మునుగోడు ఉప ఎన్నికలు చాలా ఆసక్తికరంగా నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీకి ఓటు వేయాలంటూ కాంగ్రెస్ నేతలకు ఆయన చేసిన ఫోన్ కాల్స్ లీక్ అవ్వగా.. ఇప్పుడు ఆస్ట్రేలియాలో తన అభిమానులతో ఆయన మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన మునుగోడులో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయకుండా ఆస్ట్రేలియాకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే..! అయితే తాను మునుగోడులో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినా ఉపయోగం ఉండదని… మహా అయితే 10 వేల ఓట్లు వస్తాయని ఆయన అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేనే లేదని.. ఓడిపోయే పార్టీకి ప్రచారం చేయడమెందుకని ప్రశ్నించారు. మునుగోడులో తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి (బీజేపీ) గెలవబోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫైనాన్సియల్ గా చాలా బలహీనంగా ఉందని… తాను మునుగోడులో ప్రచారానికి వెళ్తే ఖర్చులు ఎవరు భరిస్తారని ప్రశ్నించారు.