తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే..! ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇటీవల కీలక చర్చలు జరిపారు. ఈ భేటీపై తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్), కాంగ్రెస్ కలసి ఎన్నికల్లో పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూకుడును ఆపలేరని బండి సంజయ్ కుమార్ అన్నారు. 2023 రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ప్రశాంత్ కిషోర్ సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్)ను టీఆర్ఎస్ నియమించడంపై బండి సంజయ్ కుమార్ ఈ వ్యాఖ్య చేశారు. మక్తల్‌లో జరిగిన బహిరంగ సభలో సంజయ్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య అవగాహన ఉందని.. అందుకే ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకున్నట్లు చెప్పారు. ‘ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలో సోనియా గాంధీతో.. తెలంగాణలో కేసీఆర్ తో వరుస సమావేశాలు నిర్వహించారు. కలిసి పోరాడినా, విడివిడిగా పోరాడినా ఢిల్లీలో అయినా, తెలంగాణలో అయినా బీజేపీని అడ్డుకోలేమని ఆయన వారికి స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది’ అని సంజయ్ కుమార్ అన్నారు. “బీజేపీతో కలిసి పోరాడితే కనీసం మనుగడ సాగించవచ్చని ఆయన వారికి చెప్పినట్లు తెలుస్తోంది’’ అని సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకుడు గెలిస్తే అమ్ముడుపోతాడు.. గెలవకపోతే పార్టీనే అమ్ముకుంటాడు.. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌కు అమ్మేందుకు వచ్చాడా లేక కాంగ్రెస్‌ను టీఆర్‌ఎస్‌కు అమ్మేందుకు వచ్చాడో అర్థం చేసుకోవాలి” అని సంజయ్ కుమార్ అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు సీట్ల పంపకంపై చర్చలు జరుపుతున్నాయని పలువురు కాంగ్రెస్ నేతలు తనతో చెప్పారని సంజయ్‌కుమార్ వెల్లడించారు.