‘వందేమాతరం’ పలకని వీర సెక్యులర్..‘మహా భారతం’ బోధిస్తున్నాడు.. విని తరిద్దామా మరి..?!

0
948

మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది..? సింహాసనానికి అనర్హుడైన దుర్యోధనుడనే వారసుడు.. ఎలాగైనా అధికారం వెలగబెట్టేదామని.. కుట్రలు చేయటం వల్ల..! అదే ఇప్పుడు కూడా జరుగుతోందా..? పైగా వారసత్వం తప్ప మరేమీ లేని ఓ యువరాజు.. పాండవుల్నే జనం ముందు కౌరవులు అంటూ.. అబద్ధాలు చెబుతున్నాడా..?

‘భారత్ జోడో’ అంటూ బయలుదేరిన రాహుల్ గాంధీ పోలోమంటూ హర్యానా, పంజాబ్ రాష్ట్రాల వరకూ వెళ్లిపోయాడు..! చల్లటి చలిలో కొనసాగుతోన్న ఓట్ల ప్రయాణం రేపో, మాపో పూర్తవుతుంది కూడా..! కన్యాకుమారిలో కాలు కదిపిన కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ వారసుడు మెల్లగా కశ్మీర్ చేరుకునే పనిలో ఉన్నాడు..! అయితే, ఆ క్రమంలో ఇప్పటికే మూడు వేల కిలోమీటర్ల కాలినడక కొనసాగించిన మన యువరాజు.. అందరూ ఆశించినట్టుగానే.. అద్భుతంగా హాస్యాన్ని పండిస్తున్నాడు..! ‘పుష్ప’ మాదిరిగా… ‘తగ్గేదేలే’ అంటూ.. చేయి గుర్తుని.. గడ్డం కింద దువ్వుతూ వినోదం పంచుతున్నాడు..!

భారత్ జోడో యాత్రలో భాగంగా హర్యానా చేరిన రాహుల్.. పాండవుల్ని, కౌరవుల్ని తన స్పీచులోకి లాక్కొచ్చి రచ్చరచ్చ చేశాడు..! ఒకప్పుడు మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం.. ఈనాటి హర్యానాలోనే ఉంటుంది..! దాంతో రాహుల్ గాంధీ తనదైన స్టయిల్లో భారతం వినిపించే ప్రయత్నం చేసి మరోసారి టాలెంట్ నిరూపించుకున్నాడు..! దాదాపు అరగంట సాగిన ఆయన అరిగిపోయిన గ్రామ్ ఫోను మళ్లీ మళ్లీ అదే పాత ముచ్చట్లు చెప్పింది. కాకపోతే, ఈసారి రాహుల్ కొన్ని కొత్త పదాలు ఎంచుకున్నాడు. హర్యానా నేటివిటికీ తగ్గట్టుగా ఉంటాయనుకుని ‘పాండవులు, కౌరవులు, డీమానిటైజేషన్, జీఎస్టీ, త్యాగి, పూజారి, జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్’ వంటి పద ప్రయోగాలు చేశాడు..! అంతా బాగానే ఉంది కానీ.. నిజంగా భారతం ఒక్కసారి కూడా చదవకుండా.. పాండవుల తరుఫున క్రెడిట్ కొట్టేదామనుకుంటే.. ఏమవుతుంది..? మన రాహుల్ బాబా బుక్కయ్యాడు..!

కేవలం గాంధీ అన్న ఇంటి పేరు కారణంగా ఎంపీ అయిపోయి.. అవకాశం వచ్చినా మంత్రి కాకుండా.. ఆ తరువాత, ఇష్టానుసారం కామెంట్స్ చేస్తూ.. రాహుల్ 2014, 2019లో విజయవంతంగా ప్రతిపక్షానికి పరిమితం అయ్యాడు. అర్హత, సమర్థత లేకున్నా.. వారసత్వమే ఏకైక కారణంగా.. హస్తం పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాడు. దాన్ని మోయలేక, మోదీని ఇసుమంతైన కదప లేక.. చేయి గుర్తు పార్టీ యువ నాయకుడు చేతులు ఎత్తేశాడు. దాంతో సోనియా గాంధీ తమ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి.. ఆరో వేలు మాదిరిగా.. మల్లికార్జున ఖర్గేను అధ్యక్షుడ్ని చేసింది. ఇప్పుడిక ఏ బాధ్యతా లేని రాహుల్ సార్ గ్రహాలు అనుగ్రహిస్తే అమాంతం ప్రధాని అయిపోదామని ఉవ్విళ్లూరుతున్నాడు..! పార్టీని నడపలేక అట్టర్ ఫ్లాప్ అయిన తమ గాంధీల వారసుడినే.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా.. రాబోయే కాలానికి కాబోయే ప్రైమినిస్టర్ అంటూ, భారత్‎ను ముందుకు నడిపిస్తాడంటూ.. మోసేస్తున్నారు. అలా ఓవర్ హైప్ చేయబడిన తాజా స్పీచ్ లో.. రాహుల్ తన మహాభారత విజ్ఞానం అంతా ప్రదర్శించాడు.

పాండవులు తపస్వులు అన్నాడు మిస్టర్ గాంధీ..! అంతవరకు నో ప్రాబ్లం. ధర్మరాజ, అర్జున, భీమాదులు నిజంగానే తపస్వులు. కానీ, అక్కడితో ఊరుకోకుండా ఈ దేశం తపస్వులదే. పూజారులది కాదు అంటూ కొత్త జ్ఞానాన్ని బోధించాడు. ఆయన బీజేపీని, ఆరెస్సెస్‎ని టార్గెట్ చేయాలనే తొందర్లో.. రకరకాల పదాలతో, రకరకాల విన్యాసాలు చేశారు. కానీ, అవేవీ కమలదళాన్ని డ్యామేజ్ చేయకపోగా.. యావత్ భారతదేశంలోని పూజారుల్ని ఆగ్రహానికి గురి చేశాయి! ప్రధానంగా ఉత్తారాదిలో అనేక బ్రాహ్మణ సంఘాలు, పురోహిత సంఘాలు రాహుల్ దిష్టి బొమ్మలు సైతం దహనం చేశాయి..! రాహుల్ కెరీర్‎లో ఇలాంటి సెల్ఫ్ గోల్స్ కొత్తేం కాకపోయిన.. ఈ ‘తపస్వీ వర్సెస్ పూజారి’ అనేది తాజా నిర్వాకం..!

సరే.. ఈ దేశం పూజారులకి చెందదు అని ఆయన అన్నా కూడా.. ఆ సంగతి పక్కన పెడదాం. కాంగ్రెస్ వారి హిందూ వ్యతిరేకత, బ్రాహ్మణ వ్యతిరేకత, సాధుసంతులు, కాషాయధారులు, గోమాతపైన వారి వ్యతిరేకత.. ఇప్పుడు కొత్తేం కాదు కదా..! పోనీ, పాండవులు తపస్వులు అన్న రాహుల్ వారిని ఈ కాలంలో ఎవరితో పోల్చాడు..? వ్యవసాయం చేసే రైతులు, కార్మికులు, శ్రామికులు మొదలైన వారంతా తపస్వులు అన్నాడు రాహుల్. నిజానికి ఇది చాలా మంచి కామెంటే. కానీ, భారత కథ, పాండవుల కాలపు స్థితిగతులు ఏమీ తెలియని మన మహామేధావి.. అనేక విధాలుగా.. కామెడీ పుట్టించే ప్రయత్నం చేశాడు. అనాటి పాండవుల వెంట అదానీ లాంటి కోటీశ్వరులు ఎవరూ లేరట..! కౌరవులతోనే అటువంటి వారు ఉన్నారట..! అలాగే, పాండవులు డీమానిటైజేషన్, జీఎస్టీ అమలు లాంటి నిర్ణయాలు చేయలేదట..! పాండవులు చేయనివన్నీ.. మోదీ చేశాడని ఎగతాళి చేయటమే.. రాహుల్ లక్ష్యం..!

అసలు ఎక్కడి పాండవులు..? ఎక్కడి డీమానిటైజేషన్, జీఎస్టీ, వ్యవసాయ సాగు చట్టాలు..? తలాతోకా లేకుండా పాండవుల్ని తాను ఓన్ చేసుకుంటూ.. కౌరవులుగా బీజేపీ, ఆరెస్సెస్‎ని చిత్రీకరించాలని.. తెగ ఉబలాటపడ్డాడు రాహుల్ సార్..! అంతే కాదు, ఖాకీ చెడ్డీలు వేసుకుని, లాఠీలు పట్టుకునే వారు ఈ కాలపు కౌరవులు అంటూ ఇన్‎డైరెక్టర్ సెటైర్లు కూడా వేశాడు. ఆరెస్సెస్ వారు తమ యూనిఫామ్ లోంచి నిక్కర్లని తొలిగించి, ప్యాంట్లు వేసుకుంటున్నారని కూడా రాహుల్ ఇంకా గుర్తించటం లేదు. తను ఎంతో ద్వేషించే వారు ఏం చేస్తున్నారో కూడా గమనించని ఈయన పీఎంని అవుతానంటాడు..! అందు కోసం పాద యాత్ర చేస్తూ సర్కస్ ఫీట్లు చేస్తుంటాడు. యథావిధిగా ఈసారి కూడా ‘జై శ్రీరామ్’ నినాదం చర్చలోకి తీసుకొచ్చాడు. బీజేపీ, ఆరెస్సెస్ వారు ‘జై సియా రామ్’ అనరూ అంటూ గొప్ప రహస్యాన్ని మరోసారి బయట పెట్టాడు..! అంతే కాదు, పనిలో పనిగా మన నెహ్రూ మునిమనవడు.. పరమ శివుని పేరు కూడా వాడేసుకున్నాడు..!

స్వాతంత్ర్యం వచ్చాక వల్లభ్ భాయ్ పటేల్ సోమనాథ్ ఆలయం నిర్మింపజేస్తుంటే.. ఆ ఆలయ ప్రారంభోత్సవానికి అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ హాజరు కావటాన్ని కూడా.. రాహుల్ గారి ముత్తాత నెహ్రూజీ తప్పుబట్టారు..! ‘హిందూ రివైవలీజం’ అంటూ నిరసన వ్యక్తం చేశాడట..! ఆయన వారసత్వాన్ని ఘనంగా చెప్పుకునే రాహుల్ ఇప్పుడు ఆరెస్సెస్, బీజేపీ వారు ‘హర హర మహాదేవ్’ నినాదం చేయరంటూ విమర్శించాడు. అందుక్కారణం కూడా చెప్పాడు. శివుడు తపస్వి అట..! తపస్వులు బీజేపీ, ఆరెస్సెస్ కి నచ్చరట..! అయితే, కాంగ్రెస్ వారి కాబోయే ప్రధాని ఇలా మాట్లాడిన వెంటనే.. నరేంద్ర మోదీ ‘హర హర మహాదేవ్’ నినాదం చేసిన వీడియో సొషల్ మీడియాలో వైరల్ అయింది..! కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవ వేళ మోదీ ‘హర హర మహాదేవ్’ అంటూ సగర్వంగా నినదించాడు..!

‘జై శ్రీరామ్’ నినాదం విషయంలో కూడా రాహుల్ తెలివిగా హిందువుల్ని విభజించే ప్రయత్నం మళ్లీ మళ్లీ చేస్తున్నాడు. జై సియా రామ్ అనాలట. సీతాదేవి అంటే బీజేపీ, ఆరెస్సెస్ వారికి పడదంటూ గొప్ప ఫెమినిస్ట్‎గా కలరింగ్ ఇస్తున్నాడు. అసలు సీతాదేవిని గౌరవించని రామభక్తులు ఉంటారా..? హిందువుల్లో ఏ ఒక్కరైనా.. ‘జై శ్రీరామ్’ అన్నంత మాత్రానా.. సీతమ్మని మరిచినట్టా..? ‘శ్రీరామ్’ అన్న నినాదంలోని ‘శ్రీ’ అంటే సీతకాక మరెవరు..? రాహుల్ గాంధీ లాజిక్ ఏంటో.. ఆయన్ని అభిమానించే కమల్ హాసన్ లాంటి నాస్తిక మేధావులకే తెలియాలి..! అసలు ఇదంతా పక్కన పెడితే.. ఓ దశలో కాంగ్రెస్ కార్యకర్తలకి పిలుపుని కూడా ఇచ్చాడు.. మన యూత్ ఐకాన్..! మీకు బీజేపీ, ఆరెస్సెస్ వారు ఎదురైతే వారి చేత ‘జై సియా రామ్’ అని బలవంతంగా అనిపించండి అంటున్నాడు..! హిందూత్వవాదులు సరే.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఇప్పటి వరకూ ఎన్నిసార్లు ‘జై సియా రామ్’ అన్నారు..? రాహుల్ గాంధీ ఎన్నిసార్లు ‘హర హర మహాదేవ్’ అన్నాడు..? తాము హిందూ దేవుళ్ల పేర్లు పొరపాటున కూడా ఉచ్ఛరించరు..! ముస్లిమ్, క్రిస్టియన్ ఓటర్లకు వీలైనంతగా ఒంగి, ఒంగి దండాలు పెట్టుకుంటారు. కానీ, సెక్యులర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ, ఆరెస్సెస్ కి ‘జై సియా రామ్, హర హర మహాదేవ్’ పాఠాలు చెబుతోంది..! ఇంత కంటే హిపోక్రసీ ఉంటుందా..?

‘జై శ్రీరామ్, హర హర మహాదేవ్’ నినాదాలు కాదు.. భరతమాతని ఉద్దేశించిన ‘వందే మాతరం’ కూడా నోటికి రాని.. వీర సెక్యులర్ రాహుల్ గాంధీ.. ఇంకా అనేక పాఠాలు బోధించాడు..! అప్పట్లో పాండవుల వెంట అన్ని మతాల వాళ్లు కలసి నడిచారట..! ఇదీ ఆయన ఇతిహాస జ్ఞానం..! పాండవ, కౌరవ యుద్ధం జనంతో ప్రత్యక్షంగా సంబంధం లేని దాయాదుల ఆస్తి గొడవ అని కూడా రాహుల్‎కి చెప్పేవారు లేరు..! చెప్పినా ఆయన వింటాడో.. లేదో.. తెలియదు..! పైగా పాండవులు ‘నఫ్రత్ కే బాజార్ మే.. మొహబ్బత్ కీ దుకాన్’ తెరిచారట..! అంటే, ద్వేషపూరిత వీధిలో.. ప్రేమ పూరిత వ్యాపారం చేశారని.. రాహుల్ ఉవాచ..! మొత్తానికి, ద్వాపర యుగం నాటి సంస్కృతం మాట్లాడిన పాండవుల్ని కూడా తన ప్రచారానికి అనుకూలంగా.. ఉర్దూ కొటేషన్ లతో.. సెక్యూలర్ ఓటు బ్యాంకు అస్త్రంగా మార్చేశాడు..! నెహ్రూ కాలం నుంచి సోనియా దాకా కాంగ్రెస్ వారు చేస్తోంది, అదే..! హిందువుల్ని సెక్యులర్ బాణాలతో గుంపులుగా చెదరగొడుతూ విభజించి.. మైనార్టీల్ని ఒకే ముఠాగా కట్టిపెట్టుకోవటం.. చేతి గుర్తు పార్టీ చేతివాటంలో భాగం..! ఆ మధ్య రాహుల్ అందుకే ‘హిందుత్వవాదులు వేరు, హిందువులు వేరు’ అంటూ మనసులో మాట చెప్పాడు..!

సరే.. చివరాఖరుగా.. రాహుల్ ‘భారత్ జోడో’ యాత్రలోని ప్రసంగాల సారాంశం ఏంటి..? అసలు ఈ పాండవులు, కౌరవులు, అదానీలు, అంబానీలు, బీజేపీ,ఆరెస్సెస్, ఖాకీ నిక్కర్లు, జై శ్రీరామ్, హర హర మహాదేవ్ వంటి పద ప్రయోగాల.. అంతరార్ధం ఏంటి..? పైకి చూస్తే మనకంతా గందరగోళంగా అనిపిస్తుంది..! రాహుల్ మార్కు కామెడీగా కూడా భ్రమ కలుగుతుంది..! కానీ, కన్యాకుమారిలో యాత్ర మొదలైనప్పుడు.. భరతమాతని అవమానించిన.. ఓ క్రిస్టియన్ మతోన్మాద పాస్టర్‎ను ఆలింగనం చేసుకున్న కాంగ్రెస్ లీడర్.. హర్యానాకి చేరే సరికి పాండవుల్లో ఒకడైపోయారు..! ఏ రోటికాడ ఆ పాట పాడటం, ఎక్కడి ఎండకి అక్కడి గొడుగు వాడేసుకోవటం.. రాహుల్ వ్యూహం..! ఉత్తరాదిలో ఒక్కో అడుగు వేస్తున్న కొద్దీ విబూది, గంధం, కుంకుమ బొట్లు పెడుతున్న దత్తాత్రేయ గోత్రపు వీర హిందూ బ్రాహ్మణుడు.. ఛాన్స్ దొరికితే చాలు.. సిక్కుల తలపాగా కూడా అందంగా తలకు చుట్టేస్తున్నాడు..! ఇవన్నీ పెద్దగా ఆక్షేపించాల్సినవి కాదు కూడా..! కానీ, ఎటోచ్చీ.. నిజంగా తనకు ఇంకా రాని మెచ్యూరిటీ కోసం.. గడ్డం పెంచేసి, హెయిర్ డై చేయటం మానేసిన రాహుల్.. సీనియర్ లీడర్‎గా కనిపించాలనుకుంటున్నాడు..! సీజన్డ్ పొలిటీషియన్‎గా జనం ముందు ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. కానీ, అంతర్లీనంగా కాంగ్రెస్‎కు ఎప్పుడూ ఉండే ఎజెండాని మాత్రం మరవటం లేదు..!

డెబ్బై ఏళ్లు దేశాన్ని ఏలినా కూడా పేదరికాన్ని రూపుమాపలేదు రాహుల్ కుటుంబం. కానీ, ఇప్పుడాయన వేసుకుంటున్న టీషర్ట్ వెనుక మాత్రం.. చలికి వణికిపోతున్న భారతీయ పేదల కష్టాలున్నాయట..! మరోసారి నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీల మాదిరిగా రాహుల్ నిరుపేదల్ని తనవైపుకు తిప్పుకోవాలని.. టీ షర్ట్ థియేట్రిక్స్ ప్రదర్శిస్తున్నాడు..! అందులో భాగంగానే చలిలో స్వెట్టర్ వేసుకోకుండా చక్కర్లు కొడుతున్నాడు. మరోవైపు, పాండవులు, కౌరవులు, జై శ్రీరామ్, జై సియా రామ్, హర హర మహాదేవ్ వంటి మాటలు చెబుతూ.. హిందువుల్ని విడదీయాలని శత విధాలా సర్కస్ ఫీట్లు చేస్తున్నాడు. అందుకే, ఒకప్పుడు హిందూ ఉగ్రవాదం, రాముడు కల్పిత పాత్ర అన్న నోటితోనే.. ఇప్పుడు హిందూ దేవుళ్లని స్మరించుకుంటున్నాడు. అందులోనూ నిజాయితీ లేకపోవటమే.. అసలైన విషాదం..!

శరీరాన్ని కొరికేసే ఉత్తరాది చలిలో.. ఓ చిన్న పిల్లాడికి పైన ఆచ్ఛాదన ఏమీ లేకుండా.. కాంగ్రెస్ పార్టీ వారు జోడో యాత్రలో నడిపించారు..! అంతకంటే విడ్డూరం ఏంటంటే.. సదరు పిల్లవాడికి పెట్టుడు మీసాలతో పాటూ జంధ్యం కూడా వేశారు..! అదీ తప్పుడు విధానంలో..! ఎడమ భుజం పైనుంచి కాకుండా.. అపసవ్యంగా.. కుడి భుజంపై నుంచి జంధ్యం వేయించారు..! దాన్ని మీడియా కెమెరాలకు చూపించటం కోసం.. పిల్లవాడ్ని వణికించే చలిలో షర్టు లేకుండా.. రాహుల్ చేయి పట్టి నడిపించారు..! తీరా ఇలాంటి ఫోటో షూట్లు పూర్తికాగానే.. ఈ దేశం పూజారులది కాదంటూ.. జంధ్యాలు వేసుకునే అదే బ్రాహ్మణులకి వ్యతిరేకంగా.. తాజా కామెంట్స్ కూడా రాహుల్ గాంధీయే చేశాడు..! దీన్ని ఏమనాలి?

రాహుల్ గాంధీకి అర్జెంట్‎గా పీఎం అవ్వాలని ఉంది..! కానీ, క్షేత్ర స్థాయిలో తాను ఎంపీ అవ్వటం కూడా అసాధ్యంగా మారుతోంది..! ఆ నిస్సహాయ స్థితిలోంచి పుట్టిందే భారత్ జోడో యాత్ర..! ఎలాగైనా రాహుల్ ని బోలెడంత పరిణతి చెందిన, అందర్నీ కలుపుకుపోయే, మహా సెక్యూలర్ నేతగా జనం ముందు నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ, దానికి ఫండ్స్ ఇచ్చే కార్పొరేట్ శక్తుల తాపత్రయం..! అందు కోసమే, మూడేసి వేల కిలోమీటర్లు గాంధీ కుటుంబం వారి అబ్బాయి కాళ్లరిగేలా తిరిగేశాడు..! కానీ, కాస్త ఆలోచించే వారికి ఎవరికైనా చివరాఖరుగా ఓ విషయం అర్థం అవుతుంది..! మోదీని, బీజేపీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన హిందూ ఓటర్లని.. ఎలాగైనా చీల్చాలని రాహుల్ తహతహలాడుతున్నాడు..! భారత్ జోడో పేరుతో కొనసాగుతోన్నా.. ఆయనది.. హిందూ తోడో యాత్రే తప్ప మరోటి కాదు! బహుశా ఆ ట్రాప్ లో ఈసారి హిందువులు పడకపోవచ్చు..! ఎవరైనా పడే అవకాశాలున్నా.. మోదీ, అమిత్ షా, నడ్డా.. ఎప్పటికప్పుడు రాహుల్ వాఖ్యలపై దృష్టి పెడుతూనే ఉండాలి..! ఆయన ఇప్పటికీ ‘మేడిన్ కురుక్షేత్ర’ అంటున్నాడే తప్ప.. ‘మేడిన్ ఇండియా’ అని మనస్ఫూర్తిగా దేశం పేరు ఉచ్ఛరించటం లేదు..! కొన్నాళ్ల క్రితం లండన్‎లో కూర్చుని మరీ చెప్పాడు కదా.. భారతదేశం కొన్ని రాష్ట్రల కలయిక మాత్రమేనని..! కాబట్టి, చైనాతో సీక్రెట్ అగ్రిమెంట్ చేసుకున్న మన ఈ తరం గాంధీ.. భారత్ ముక్కలు కాకుండా ఆపుతాడనీ, అయ్యే అవకాశం వస్తే.. చేయకుండా ఉంటాడనీ.. మనం నమ్మలేం..! రాహుల్ కనిపించేటంత కామెడియన్ కాదు.. వినిపించేటంత సిన్సియర్ కూడా కాదు..!