కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్ కోసం నేడు ఎన్నికలు మొదలయ్యాయి. ఓటింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) చీఫ్ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ పోటీ పడుతున్నారు. ఓటింగ్ ప్రక్రియ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఢిల్లీలోని AICC కార్యాలయంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఎలక్టోరల్ కాలేజీలోని PCC ప్రతినిధులు సహా మొత్తం 9వేల మందికి పైగా ఓటు వేయనున్నారు. ఎన్నికల ప్రక్రియ రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతోంది. దేశవ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 137 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం ఇది ఆరోసారి. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు.
24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఈ పదవి కోసం బరిలో నిలిచారు. కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, కేరళకు చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పోటీ పడుతున్నారు. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నిక ఫలితాన్ని ఈ నెల 19న వెల్లడించనున్నారు. ప్రతి రాష్ట్రంలోని పీసీసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్ జరుగుతుంది.