హిందువులపై దాడులు.. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు

0
777

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌లో మతపరమైన అణిచివేతను ఎదుర్కొని 2014 డిసెంబర్‌ 31 నాటికి భారత్‌కు వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతాలకు చెందిన వారికి భారత పౌరసత్వం కల్పిస్తామని ఈ చట్టంలో ఉంది. సీఏఏ పేరుతో దేశంలో తొలిసారి మతం ఆధారంగా పౌరసత్వాన్ని కల్పిస్తున్నారని, రాజ్యాంగంలోని మౌలిక సిద్ధాంతాలను ఈ చట్టం ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.

ఇటీవల బంగ్లాదేశ్ లో హిందువులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! హిందువులను టార్గెట్ చేస్తూ వారిని, వారి కుటుంబాలను హింసిస్తూ వస్తున్నారు. అందుకే పౌరసత్వ సవరణ చట్టం ఎంత ముఖ్యమో.. హిందువులకు ఈ చట్టం ఓ అండగా నిలుస్తుందని సామాజిక మాధ్యమాల్లో పలువురు చెబుతూ వస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత సీఏఏకి మద్దతుగా మాట్లాడారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత మిలింద్ దియోరా. మతకలహాలను బంగ్లాదేశ్ పెంచిపోషిస్తోందని.. బంగ్లాదేశీ హిందువులకు భారత్ లో పునరావాసం కల్పించే విధంగా సీఏఏలో సవరణలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అక్కడి హిందువులు అణచివేతకు గురవుతున్నారన్నారు.

సీఏఏ అవసరం ఎంతుందో బంగ్లాదేశ్ ఘటన నిరూపిస్తోందని బీజేపీ నేత అమిత్ మాలవీయ చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్ లో హిందువుల మత స్వేచ్ఛను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏఏని వ్యతిరేకించిన మమత బెనర్జీ ఇప్పుడు బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న అకృత్యాల పట్ల కూడా మాట్లాడడం లేదని, తృణమూల్ ప్రభుత్వంలో బెంగాల్ లోని హిందువులకూ రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. పలువురు బీజేపీ నేతలు సీఏఏ అవసరంపై మరోసారి గళం వినిపిస్తూ ఉన్నారు.