పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ అసెంబ్లీ స్థానం గురించి ప్రస్తుతం తీవ్ర చర్చ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే అక్కడి ఉప ఎన్నికలో ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేయబోతున్నారు. అక్కడ గెలిస్తేనే మమతా ముఖ్యమంత్రి పీఠం నిలబెట్టుకోగలదు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అక్కడ కూడా మమతకు చెక్ పెట్టాలని భావిస్తోంది. భవానీ పూర్ అసెంబ్లీ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆమెను ఓడించాలని ఇప్పటికే ప్రణాళికలు రచిస్తూ ఉంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె నందిగ్రాం నుంచి ఓడిపోవడంతో భవానీపూర్ నుంచి పోటీచేసేందుకు మార్గం సుగమం చేసేలా ఆ స్ధానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి సోవేన్‌దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. బెంగాల్ సీఎంగా కొనసాగాలంటే మమతా బెనర్జీ ప్రస్తుతం భవానీపూర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాల్సి ఉంది. భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ మమతా బెనర్జీకి ఓటమి తప్పదని, గతంలో నందిగ్రాంలో ఫలితం పునరావృతమవుతుందని బీజేపీ చెబుతోంది. సెప్టెంబర్ 30న జరిగే ఉప ఎన్నికలో మమతా బెనర్జీకి ఘోర పరాజయం ఎదురవుతుందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో భవానీపూర్ నుంచి నందిగ్రాంలో పోటీ చేసిన దీదీ ఆ స్ధానంలో సువేందు అధికారి చేతిలో ఓటమి చవి చూశారని, మళ్లీ ఇప్పుడు భవానీపూర్‌లో ఎలా గెలుస్తానని ఆమె ఆశపడుతున్నారని ఆ ట్వీట్‌లో మాలవీయ ప్రశ్నించారు. నందిగ్రాంలో ఫలితమే భవానీపూర్‌లోనూ ఇప్పుడు ఆమెకు ఎదురవుతుందని బీజేపీ నాయకులు చెబుతూ ఉన్నారు.
ఇక్కడ పోటీ చేసే విషయమై కాంగ్రెస్ పార్టీ యుటర్న్ తీసుకుంది. మమతా బెనర్జీకి వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టబోమని కాంగ్రెస్ ప్రకటించింది. అలాగే ఆమెకు మద్దతుగా కూడా ప్రచారం చేయబోమని తెలిపింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెడితే పరోక్షంగా బీజేపీకి సాయం చేసినట్లే అవుతుంది. పార్టీ అధిష్ఠానం ఆ పని చేయాలని కోరుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మంచెప్పారు. అయితే.. మెజారిటీ బెంగాల్ కాంగ్రెస్ నేతలు ఆమెకు వ్యతిరేకంగా పోటీ చేయాలని ప్రతిపాదించారని అన్నారు. దీనిపై అధిష్ఠానం సలహా తీసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుంటే తాము బరిలో ఉంటామని లెఫ్ట్ ఫ్రంట్ మంగళవారం ఉదయం ప్రకటించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ కూటమిగా పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి.
ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు రావడంతో ఆమె సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఆమె ఎన్నికవ్వాల్సి ఉంది.