ప్రపంచం మొత్తం ఇప్పుడు యోగావైపు చూస్తోంది. వైద్య విజ్ఙానవేత్తలు, శాస్త్రవేత్తలు యోగాను కీర్తిస్తున్నారు. ప్రధాని మోదీ చొరవతో.. 2015లో ఐక్యరాజ్యసమితి జూన్ 21ని ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా గుర్తించింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం యోగాకు విశిష్ట గుర్తింపు ఇచ్చింది. అలాంటి యోగా భారతీయ సనాతన ధర్మంలో భాగం కావడం.. భారతీయులుగా మనందరికీ గర్వకారణం. యోగా.. మన మహర్షులు, యోగీశ్వరులు ప్రవచించిన ఆరోగ్య మంత్రం. యోగా హైందవ సంప్రదాయమైనప్పటికీ.. ఇతర మతాలకు అనుసరణీయం కాదని ఎక్కడా చెప్పలేదు. ఇస్లామిక్ దేశాలు సైతం యోగాతో లబ్దిపొందుతున్నాయి. యోగా అభ్యాసానికి, కులం, మతం అడ్డుకావు. కానీ, కొన్ని రాజకీయ శక్తులు పనిగట్టుకుని యోగాపై దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ యోగాను ప్రశంసిస్తుంటే.. స్వదేశంపై ఏమాత్రం గౌరవంలేని కాంగ్రెస్ కోటరీ మాత్రం.. యోగాకు రాజకీయ రంగు పులిమి అప్రదిష్టపాలు చేస్తోంది.
యోగా ప్రమోషన్ లో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం.. ఇటీవలే భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. యోగాను ముఖ్యమైన క్రీడల్లో ఒకటిగా గుర్తించింది. గత ఆరేడునెలలుగా యోగా ఒప్పందం అమలుపై కసరత్తు చేస్తోంది. ఒప్పందంలో భాగంగా.. ఆయుష్ శాఖలో ఆధ్వర్యంలోని ‘మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా’.. సౌదీ అరేబియా క్రీడా మంత్రిత్వ శాఖకు సహకారం అందించనుంది. ఇందులో భాగంగా ఆయుష్ శాఖ యోగాలో శిక్షణ ఇవ్వనుంది. ఇలా ప్రపంచ దేశాలన్నీ భారతీయ యోగాను నెత్తినపెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం పనిగట్టుకుని దుష్ప్రచారం మొదలు పెట్టాయి. ఇలాంటి విషయంలో వెనుకాముందు ఆలోచించకుండా స్పందించే.. కాంగ్రెస్ పార్టీ ఆల్ టైమ్ గ్రేట్ ప్రిన్స్ రాహుల్ గాంధీ.. ట్విట్టర్లో ఎప్పటిలాగే రాద్దాంత చేశాడు. It’s Yoga Day, Not Hide Behind Yoga Day అంటూ యాష్ టాగ్లతో బురదజల్లాడు.
రాహుల్ గాంధీ ట్వీట్ పై ఆయుష్ శాఖామంత్రి కిరణ్ రిజిజు ఘాటుగా స్పందించారు. ఆరు దశాబ్దాల వారసత్వ పాలనలో చేయలేని పనిని మోదీ చేశారని.. జూన్ 21ని ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా గుర్తించేలా ఐక్యరాజ్య సమితిని ఒప్పించారని అన్నారు. ఓవైపు యోగాను ప్రపంచం మొత్తం స్వీకరిస్తుంటే.. రాహుల్ గాంధీ మాత్రం బురద జల్లడం హాస్యాస్పదమని అన్నారు.
ఇక, మరో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి.. మరింత అసహ్యకరమైన రీతిలో ట్వీట్ చేశాడు. ‘ఓంకారాన్ని ఉచ్చరించడం ద్వారా యోగా శక్తి పెరగదు.. అలాగే అల్లా పేరును ఉచ్చరించినంత మాత్రానా తగ్గదు’ అంటూ యోగాపై మతం రంగును పులిమే ప్రయత్నం చేశాడు.
దీనిపై కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ మండిపడ్డారు. యోగాను మతం కోణంలో చూస్తున్న కాంగ్రెస్ పార్టీ.. తన రాజకీయ దురుద్దేశానికి మరోసారి నిరూపించుకుందని అన్నారు.
ఇక, మరో కాంగ్రెస్ నేత శశిథరూర్.. ఇంటర్నేషనల్ యోగా డే పేరుతో చేసిన ట్వీట్.. ఆయన మనో వికారాన్ని బయటపెట్టింది. ‘సోఫాసనా’ పేరుతో.. అర్థనగ్న దుస్తులతో సోఫాపై పడుకున్న ఓ అమ్మాయి కార్టూన్ ను పోస్ట్ చేశాడు శశిథరూర్. దీనిపై నెటిజన్ల నుంచి ఆయనకు చివాట్లు తప్పలేదు.
అటు, కాంగ్రెస్ మౌత్ పీస్ నేషనల్ హెరాల్డ్ సైతం యోగాపై తన పైత్యాన్ని ప్రదర్శించింది. యోగా హిందువులదైతే.. కరాటే, తైక్వాండోలు బౌద్ధులవని.. కుంగ్ ఫూ కన్ఫ్యూషియన్లదంటూ వివాదాస్పద ట్వీట్ చేసింది. అంతేకాదు, యోగా హిందువులదైనప్పుడు.. ఆల్జీబ్రా ముస్లింలదంటూ లాజిక్కులు రాసుకొచ్చింది. ఇక, కేరళ సీఎం పినరయి విజయన్ కూడా యోగాపై తన అక్కసును వెళ్లగక్కాడు. ఆధునిక యోగాకు ఏ మతంతోనూ సంబంధం లేదని.. దీనిని ఆరోగ్య భద్రత కోణంలో మాత్రమే చూడాలని నీతులు చెప్పాడు. యోగాను ఇతర మతం వాళ్లు వాడొద్దని ఈయనకు ఎవరు చెప్పారో మరి..? మతం కోణంలో ఆలోచిస్తే యోగా ఇవాళ విశ్వవ్యాప్తమయ్యేదా..? ఇస్లామిక్, క్రిస్టియన్ మెజారిటీ దేశాలు యోగాను అనుసరించేవా..? రాజకీయ దురుద్దేశంతో కాకపోతే, ఎందుకిలాంటి ప్రేలాపనలు..?
అయితే, యోగాపై జరుగుతున్న ఈ రాద్ధాంతాన్ని కాస్త లోతుల్లోకి వెళ్లి చూస్తే.. పెద్ద కుట్రే వెలుగుచూసింది. ఇది మోదీ వ్యతిరేక కుట్రలో భాగమనే విషయం తేటతెల్లమైంది. గ్రేటా థన్ బర్గ్ టూల్ కిట్ ను.. కాంగ్రెస్ పార్టీ తు.చ. తప్పకుండా పాటిస్తున్నట్టు సాక్షాధారాలతో సహా బయటపడింది. ఈ ఏడాది ప్రారంభంలో స్వీడిష్ బాలిక, పర్యావరణ ఉద్యమకారిణి అనుకోకుండా పోస్ట్ చేసిన టూల్ కిట్ లో దేశంలో కాంగ్రెస్ కుట్రలు బయటపడ్డాయి. భారత్, భారత ప్రభుత్వానికి, భారతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఎలా పనిచేయాలో చెప్పే కుట్రల సంకలనమే ఈ ‘గ్రేటా థన్ బర్గ్ టూల్ కిట్’. రైతు చట్టాల పేరుతో ఎలా కుట్రలు చేయాలో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా కుతంత్రాలు రచించాలో.. దేశ వ్యతిరేక శక్తులు ఆ టూల్ కిట్ లో పూసగుచ్చినట్టు రాసుకున్నాయి. ఈ టూల్ కిట్ లక్ష్యాల్లో రైతు చట్టాలు, జనవరి 26 కుట్ర వంటివాటితో పాటు.. యోగా కూడా ఉంది. ‘Disrupt ‘Yoga & Chai’ Image of India in General’ అని చాలా స్పష్టంగా రాసుకున్నారు. అంటే భారత్ లో యోగాకు, ఛాయ్ కి ఉన్న ప్రాముఖ్యతపై దెబ్బకొట్టాలన్నది దీని సారాంశం. యోగాపై జరుగుతున్న ఈ రాద్ధాంతమంతా.. టూల్ కిట్ లో భాగమని చెప్పడానికి ఈ ఒక్క సెంటెన్స్ చాలు. ఇక, ఇక్కడ ఛాయ్ అంటే.. పరోక్షంగా ఛాయ్ వాలా నరేంద్ర మోదీనే టార్గెట్ అనేది చెప్పాల్సిన పనిలేదు.
ఖలిస్తాన్ అనుకూల సంస్థ పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ కోసం.. బెంగళూరుకు చెందిన ఆందోళనకారిణి దిశా రవి, న్యాయవాది నికితా జాకబ్ తయారుచేసిన ఈ టూల్ కిట్ ను.. స్వీడిష్ ఆందోళనకారిణి గ్రేటా థన్ బర్గ్ అనుకోకుండా సోషల్ మీడియాలో లీక్ చేశారు. దీంతో దేశవ్యతిరేక శక్తుల కుట్రలు వెలుగుచూశాయి. నూతన రైతు చట్టాలను ఎలా టార్గెట్ చేసిందీ.. ఖలిస్తానీ మూకలు రైతులతో చేరి ఎలా కుట్రలు చేసిందీ బయటపడింది. జనవరి 26 ఎర్రకోట హింసోన్మాదం కూడా ఈ టూల్ కిట్ లో భాగంగానే జరిగింది. అంటే, రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీ దేశవ్యతిరేక శక్తులతో చేతులు కలిపినట్టు.. టూల్ కిట్ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నట్టు.. యోగాపై జరుగుతున్న రాద్ధాంతం ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.