More

    నాలుగేళ్లలో 170 ఎమ్మెల్యేలు జంప్..!
    కాంగ్రెస్ ముక్త్ భారత్‎కు ఇది సంకేతమా..?

    భారత జాతీయ కాంగ్రెస్,.. దేశాన్ని దశాబ్దాలపాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పార్టీ. వారసత్వ రాజకీయాల్లో తలపండిన పార్టీ. గాంధీ పేరును వారసత్వంగా మార్చుకుని ఎదురులేకుండా ఎదిగిన పార్టీ. ఎందరో ఉద్ధండ రాజకీయ నేతలు సేవలందించిన పార్టీ. ప్రత్యర్థుల ఊహకు కూడా అందని రీతిలో.. రాజకీయ చతురతను ప్రదర్శించి.. అధికారాన్ని ‘హస్త’గతం చేసుకోవడంలో.. పేరుగాంచిన పార్టీ. అలాంటి పార్టీ.. నేడు దేశ రాజకీయాల్లో తన ఉనికి కోసం పడరాని పాట్లు పడుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ దేశంలో కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో వుంది. అదికూడా ఒక రాష్ట్రంలో కూటమిలో భాగంగా అధికారం పంచుకుంటోంది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లోన్నైతే ప్రాంతీయ పార్టీల ‘చే’యూతతో బతుకీడుస్తోంది. ఇక, చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ పేరు కూడా వినిపించడం లేదంటే అతిశయోక్తి కాదేమో. దశాబ్దాల చరిత్ర వున్న కాంగ్రెస్ పార్టీ.. దశా దిశా లేకుండా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దీనిని బట్టి చూస్తే.. బీజేపీ చెబుతున్నట్టు రానున్నరోజుల్లో దేశం కాంగ్రెస్ ముక్త్ భారత్ కాబోతోందా..? భారత రాజకీయ కడలిలో కాంగ్రెస్ నావ మునిగిపోతోందా..? అంటే అవునే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    తాజాగా అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ ఓ నివేదిక ఇచ్చింది. ఇందులో గత నాలుగేళ్లలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల లెక్కలు చెప్పింది. ఈ విషయంలో అన్ని పార్టీలకంటే కాంగ్రెస్ నుంచే ఫిరాయింపులు ఎక్కువగా వున్నట్టు తేల్చిచెప్పింది. 2016 – 2020 మధ్యకాలంలో ఏకంగా 170 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దేశ రాజకీయాల్లో కనీవిని ఎరుగని పరిణామం ఇది. నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీపై క్యాడర్ కు విశ్వాసం సన్నగిల్లుతోంది. పార్టీ ఫిరాయించినవాళ్లలో 42 శాతం మంది కేవలం కాంగ్రెస్ నాయకులే కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. గత నాలుగేళ్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి 170 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతే.. బీజేపీ నుంచి కేవలం 18 మంది మాత్రమే వేరే పార్టీల్లో చేరినట్టు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.

    ఇక, పార్టీలు మార్చి తిరిగి పోటీకి నిలిచిన 405 మంది ఎమ్మెల్యేల్లో 182 మంది బీజేపీలో చేరగా, 38 మంది కాంగ్రెస్‌లో, 25 మంది టీఆర్ఎస్ లో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఐదుగురు లోక్‌సభ ఎంపీలు బీజేపీని విడిచిపెట్టి ఇతర పార్టీల్లో చేరారు. 2016-20 మధ్యకాలంలో జరిగిన ఎన్నికల్లో ఏడుగురు రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్‌ను విడిచిపెట్టి ఇతర పార్టీల నుంచి పోటీ చేశారు. మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీలలో ఇటీవల ప్రభుత్వాలు కూలిపోడానికి ఆయా అధికార పార్టీల ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడమే కారణంగా నివేదిక స్పష్టం చేసింది. 2016-20 మధ్యకాలంలో తిరిగి రాజ్యసభకు పోటీ చేసిన 16 మంది రాజ్యసభ ఎంపీల్లో 10 మంది పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరారు. అలాగే 12 మంది లోక్‌సభ ఎంపీల్లో ఐదుగురు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరారు.

    పార్టీల పరంగా చూసుకుంటే.. కాంగ్రెస్ నుంచి 170 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి 18 మంది, BSP నుంచి 17 మంది, NPF నుంచి 15 NCP నుంచి 14, సమాజ్ వాదీ పార్టీ నుంచి 12, RJD నుంచి 10, JDS నుంచి 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఇక, INLD నుంచి 8 మంది, ఆప్ నుంచి ఏడుగురు, JVM(P) నుంచి ఏడుగురు, JDU నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ఇక, తృణమూల్ కాంగ్రెస్, BJD, KJP, MSCC, PPC, SAD, SKM పార్టీల నుంచి నలుగురు చొప్పున బయటికి రాగా.. అన్నాడీఎంకే, BSRC, JMM, NPEPT నుంచి ముగ్గురు,.. AGP, ఫార్వర్డ్ బ్లాక్, AIUDF, DMDK, QED, RLD, RSP నుంచి కూడా ఫిరాయింపులు చోటుచేసుకున్నాయని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది.

    ఇక, పార్టీలు ఫిరాయించిన వాళ్లలో అత్యధికంగా 44.9 శాతం మంది బీజేపీ గూటికి చేరారు. గత నాలుగేళ్లలో ఏకంగా 182 మంది ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెకస్ లోకి 38 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. తృణముల్‌ కాంగ్రెస్‌, NCPలో 16 మంది చొప్పున ఎమ్మెల్యేలు చేరారు. JDUలో 14, BSP లో 11 మంది ఎమ్మెల్యేలు చేరారు. NDPPలో 10, శివసేనలో తొమ్మిది. సమాజ్ వాదీ పార్టీలో ఎనిమిది, SPF లోకి ఏడుగురు,.. RLD, SDF లలో నలుగురు చొప్పున చేరిపోయారు.

    ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే,.. TDP నుంచి 17 మంది, YCP నుంచి 15 మంది, TRS నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అయితే, TRS ను వీడిన ఎమ్మెల్యేల కంటే చేరినవారి సంఖ్యే ఎక్కువగా వుంది. గత నాలుగేళ్లలో ఏకంగా 25 మంది ఎమ్మెల్యేలు TRS లో చేరగా.. TDP లోకి 11 మంది, YCP లోకి ముగ్గురు ఎమ్మెల్యేలు చేరిపోయారు. మొత్తంగా చూస్తే అన్ని పార్టీలకంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ డ్యామేజీ జరిగింది. మిగతా పార్టీల్లో ఫిరాయింపులున్నా.. చెప్పుకోదగ్గ స్థాయిలో చేరికలు కూడా వున్నాయి. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. గత నాలుగేళ్లలో 170 మంది పార్టీని వీడితే.. కాంగ్రెస్ గూటికి చేరింది మాత్రం 38 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. దీనిని బట్టి ఆ పార్టీ ఎంత సంక్షోభంలో వుందో అర్థం చేసుకోవచ్చు.

    అవినీతి, బంధ్రుప్రీతి, కుటుంబ పెత్తనం, నాయకత్వ సంక్షోభం.. వెరసి కాంగ్రెస్ రాజకీయ నావను ముంచేస్తున్నాయి. జూనియర్లు, సీనియర్లనే తేడా లేకుండా నాయకులంతా పార్టీకి దూరమవుతున్నారు. పీసీ చాకో వంటి సీనియర్ నేతలు సైతం పార్టీని వీడారంటే ప్రస్తుతం కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితుల్లో వుందో అర్థం చేసుకోవచ్చు. ఆయన అలా రిజైన్ చేశాడో లేదో.. మరో కేరళ కాంగ్రెస్ నాయకుడు విజయన్ థామస్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‎బై చెప్పారు. పార్టీని వీడటమే కాదు.. బీజేపీలోనూ చేరిపోయారు. రానున్న రోజుల్లో మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు సైతం పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో పార్టీ నుంచి పోటీచేయడానికి అభ్యర్థులు కరవయ్యే పరిస్థితి వచ్చినా.. ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

    కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితికి చేరుకోవడానికి అతి ముఖ్యమైన కారణం నాయకత్వ సంక్షోభం. కొన్నేళ్లుగా పార్టీని నడిపించే సమర్థవంతమైన నాయకుడు లేక కాంగ్రెస్ పార్టీ కకావికలమవుతోంది. దేశ రాజకీయ చిత్రపటం నుంచి క్రమంగా కనుమరుగవుతోంది. ఎన్నికలు రాగానే అన్నాచెల్లెళ్లు రాహుల్, ప్రియాంక వాద్రా తళుక్కున మెరుస్తారు. ప్రజల్లో సింపథీకోసం పడరాని పాట్లు పడతారు. అయినా, కాంగ్రెస్ పార్టీకి శూన్యహస్తమే మిగులుగుతుంది. గతంలో ఈ అన్నాచెల్లెళ్ల ట్రాక్ రికార్డే ఇందుకు అద్దం పడుతోంది. వారు ప్రచారం చేసిన ప్రతీచోటా హస్తం పార్టీ భంగపాటుకు గురైంది. దీంతో ఎన్నికల ఫలితాలు రావడంతోనే.. బడలిక వదిల్చుకోవడానికి అన్న విదేశీ టూర్లకు బయల్దేరితే.. చెల్లి మళ్లీ పట్టపువాసానికి పరిమితమవుతుంది. కొన్నేళ్లుగా దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇలాగే కొనసాగుతోంది. దీంతో చాలా ఏళ్లుగా పార్టీ అధిష్టానంపై సీనియర్లు గుర్రుగా వున్నారు. గతంలో అధినేత్రికి పలుమార్లు లేఖలు రాసినా లాభం లేకుండా పోయింది. ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే.. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ కు మిగిలేది శూన్య‘హస్తమే’..!

    Trending Stories

    Related Stories