హిందూ మతం వేరు.. హిందుత్వం వేరు కాదు అని అందరికి తెలిసిన విషయమే. హిందువుగా పుట్టి హిందూత్వాన్ని పాటిస్తుంటాం. మరి అలాంటప్పుడు ఆ రెండు వేరు వేరుగా ఎలా అవుతాయో అర్ధం కానీ ప్రశ్న. ఐతే కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను హిందూ వ్యతిరేకిని కాదని, హిందుత్వ వ్యతిరేకిని అని అన్నారు. హిందుత్వ హింసను, హత్యలను, విభజనను ప్రోత్సహిస్తుందని అన్నారు. హిందుత్వం రాజ్యాంగానికి విరుద్ధమని తెలిపారు. హిందుత్వ హిందూ మతం కంటే భిన్నమైనదని, తాను స్వయంగా హిందువునేనని, కానీ మనువాద, హిందుత్వకు తాను వ్యతిరేకమని ఆయన అన్నారు. తాను హిందూ మతానికి ఎప్పుడూ వ్యతిరేకం కాదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కలబుర్గిలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ బయోపిక్ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అయితే ఈ ప్రకటనపై వివాదం నెలకొంది. బహుశా మనలో చాలా మంది హిందుత్వకు వ్యతిరేకమే తప్ప హిందూ మతానికి వ్యతిరేకం కాదన్నారు. ఏ మతంలోనైనా హత్యలు, హింసకు ఆస్కారం ఉందా అని ప్రశ్నించారు. అయితే హిందుత్వ, మనువాదంలో హత్యలు, హింస, విభజనకు ఆస్కారం ఉందని అన్నారు. అయితే హిందుత్వపై సిద్ధరామయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు జనవరి 8న కూడా ఆయన హిందువునని, అయితే హిందుత్వానికి వ్యతిరేకమని ఆయన ప్రకటించారు. ఇదే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అయోధ్యలో రామమందిరాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని, రాజకీయ ప్రయోజనాల కోసం దానిని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తున్నానని అన్నారు.
తాను హిందువునని.. తాను హిందూ వ్యతిరేకిని ఎలా కాగలను అని సిద్ధా రామయ్య ప్రశ్నించారు. హిందుత్వ, హిందూ విశ్వాసాల చుట్టూ ఉన్న రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలు సమానమేనని సిద్ధరామయ్య తెలిపారు. తాను హిందూ వ్యతిరేకినన్న బీజేపీ ఆరోపణలపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ఆయనను ‘సిద్దరాముల్లా ఖాన్’ అంటూ అభివర్ణించారు. అయితే వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, రిటైర్మెంట్ తర్వాత కూడా రాజకీయాల్లో కొనసాగుతానని సిద్ధరామయ్య తెలిపారు. మొత్తం 224 మంది సభ్యులను ఎన్నుకునేందుకు 2023 మేలోపు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక శాసనసభ పదవీకాలం 2023 మే 24తో ముగియనుంది.