కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయడానికి ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎంతో మంది వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది కరోనా రోగుల బాగోగులు చూడడం కోసం పగలూ రాత్రుళ్ళు తేడా లేకుండా కష్టపడుతూ ఉన్నారు. కొందరు రాజకీయ నాయకులు మాత్రం ఆసుపత్రి సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు.
రాజస్థాన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత బీనా గుప్తా కోవిడ్ కేర్ సెంటర్ లో దూకుడుగా ప్రవర్తించింది. ఆసుపత్రి సిబ్బందిని ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ కనిపించింది. ఆల్వార్ మున్సిపల్ కౌన్సిల్ చైర్ పర్సన్ అయిన బీనా గుప్తా సిబ్బందితో దుర్భాషలాడుతూ కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కూడా అవుతోంది. ఆసుపత్రి రిసెప్షనిస్టుతో దురుసుగా మాట్లాడుతున్న ఆమె.. కాలర్ పట్టుకుని క్యాబిన్ నుండి బయటకు లాగేసింది. ఆల్వార్ లోని హరీష్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది ఆమె ఫోన్ కాల్ ను లిఫ్ట్ చేయకపోవడంతో ఆమెకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో రిసెప్షనిస్టు పైనా.. ఆసుపత్రి సిబ్బంది పైనా దురుసుగా ప్రవర్తించింది. వారిని తిట్టడమే కాకుండా ఆసుపత్రిని మూసేస్తామంటూ బెదిరింపులకు దిగారు.
బీనా గుప్తా ఆసుపత్రి లోని వైద్యులతో మాట్లాడాలి అంటూ కాల్ చేసిందట.. అయితే వైద్యులు రోగులను పర్యవేక్షిస్తూ ఉండడం వలన బీనా గుప్తా కాల్ ను లిఫ్ట్ చేయలేకపోయారు. దీంతో ఆమె ఆసుపత్రికి వచ్చి.. తనతో పాటూ కాంగ్రెస్ కార్యకర్తలను పిలుచుకుని వచ్చి ఆసుపత్రి ముందు రచ్చ రచ్చ చేసింది. వెంటనే ఆల్వార్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక ఇప్పటివరకు 244 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వెల్లడించింది. అత్యధికంగా బీహార్లో 69 మంది, ఉత్తరప్రదేశ్ లో 34 మంది, ఢిల్లీలో 27 మంది డాక్టర్లు కరోనాతో కన్నుమూశారని ఐఎంఏ తెలిపింది. దేశంలో చనిపోయిన మొత్తం డాక్టర్లలో కేవలం 3 శాతం మందే 2 డోసుల వ్యాక్సిన్ పొందారని.. అందుకే డాక్టర్లు కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కరోనా ఫస్ట్ వేవ్ లో మొత్తం 736 మంది డాక్టర్లు చనిపోయారు. ఎంతో మంది వైద్య సిబ్బంది కూడా కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ కొందరు నాయకులు వైద్య సిబ్బంది మీద దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు.