కాంగ్రెస్ పార్టీకి పలువురు నాయకులు ఊహించని షాక్ ను ఇస్తూ ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాహుల్ గాంధీకి సన్నిహితుడైన ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు జితిన్ ప్రసాద భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఈ రోజు ఢిల్లీలో బీజేపీ సభ్యత్వం స్వీకరించారు. ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జితిన్ ఈ మధ్య పశ్చిమబెంగాల్ ఇన్ చార్జిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్న నాయకుల్లో ఈయన కూడా ఒక్కరు.
జితిన్ ప్రసాద ఈరోజు ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి చేరుకొని ఆయనతో మాట్లాడారు. భేటీ అనంతరం జితిన్ ప్రసాద బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన జితిన్ ప్రసాద యూపీ ఎన్నికల వేళ బీజేపీలో చేరడం సంచలనంగా మారింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జితిన్ ప్రసాద గతేడాది జులైలో బ్రాహ్మణ చేతనా పరిషత్ నెలకొల్పి ఆ సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి యత్నిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఎడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో జితిన్ ప్రసాద బీజేపీలోకి చేరడం కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకింగ్ వార్త..! బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ అని, మిగతావన్నీ ప్రాంతీయ పార్టీలేనని జితిన్ ప్రసాద బీజేపీలో చేరిన తర్వాత వ్యాఖ్యలు చేశారు. జితిన్ ప్రసాద చేరికపై పలువురు బీజేపీ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ కు చెందిన జితిన్ ప్రసాద బ్రాహ్మణ నాయకుడు. బ్రాహ్మణ చేతన్ పరిషత్ అనే పేరుతో బ్రాహ్మణులకు న్యాయం జరగాలని క్యాంపెయిన్ నిర్వహించారు. 2004 లో షాజహాన్ పూర్ నుంచి, 2009లో దవరాహా నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. జితిన్ రాజీవ్ గాంధీకి, పివి నరసింహారావుకు రాజకీయ సలహాదారుగా పనిచేసిన జితేంద్ర ప్రసాద కుమారుడు.1999లో ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం సోనియా గాంధీ మీద పోటీ చేశారు. 2000లో ఆయన మరణించారు. ఆ తర్వాత రాజకీయ వారసత్వాన్ని జితిన్ ప్రసాద కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జ్యోతిరాదిత్య సింధియా, హిమంత బిశ్వ శర్మ వంటి కీలక నేతలను దూరం చేసుకుంది. ఇప్పుడు జితిన్ ప్రసాద కూడా దూరమవ్వడం కాంగ్రెస్ పార్టీని కోలుకోని దెబ్బ తీసింది.