నిన్న ఈడీ సమన్లు.. నేడు కరోనా పాజిటివ్..!

0
711

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా బారినపడ్డారు. సోనియా గాంధీ స్వల్ప కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో సోనియాకు చికిత్స అందుతోందని… ఆమె కోలుకుంటున్నారని తెలిపారు. ఈ మేరకు సూర్జేవాలా ట్విట్టర్ ద్వారా వివరాలు వెల్లడించారు.

గత వారం రోజులుగా సోనియా గాంధీ పలువురు నేతలను, కార్యకర్తలను కలుస్తున్నారని.. అందులో కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సూర్జేవాలా తెలిపారు. సోనియా గాంధీ కూడా స్వల్ప జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతున్నందునా కరోనా టెస్టులు చేయించుకున్నట్లు తెలిపారు. టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. సోనియా ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారని… ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. జూన్ 8న ఈడీ విచారణకు సోనియా హాజరవుతారని వెల్లడించారు.

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ బుధవారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ నోటీసులు జారీ చేసింది. ఈడీ నోటీసులు జారీ చేసిన మరుసటిరోజే సోనియా గాంధీ కోవిడ్ బారినపడటం గమనార్హం. తాను ఇండియాలో లేని కారణంగా విచారణకు మరింత గడువు ఇవ్వాలని రాహుల్ గాంధీ ఈడీని కోరినట్లు తెలుస్తోంది.

దివంగత ప్రధాని నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక యాజమాన్య హక్కులను అక్రమంగా పొందడమే గాక… ఈ క్రమంలో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు సోనియా, రాహుల్ గాంధీలపై ఉన్నాయి. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి 2012లో ఈ వ్యవహారంపై ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ కేసులో సోనియా, రాహుల్‌లకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here