గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. ఏ ప్రభుత్వ ప్రాపర్టీని వదలకుండా.. గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యుల పేర్లే దర్శనమిస్తాయి. దేశవ్యాప్తంగా ఏ మూల వెతికినా వారి చిత్రపటాలే కనిపిస్తాయి. రోడ్లు, కూడళ్లు, పార్కులు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, మైదానాలు.. ఇలా దేనిని వదలకుండా నాటి కాంగ్రెస్ నాయకుల పేర్లే పెట్టుకున్నారు. కానీ, అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఓ క్రికెట్ స్టేడియానికి ప్రధాని మోదీ పేరు పెడితే మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాదు, పూర్తి విషయాన్ని అర్థం చేసుకోకుండా.. తప్పుడు ప్రచారానికి తెరతీసి పప్పులో కాలేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన.. గుజరాత్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగున్న మూడో టెస్ట్ కు ఈ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. మోతెరాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎంక్లేవ్ లో భాగంగా.. ఇటీవల ఈ స్టేడియాన్ని ఆధునికీకరించారు. అయితే, ఈ స్టేడియం అలా ప్రారంభమైందో లేదో.. కాంగ్రెస్ తో పాటు.. ఆ పార్టీ అనుకూల లిబరల్స్.. తమ మార్కు రాజకీయాలను మొదలు పెట్టారు. స్టేడియానికి ప్రధాని మోదీ పేరును ఎలా పెడతారంటూ ప్రోపగాండ స్టార్ట్ చేశారు. పనిగట్టుకుని అబద్ధాలను ప్రచారం చేస్తూ.. ప్రజల్ని తప్పుదోవ పట్టించే పని ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంపై ఓవైపు ప్రశంసలు కుర్తుంటే.. మరోవైపు అధికార పార్టీపై అభాండాలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాంగ్రెస్, లెఫ్ట్, లిబరల్ మేథావులు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్టేడియానికి రిబ్బన్ కట్ చేశారో లేదో.. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సెల్ యాక్టివ్ అయిపోయింది. తాము అధికారంలోకి రాగానే స్టేడియం పేరును మార్చేస్తామంటూ ప్రచారం ప్రారంభించింది. ముందు వెనుకా చూడకుండా రాద్ధాంతానికి దిగిన హస్తం పార్టీ నేతలు.. తమకు అలవాటైన రీతిలో పప్పులో కాలేశారు. నరేంద్ర మోదీ పేరు పెట్టింది స్టేడియానికి మాత్రమే. గుజరాత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ .. సర్దేర్ పటేల్ పేరుతోనే వుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎంక్లేవ్ లో క్రికెట్ స్టేడియం ఒక భాగం మాత్రమే. అయితే, అసలు విషయాన్ని మరిచి రాద్దాంతం మొదలుపెట్టారు. ఒకర్ని మించి మరొకరు ట్వీట్ల వరద పారిస్తున్నారు.
అసత్యాలను ప్రచారం చేసే విషయంలో ముందుండే స్వీడిష్ ప్రొఫెసర్ అశోక్ స్వెయిన్.. ట్విట్టర్ వేదికగా తన అక్కసునంతా వెళ్లగక్కాడు. ప్రధాని మోదీని ఏకంగా హిట్లర్ తో పోల్చుతూ తృప్తిపొందాడు.
ట్రోల్ జర్నలిస్టుగా పేరుగాంచిన ఒకావిడైతే మరింత రెచ్చిపోయింది. ప్రధాని మోదీని విమర్శిస్తూ ట్వీట్లు చేసింది.
ఇక గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి తానే పెద్దదిక్కునని చెప్పుకునే హార్దిక్ పటేల్ కూడా తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో పాలు పంచుకున్నాడు.
వీరే కాదు మరికొంత మంది కాంగ్రెస్ లీడర్లు కూడా రెచ్చిపోయి ట్వీట్లు చేశారు. స్టేడియానికి మోదీ పేరు పెట్టడం.. దేశ వ్యతిరేక చర్య అన్న రీతిలో రెచ్చిపోయారు.
కానీ, అదే గుజరాత్ లో.. రోడ్లు, పార్కులు, కాలేజీలు, యూనివర్సిటీలు.. ఇలా దేనిని వదలకుండా 450 కట్టడాలకు.. గాంధీ-నెహ్రూ కుటుంబ వారుసుల పేర్లు పెట్టుకున్న విషయాన్ని మాత్రం మరిచిపోయారు.
2013 నవంబర్ లో ఆర్టీఐ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. గుజరాత్ లో 450 వివిధ స్కీములు, ప్రాజెక్టులు, ఇనిస్టిట్యూట్లకు గాంధీ-నెహ్రూ ఫ్యామిలీ పేర్లే వున్నాయి. ఇందులో 12 సెంట్రల్, 52 స్టేట్ స్కీములున్నాయి. 28 స్పోర్ట్స్ టోర్నమెంట్లు, ట్రోఫీలు కూడా వున్నాయి. అంతేకాదు, 19 స్టేడియాలకు వారి పేర్లే పెట్టుకున్నారు. 5 ఎయిర్ పోర్టులు, పోర్టులు, 98 విద్యాసంస్థలతో పాటు.. 51 అవార్డులు, 15 ఫెల్లోషిప్ లకు సైతం నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన కాంగ్రెస్ నాయకుల పేర్లే వున్నాయి. 37 ఇనిస్టిట్లూట్లు, 74 రోడ్లు, బిల్డింగులకు సైతం వాళ్ల పేర్లే పెట్టుకున్నారు. అది కూడా ఎక్కువగా జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లే వున్నాయి.
అంతేకాదు, పేర్ల విషయంలో బంధువులు, భార్యలు, కొడుకులు, మనుమలు, మనుమరాండ్లకు కూడా న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. గుజరాత్ లోని ఓ జూకు కమలా నెహ్రూ పెట్టారు. భారత్ తొలి ప్రధాని నెహ్రూ సతీమణి అన్న గౌరవం తప్ప.. ఆమెకు ఎలాంటి గుర్తింపు లేదు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందే ఆమె పరమపదించారు. అంతేకాదు, పార్కులు, స్కూళ్లు, హాస్పిటల్స్ కూడా వదల్లేదు. ఇందిరాగాంధీ కొడుకు, కనీసం ఆర్నెళ్లు కూడా ఎంపీగా లేని సంజయ్ గాంధీ పేరును కూడా కట్టడాలకు వాడుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయనపై ఎన్నో ఆరోపణలున్నాయి. మారుతి స్కామ్ లో కూడా ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అలాంటి వ్యక్తుల పేర్లను వాడుకున్నప్పుడు తప్పులేదు గానీ.. ఆరేళ్లుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెడితే మాత్రం తప్పుపడుతున్నారు. అది కూడా‘ఖేలో ఇండియా’ వంటి వినూత్న పథకాలతో.. దేశంలో క్రీడలను విశేషంగా అభివృద్ధి చేస్తున్న మోదీ పేరును.. ఓ స్టేడియానికి పెడితే కడుపు రగిలించుకుంటున్నారు.
స్టేడియానికి మోదీ పేరు పెట్టగానే వీరికి సర్దార్ పటేల్ గుర్తుకొచ్చారు. అసలు ఆ ఉక్కు మనిషిని కాంగ్రెస్ ఏనాడు గుర్తించింది కనుక. అలా గుర్తిస్తే.. ఆయనే దేశానికి తొలి ప్రధాని అయ్యేవారు. కానీ, రాద్దాంతం చేయడానికి మాత్రం ఆయన పేరు పల్లవిస్తుంటారు. నిజానికి, కాంగ్రెస్ తెరమరుగు చేసిన పటేల్ ప్రాభావాన్ని.. తిరిగి వెలుగులోకి తెచ్చింది ప్రధాని నరేంద్ర మోదీయే. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద పటేల్ విగ్రహాన్ని నిర్మించారు. స్టేడియానికి వున్న పటేల్ పేరును తొలగిస్తారా అని మండిపడుతున్న ఈ మిడిమిడి జ్ఙానం మేధావులకు అసలు విషయాన్ని మరిచిపోతున్నారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ పేరు పెట్టిన మోతెరా స్టేడయం.. సర్దార్ పటేల్ స్ప్టోర్స్ ఎంక్లేవ్ లో ఒక భాగం మాత్రమే. అంటే.. పటేల్ పేరును ఇంకా పెద్ద నిర్మాణానికి వాడి.. స్టేడియానికి మాత్రం మోదీ పెట్టారన్న మాట. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా.. అనవసర రాద్దాంతం చేయడం వారికే చెల్లింది.