందితుడు అతని అనుచరులతో వచ్చి అంకిత్ పై ఆరుసార్లు కత్తిలో పొడిచారు. ప్రస్తుతం అంకిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో పోలీసుల దర్యాప్తుపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనకు నుపుర్ శర్మ అంశానికి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. కానీ అంకిత్ ఝా కుటుంబ సభ్యులు మాత్రం నుపుర్ శర్మ వీడియో చూస్తున్న సమయంలోనే దాడి జరిగిందని చెబుతున్నారు. దాడికి సంబంధించి నుపుర్ శర్మ కేసు గురించి ఫిర్యాదులో నమోదు చేశామని.. ఆ తరువాత పోలీసులు దానిని మార్చారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండో ఫిర్యాదులో నుపుర్ శర్మ పేరును తొలగించారని ఆరోపిస్తున్నారు. ప్రధాన నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. నుపుర్ శర్మకు మద్దతు తెలిపారని ఇటీవల ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య లాల్ ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా తల నరికి హత్య చేశారు. దీని కన్నా ముందుగా మహారాష్ట్ర అమరావతిలో ఉమేష్ కోల్హే అనే వ్యక్తిని కూడా ఇదే విధంగా చంపేశారు. ఈ రెండు ఘటనలపై ప్రస్తుతం ఎన్ఐఏ విచారణ జరుపుతోంది.
ఇక నుపుర్ ను ఏ కోర్టు అయితే మందలించిందో అదే కోర్టు అండగా నిలిచింది. ఏ కోర్టు అయితే నిందించిందో అదే కోర్టు అక్కున చేర్చుకుంది. బీజేపీ మాజీ నాయకురాలు నుపుర్ శర్మకు తాజాగా ఊరట లభించింది. ఆమెను అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేయడం కుదరదని చెప్పింది. అలాగే ఆమెపై నమోదైన ఎఫ్ఐఆర్లపై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోరాదని సుప్రీంకోర్టు తాజాగా తెలిపింది. జస్టిస్ సూర్య కాంత్, జేబీ పర్దివాలాతో కూడిన ధర్మానం ఈ తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. ప్రవక్త మహమ్మద్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై అనేక రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను క్లబ్ చేయాలని, తన అరెస్ట్‌పై స్టే విధించాలని కోరుతూ నుపుర్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దాంతో సుప్రీంకోర్టు ఈ విధమైన ఆదేశాలు జారీ చేసింది. కొన్నిరోజుల క్రితం నుపుర్ శర్మ ఓ టీవీ కార్యక్రమంలో మహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో దేశంలో అల్లర్లు జరిగాయి. చాలా రాష్ట్రాల్లో నిరసనలు చేపట్టారు. ఆ నిరసనలు హింసాత్మకంగా కూడా మారాయి. అలాగే ఆమె కామెంట్ల వల్ల అంతర్జాతీయంగా కూడా భారత్‌పై వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో ఆమెపై అనేక రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో నుపుర్ శర్మ తనకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలో ఆమె పిటిషన్ విచారణ సమయంలో సుప్రీంకోర్టు నుపుర్ శర్మపై నిప్పులు కురిపించింది. పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఉంటే ఎలాగైనా మాట్లాడొచ్చా..? అని ప్రశ్నించింది. ఆమె వ్యాఖ్యలపై వల్ల దేశ భద్రతే ప్రశ్నార్థకమైందని, ఎన్నో చోట్ల అల్లర్లు జరిగాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దానికి నుపుర్ శర్మ బాధ్యత వహించాలని, దేశానికే క్షమాపణ చెప్పాలని కోరింది. అయితే సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై మాజీ జడ్జ్‌ల నుంచి నిరసన వ్యక్తమైంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై పునరాలోచించాలని కోరుతూ వారంతా ఓ లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు నుపుర్ శర్మకు ఊరటనివ్వడం గమనార్హం.