More

  అంతర్ధాన స్థితిలో హస్తం పార్టీ..! కాంగ్రెస్ కంటే, ప్రాంతీయ పార్టీలే మిన్న..!!

  హస్తం పార్టీ స్వహస్తాల్లో నుంచి మెల్ల మెల్లగా అన్ని రాష్ట్రాలు జారిపోతున్నాయి. ఒకప్పుడు దేశాన్న అప్రతిహతంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోతోంది. దాదాపు డెబ్బై దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ చేతిలో ఇప్పుడు కేవలం రెండంటే రెండు రాష్ట్రాలు మాత్రమే మిగిలాయి. గెలవడానికి అవకాశమున్న రాష్ట్రాల్లో కూడా కనీస పోటీని కూడా ఇవ్వని పరిస్థితికి చేరుకుంది. తాజా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసినా,.. ఈజీ విన్ సాధించాల్సిన హిమాచల్ ప్రదేశ్‎లో గట్టి పోటీని ఇచ్చి ఆగిపోనుందనే తెలుస్తోంది. సాధారణంగా హిమాచల్ ప్రదేశ్‎లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య అధికారం మారుతూ ఉంటుంది. ఈ రాష్ట్రంలో యాంటీ ఇన్ కంబెన్సీ ప్రతిపక్షాలకు బలంగా మారడం వల్ల ఈ విధమైన సంప్రదాయం ఏర్పడింది. అయితే ఈ సారి ఎన్నికల్లో ఈ పరిస్థితిని కూడా కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోలేకపోయిందనే విషయం స్పష్టమవుతోంది. అటు గుజరాత్ లో కూడా ఈ సారి కాంగ్రెస్ పార్టీకి సీట్లు భారీగా తగ్గిపోయే అవకాశముందని ఈ సర్వే సంస్థలు తెలుపుతున్నాయి. గుజ్జర్ల రాష్ట్రంలో కమలదళం మళ్ళీ అధికారాన్ని జిక్కించుకోవడం ఖాయమని ఇప్పటికే సర్వేలన్నీ తేల్చేశాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే మరిన్ని సీట్లు తగ్గబోతున్నాయని సర్వేసంస్థలు తెలుపుతున్నాయి. గత ఎన్నికల్లో 77 సీట్లతో కమల దళానికి ముచ్చెమటలు పట్టించిన కాంగ్రెస్,.. ఈ సారి మాత్రం కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయిందని గణాంకాలను చూస్తే అర్థమవుతోంది. ఒకవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న సీట్లను నిలబెట్టుకోలేకపోతోంది.

  మునిగిపోతున్న నావను ఒడ్డుకు చేరుస్తానని చేపట్టిన,.. భారత్ జోడో యాత్ర కూడా దేశంలో ఎటువంటి ప్రభావం చూపడంలేదన్నది,.. ఎగ్జిట్ పోల్స్ తో స్పష్టమవుతోంది. రాహుల్‎ను దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయించడం ద్వారా,.. ప్రజల్లో మమేకమయ్యే వ్యక్తిగా చూపి ఓట్లను దండుకోవచ్చని కాంగ్రెస్ భావించింది. కానీ, హస్తం పార్టీ ఆశలు అడియాసలయ్యాయి. ఇందుకు ఉదాహరణ మన తెలంగాణే. కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. సరిగ్గా ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణ గుండా సాగింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర మీడియా కూడా చాలా ప్రచారం ఇచ్చింది. తీరా ఫలితాలు విడుదలయ్యాక చూస్తే కాంగ్రెస్ పార్టీకి అవమాన భారం మాత్రమే మిగిలింది. పార్టీ అధినాయకుడి పాదయాత్ర ఈ నియోజకవర్గంలో కనీస ప్రభావం కూడా చూపలేకపోవడంతో సిట్టింగ్ సీటు నుంచి డిపాజిట్లు కోల్పోయే స్థాయికి చేరుకుంది. ఇక, ఉత్తర భారతంలో కూడా ఎన్నికలు జరిగే సమయంలోనే రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగింది. ప్రతిరోజూ కాంగ్రెస్ అనుకూల పత్రికలతో పాటు న్యూయార్క్ టైమ్స్ అనే విదేశీ పత్రికలు కూడా రాహుల్ గాంధీని పొగుడుతూ ఊహాగానాలతో కథనాలను వండి వార్చాయి. వీటితో పాటు తటస్థ మీడియా సంస్థలు కూడా రాహుల్ కు బాగానే కవరేజీ ఇచ్చాయి. అయినప్పటికీ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కనీసం డబుల్ డిజిట్‎ను కూడా చేరుకోలేక చతికలబడింది. వీటితో పాటు, ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లోనూ మట్టికరిచింది. హిమాచల్ ప్రదేశ్ పై ఆశలు పెట్టుకున్నా.. అది వర్కౌట్ అయ్యేట్టు కనిపించడం లేదు.

  ఇక హస్తం పార్టీ కొత్తగా గెలుచుకునే రాష్ట్రాల మాట అటుంచితే,.. ఇప్పటికే అధికారంలో ఉన్న రాష్ట్రాలను కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ కు ఉన్న ప్రధాన రాష్ట్రాల్లో ఒకటైన పంజాబ్ ను ఆమాద్మీ తన్నుకుపోయింది. రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ లలో వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరుగుతున్నాయి. రాజస్తాన్ లో ప్రతి ఎన్నికల్లో ప్రభుత్వం మారే సాంప్రదాయం కొనసాగుతోంది. ఇప్పటివరకు వరుసగా ఒకే పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. దీనికి తోడు రాజస్తాన్ లో ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్ లో వర్గపోరు తీవ్రంగా ఉంది. దీంతో రాజస్తాన్ కూడా కాంగ్రెస్ పార్టీ చేజారిపోయే అవకాశాలే ఎక్కువ. ఇదే జరిగితే కాంగ్రెస్ అధికారంలో ఉండటానికి చెప్పుకోదగ్గ రాష్టాలేవీ ఉండవు. ఏదో ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండటమైనా,.. లేక జార్ఖండ్, బీహార్ లో లాగా తోక పార్టీ లా అయినా ఉండాల్సి వస్తుంది.

  అయితే కాంగ్రెస్ పతనం ఇక్కడితో ముగిసిపోదు. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోతే కాంగ్రెస్ కు భారీ దెబ్బ తగులుతుంది. ఇప్పటికి రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాకూడా కాంగ్రెస్ ను నిధుల కొరత వేధిస్తోంది. పార్టీ విరాళాలతో పాటు ఎన్నికల్లో డబ్బులు పంచడానికి కూడా నిధుల కొరత ఏర్పడింది. ఇక మిగిలిన రెండు రాష్ట్రాలను కూడా కోల్పోతే వచ్చే కాసిన్ని నిధులు కూడా ఆగిపోయే అవకాశముంది. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తగులుతుంది. ఇక ఈ సమయంలోనే కాంగ్రెస్ స్థానాన్ని ఆయా ప్రాంతీయ పార్టీలు ఆక్రమించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతాయి. హస్తం పార్టీ నుంచి పుట్టుకొచ్చిన పిల్ల కాంగ్రెస్ లు ఈ స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. ఇప్పటికే ఢిల్లీలో పుట్టిన ఆమాద్మీ పంజాబ్ లో ప్రత్యక్షంగానే కాంగ్రెస్ పుట్టిని ముచింది. తాజాగా గుజరాత్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓట్లను ఆమాద్మీ భారీగా దెబ్బతీస్తోందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ సీట్లను ఆమాద్మీ మెల్ల మెల్లగా భర్తీ చేయడం మొదలవుతోంది. కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఆమాద్మీ చురుగ్గా విస్తరిస్తోంది. ఈ పద్దతి ఇదే విధంగా కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టుల మాదిరి పేరుకే జాతీయ పార్టీ అన్న చందంగా తయారయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

  అయితే ఈ సమస్యను కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే గుర్తించాల్సి ఉండేది. కాంగ్రెస్ కు ఇప్పటి పరిస్థితి ఏర్పడటానికి ముఖ్య కారణాలు చాలానే ఉన్నాయి. వీటిలో కొన్నింటిన విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ లో ఈ పరిస్తితి రావడానికి ముఖ్యమైన కారణం అంతర్గత కలహాలే.. దేశంలో ఏ పార్టీకి లేనంతగా కాంగ్రెస్ ను వర్గపోరు వేధిస్తోంది. ఈ వర్గపోరును అధిష్టానం కూడా తీర్చకుండా చోద్యం చూడటం వల్లే హస్తం పార్టీ తీవ్రంగా నష్టపోతోంది. పంజాబ్ లో అమరీందర్ సింగ్ కు వ్యతిరేకంగా నవ్ జ్యోత్ సింగ్ సిద్దూను రెచ్చగొట్టడం, మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింథియాకు సముచిత స్థానం ఇవ్వకపోవడం వల్లే ఈ రెండు రాష్ట్రాలనూ కాంగ్రెస్ కోల్పోయింది. ఇక రాజస్తాన్ లో కూడా ఈ వర్గపోరు తీవ్రంగా ఉంది. కొన్నిసార్లు ఇది బయటపడి సద్దుమణిగినా ఎప్పుడో ఒకసారి ఇది కాంగ్రెస్ పుట్టిని ముంచడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ అగ్రనాయకులు పార్టీ పట్ల ఏమాత్రం చిత్త శుద్ది లేకుండా వ్యవహరిస్తున్నారు. పార్టీలో తీర్చగలిగే చిన్న చిన్న విభేదాలను కూడా పట్టించుకోకుండా వదిలేసింది. రాహుల్ గాంధీ ఒక్కరే భారత్ జోడో యాత్ర అని దేశాటనకు నడుం బిగించినా అది ఏమాత్రం ప్రభావం చూపడంలేదు. కనీసం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో అయినా ప్రియాంకా గాంధీ చురుగ్గా పాల్గొని ప్రచారం చేసి ఉంటే కొన్ని ఎక్కువ సీట్లైనా సాధించగలిగేది. కానీ కనీస ప్రచారం కూడా చేయకుండా కాలాయాపం చేశారు.

  ఇక ఇప్పటికైనా వచ్చే 2024 లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికా బద్దంగా దృష్టి సారించి ముందుకెళ్ళాల్సిన అవసరముంది. అంతర్గత విభేదాలను పరిష్కరించి ఎన్నికలకు సిద్దం చేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో అయినా నామమాత్రపు సీట్లను తెచ్చుకుంటే భవిష్యత్తులో కాంగ్రెస్ బతికుండే అవకాశముంటుంది. లేకపోతే 2024 తర్వాత కాంగ్రెస్ పరిస్థితి మరింతగా దిగజారి ప్రాంతీయ పార్టీ స్థాయికి చేరుకుంటుంది.

  Trending Stories

  Related Stories