Special Stories

అధికారంలోకి వస్తే.. ఆర్టికల్ 370..!?
పాక్ జర్నలిస్ట్‎తో దిగ్విజయ్ చిట్‎చాట్..!

మన దేశంలో పదవి కోసం.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రాజకీయ నాయకులున్నారు. అధికారం కోసం.. అసరమైతే దేశాన్ని తాకట్టుపెట్టే లీడర్లూ వున్నారు. కుర్చీ దక్కుతుందంటే, టెర్రిస్టులతోనైనా పొత్తు పెట్టుకునే కుహనా మేధావులూ వున్నారు. అలాంటి వాళ్లు పాకిస్తాన్ ఉగ్రవాదులకన్నా ప్రమాదం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. తాజాగా అటువంటి ఉదంతమే ఒకటి వెలుగుచూసింది. కాంగ్రెస్ టూల్‎కిట్‎లో మరో కొత్త వెర్షన్ రిలీజ్ అయ్యింది. ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేరన్న చందంగా.. భరతమాత కడుపునపుట్టి.. కన్నింగ్ పనులు చేస్తున్న ఓ సీనియర్ రాజకయనాయకుడి కుటిల మనస్తత్వం మరోసారి వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల క్లబ్‎హౌజ్ అనే ఆడియో యాప్‎లో ఓ పాకిస్తాన్ జర్నలిస్టుతో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. ఆర్టికల్ 370 తేనెతుట్టెను మళ్లీ కదిపారు. దేశభద్రతకు పెనుసవాలుగా మారిన ఆర్టికల్ 370ని 2019 ఆగస్ట్ 5న మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంతో రక్తమోడిన కశ్మీర్‎కు విముక్తి కల్పిస్తూ.. దేశంలో పూర్తిగా విలీనం చేసింది. అయితే, తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 అమలను పరిశీలిస్తామని.. అదీ ఓ పాకిస్తాన్ జర్నలిస్టుకు సూచనప్రాయంగా హామీ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

పాకిస్తాన్ కు చెందిన షెహ్‎జెబ్ జిలానీ అనే ఓ జర్నలిస్టు.. గతంలో పాక్ ఉర్దూ ఛానెల్ దున్యా న్యూస్‎తో పాటు బీబీసీ పాకిస్తాన్ కరెస్పాండెంట్ గా పనిచేశాడు. ప్రస్తుతం జర్మనీ నివసిస్తున్న అతడు.. గతంలో అక్కడి D.W. న్యూస్ లో కూడా పనిచేశాడు. సదరు సో కాల్డ్ జర్నలిస్టు.. ఇటీవల క్లబ్‎హౌజ్ అనే ఆడియో యాప్‎లో నిర్వహించిన ఓ చర్చాగోష్టిలో పాల్గొన్నాడు. ఇదే చర్చాగోష్టిలో సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్బంగా.. మోదీ పాలనలో రాజకీయాలు,.. భారత్‎లో మారుతున్న పరిస్థితులను చూసి తాను షాక్ కు గురయ్యానని.. కల్లబొల్లి కబుర్లు చెప్పుకొచ్చాడు. అంతేకాదు, భారత్‎లో ప్రతికాస్వేచ్ఛ తగ్గిపోయిందని.. భారత్, పాక్ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయని ఆరోపించాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గత రెండు మూడు నెలల్లో.. భారతీయ మీడియా మోదీకి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతుందో తాను గమనిస్తున్నానని.. తన కుట్రపూరిత మనస్తత్వాన్ని భయటపెట్టుకున్నాడు. ఇదిలావుంటే, ది గ్రేట్ కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించిన జిలానీ.. దేశంలో మోదీ ప్రభుత్వం దిగిపోతే, కశ్మీర్ విషయంలో మీ ముందున్న కర్తవ్యమేంటి..? అని అడిగాడు.

దీనికి సమాధానం ఇచ్చిన దిగ్విజయ్ సింగ్.. ఆర్టికల్ 370 తేనెతుట్టెను కదిపి ఇబ్బందుల్లో పడ్డాడు. హిందువుల, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు లేదా ఇతర ఏ మతమైనా కావచ్చు.. మత మౌలికవాదం అనేది సమాజానికి ప్రమాదమని సెలవిచ్చిన దిగ్విజయ్.. మతమౌలికవాదం ద్వేషానికి దారితీస్తుందని.. ఆ ద్వేషం హింను ప్రేరేపిస్తుందని స్టేట్ మెంట్లు ఇచ్చాడు. సమాజంలోని ప్రతి మతంలో.. తమ సంప్రదాయాన్ని, విశ్వాసాన్ని అనుసరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. తమ విశ్వాసాలను వేరొకరిపై రుద్దే హక్కు ఎవరికీ లేదని నిఖార్సయిన లౌకివాదిగా కలరింగ్ ఇచ్చాడు. అయితే, ఈ సందర్భంగా కశ్మీర్ అంశంపై మాట్లాడిన దిగ్విజయ్.. ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ప్రజాస్వామ్యం నశించిపోయిందని.. అందర్నీ జైల్లో పెట్టడంతో మానవత్వం కూడా నశించిందని చెప్పుకొచ్చాడు. ఇక, కశ్మీరియత్ అనేది లౌకికవాదానికి ప్రతీక అన్న ఆయన.. ముస్లిం జనాభా అధికంగా వున్న కశ్మీర్‎కు ఒకప్పుడు హిందూ రాజు ఉండేవాడని.. అంతా కలిసి పనిచేసేవారని.. ఇదే కశ్మీరియత్ కు నిదర్శమని సెలవిచ్చాడు. వాస్తవానికి కశ్మీర్ లో కశ్మీరీ పండిట్లకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారని.. అలాంటప్పుడు ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్ము కశ్మీర్ రాష్ట్ర హోదాను తగ్గించడం విచారకరమని అన్నారు. తాము దీనిపై కచ్చింతగా దృష్టిపెడతామని.. ఆర్టికల్ 370 అమలను పరిశీలిస్తామని స్పష్టం చేశాడు.

ఇలా, భరతమాత గుండెలపై గుదిబండలాంటి.. ఆర్టికల్ 370కి వత్తాసు పలికిన దిగ్విజయ్ సింగ్.. స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి.. దేశంలో భాగమైన కశ్మీర్‎ను ఎందుకు విడిగా ఉంచాల్సి వచ్చిందో మాత్రం చెప్పలేదు. అంతేకాదు, కశ్మీర్ భూమిపుత్రులైన కశ్మీరీ పండిట్లు.. అక్కడి నుంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చిందో చెప్పే ప్రయత్నం చేయలేదు. కశ్మీరీ పండిట్లకు రిజర్వేషన్లు కల్పించారని గొప్పలు చెప్పిన దిగ్విజయ్.. మరి, కశ్మీరీ పండిట్ల ఊచకోతల గురించి మాట్లాడకపోవడం తన కుటిలనీతికి అద్దం పడుతోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు కశ్మీర్ లోని హిందువులను, కశ్మీరీ పండిట్లను ఊచకోత కోసినప్పుడు వారి ఆర్తనాదాలు.. దిగ్విజయ్ కి వినిపించలేదా..?

ఆర్టికల్ 370ని రద్దు చేసి.. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి తొలగిస్తామని.. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చింది. అన్నట్టుగానే 2019 ఆగస్ట్ 5న తన హామీని నెరవేర్చింది. పునర్వవస్థీకరణ చట్టం ప్రకారం.. రాష్ట్రాన్నిరెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది. ఈ నిర్ణయం 2019 అక్టోబర్ 31న అమల్లోకి వచ్చింది. ఇలా ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకుని.. పాక్ ప్రేరేపిత ఉగ్రమూకల నుంచి.. పాక్ పెంపుడు పాలకుల నుంచి కశ్మీర్ కు రక్షణ కల్పించింది. కానీ, తాము అధికారంలోకి వస్తే తిరిగి ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని.. అదీ ఓ పాకిస్తానీ జర్నలిస్టుకు దిగ్విజయ్ సింగ్ హామీ ఇవ్వడం.. కాంగ్రెస్ కుటిలనీతిని మరరోసారి బయటపెట్టింది. మైనార్టీ ఓట్లకోసం అవసరమైతే కశ్మీర్ మళ్లీ ఉగ్రవాదులు చేతుల్లో పెట్టేందుకైనా.. కాంగ్రెస్ వెనుకాడదనేది తేలిపోయింది.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. దిగ్విజయ్ సింగ్ క్లబ్‎హౌజ్ యాప్‎లో ఏ జర్నలిస్టుతోనైతే మాట్లాడాడో.. అతనిపై అనేక ఆరోపణలున్నాయి. షెహ్‎జెబ్ జిలానీ ట్విట్టర్ ప్రొఫైల్ ప్రకారం.. అతడు గతంలో పాకిస్తాన్, బీరుట్, వాషింగ్టన్, లండన్ లో బీబీసీ కరెస్పాండెంట్ గా పనిచేశాడు. ఇంతకుముందు జర్మనీలోని D.W. న్యూస్ లో కూడా పనిచేసినట్టు తెలుస్తోంది. అయితే, ఈ మాజీ D.W. న్యూస్ జర్నలిస్ట్.. తాను ఇప్పుడు కూడా D.W. న్యూస్ లోనే పనిచేస్తున్నానని చెప్పుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇక, పాకిస్తాన్ లోని సింధ్ తన జన్మస్థలమని.. దిగ్విజయ్ సింగ్ కు పరిచయం చేసుకున్న షెహ్‎జెబ్ జిలానీపై.. గతంలో సైబర్ టెర్రరిజానికి పాల్పడినట్టు ఆరోపణులున్నాయి. ‘2016 ప్రివెన్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్’ లోని 4 అధికరణలు, అలాగే, పాకిస్తాన్ క్రిమిన్ కోడ్ లోని రెండు ప్రొవిజన్లను ఉల్లంఘించిన జిలానీపై.. పాకిస్తాన్‎లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సుప్రీం కోర్టులో అతనికి వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలైంది. అలాంటి ఒక ఉగ్రవాద సానుభూతి కలిగిన ఓ జర్నలిస్టుతో.. అదీ దేశంలో రాజ్యంగ బద్ధంగా తొలగించిన ఓ చట్టం గురించి చర్చించడం.. ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకుడికే చెల్లింది.

ఇదిలావుంటే, దిగ్విజయ్ సింగ్ కదిపిన ఆర్టికల్ 370 తేనెతుట్టె.. కాంగ్రెస్ పార్టీని చుట్టుముట్టింది. దిగ్విజయ్ టూల్‎కిట్‎పై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దిగ్విజయ్ సింగ్ పాకిస్తాన్ పల్లవి పాడుతున్నారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ డిమాండ్స్‎కు వంతపాడుతూ.. దేశంపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ఇది భారత్‎కు వ్యతిరేకంగా జరుగుతున్న టూల్‎కిట్‎లో భాగమని అన్నారు. భారత్‎కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు దిగ్విజయ్ పాక్‎తో ఒప్పందం కుదుర్చుకున్నారా..? అని ప్రశ్నించారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై సోనియా, రాహుల్ గాంధీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, కిరణ్ రిజిజు సైతం దిగ్విజయ్ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఓ ఎంపీ.. ఉగ్రవాద సానుభూతి కలిగిన ఓ జర్నలిస్టుతో.. దేశ చట్టాల గురించి చర్చించడంపై జాతీయవాదులు మండిపడుతున్నారు. ఇలా రోజుకో రకంగా కుట్రపూరిత కాంగ్రెస్ టూల్‎కిట్లు వెలుగుచూస్తుండటంపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

4 + 15 =

Back to top button