నవ్వుల పాలు: నైజీరియా నుండి వచ్చిన చిరుతలు లంఫీ వైరస్ కు కారణమవుతున్నాయట

0
979

భారతదేశానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చిరుతలను తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే..! వాటిపై కూడా విమర్శలను చేయడానికి కాంగ్రెస్ పార్టీ వెనుకాడడం లేదు. నైజీరియా నుండి తీసుకు వచ్చిన చిరుతల కారణంగానే దేశంలో లంపీ వైరస్ వ్యాప్తి చెందిందని మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు ఆయన్ను కనీసం తెలుసుకొని మాట్లాడండంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్క్ లో నైజీరియా నుండి తీసుకు వచ్చిన చిరుతలను వదిలారు. దేశంలో అంతరించి పోయిన జాతిని నైజీరియా నుండి తెప్పించారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నైజీరియాలో కొంత కాలంగా లంపీ వైరస్ వ్యాప్తి చెందిందని.. అక్కడి నుండి చిరుతలను కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగానే భారత్ కు తెచ్చిందని ఆయన ఆరోపించారు. రైతులకు నష్టం చేసేందుకు ఈ చిరుతలను నైజీరియా నుండి తెప్పించారని అన్నారు. ముంబైకి శివారులో ఖార్ ప్రాంతంలో పశువులు కొత్త రకం వ్యాధి సోకిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో పటోలే ఈ వ్యాఖ్యలు చేశారు. ముంబైలో 27,500 పశువులున్నాయి. వీటిలో 2,200 ఆవులకు లంపీ వైరస్ రాకుండా వ్యాక్సిన్ వేసినట్టుగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ప్రకటించింది.