ఎగురవేద్దామనుకుంటే.. సోనియా గాంధీ చేతుల్లోకి జారి పడ్డ కాంగ్రెస్ పార్టీ జెండా..!

0
722

ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించేందుకు ప్రయత్నించగా, ఆ జెండా పై నుంచి కిందపడింది. జెండాను ఆవిష్కరించినప్పటికీ ఎగురవేయలేకపోయారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో వ్య‌వ‌స్థాపక దినోత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. 137వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ జెండాను ఎగుర‌వేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. జెండాకు క‌ట్టిన తాడును కార్యాల‌య సిబ్బంది వేగంగా లాగగా.. సోనియా కూడా అంతే వేగంతో తాడును లాగారు. జెండా కాస్త ఊడిపోయి సోనియా మీద ప‌డిపోయింది. ఓ మ‌హిళా కార్య‌క‌ర్త వేగంగా వ‌చ్చి.. జెండాను స‌ర్దే ప్ర‌య‌త్నం చేశారు. కానీ చివ‌ర‌కు ఆ జెండాను ఎగుర‌వేయ‌కుండానే ప‌క్క‌కు పెట్టేశారు.

పార్టీ కోశాధికారి పవన్ బన్సాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కలిసి సోనియాగాంధీ చేతిలో పార్టీ పతాకాన్ని పట్టుకుని కొద్దిసేపు ప్రదర్శించారు. అనంతరం ఒక కాంగ్రెస్ కార్యకర్త పార్టీ త్రివర్ణ పతాకాన్ని ఉంచేందుకు జెండా స్తంభంపైకి ఎక్కాడు. కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున్ ఖర్గే తదితరులు పార్టీ ప్రధాన కార్యాలయంలో పాల్గొన్నారు. ఇక సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అని కార్య‌క‌ర్త‌లు నిన‌దించారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రాలలో ఒకటైన పంజాబ్‌లో ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంది. పంజాబ్‌లో, అంతర్గత విభేదాల మధ్య కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పొత్తుతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో పోరాడటానికి తన స్వంత పార్టీని స్థాపించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ కొత్తగా సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మంచి పనితీరును కనబరచాలని భావిస్తోంది. ధరల పెరుగుదల వంటి సమస్యలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, ప్రదర్శనల ద్వారా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది.

దేశవ్యాప్తంగా రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిల నుండి సుమారు 5,500 మంది కార్యకర్తలను సిద్ధం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పెద్ద శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. వీరంతా చర్చల ద్వారా పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తారు. ఈ ఏడాది నవంబర్‌లో మహారాష్ట్రలోని వార్ధాలో మొదటి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు, అక్కడ ఐదు రోజుల శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ వర్చువల్ గా ప్రసంగించారు. న్యాయవాది ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన ముంబైలో డిసెంబర్ 28, 1885న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) ఏర్పాటైంది.