గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రముఖ పార్టీలు సమాయత్తమవుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉన్న గుజరాత్ లో కాంగ్రెస్ పాగా వేయాలని చూస్తోంది.. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ తాజాగా ప్రకటించిన మేనిఫెస్టోలో పలు హామీలను ఇచ్చింది. గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అహ్మదాబాద్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియం పేరును మారుస్తానని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపింది. సుమారు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని.. మహిళలకు ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. మోదీ స్టేడియం పేరును సర్దార్ వల్లబాయ్ పటేల్ స్టేడియంగా మారుస్తామనీ వెల్లడించారు. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తొలి క్యాబినెట్ సమావేశంలోనే తమ మ్యానిఫెస్టోను అధికారికంగా అమలు చేస్తామన్నారు. మహిళలు, వితంతువులు, వృద్ధులకు నెల 2వేల చొప్పున పెన్షన్ ఇస్తామని.. 3 వేల ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను ప్రారంభిస్తామన్నారు. బాలికలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను అందిస్తామని.. 3 లక్షల వరకు వ్యవసాయ రుణా మాఫీ చేస్తామన్నారు. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని.. నిరుద్యోగ యువకులకు 3 వేల చొప్పున జీవన భృతి, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 8న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.