దేశాన్ని ఉపేస్తున్న ఉదయనిధి వ్యాఖ్యలు.. సనాతన ధర్మంపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు..!

0
167

దేశ వ్యాప్తంగా ఒకే చర్చ, రచ్చ జరుగుతోంది. సనాతన ధర్మాన్ని ఉద్దేశిస్తూ డీఎంకే లీడర్ ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్లపై దేశవ్యాప్తంగా రగడ కొనసాగుతున్నది. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉదయనిధి తీరుపై బీజేపీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. హిందూవాద సంఘాలు కూడా ఉదయనిధిపై మండిపడుతున్నాయి. సారీ చెప్పేదే లేదని ఉదయనిధి తెగేసి చెప్పడం… కొడుకు చేసిన కామెంట్లలో తప్పేం లేదంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించడంతో బీజేపీ లీడర్లు మరింత మండి పడుతున్నారు. పలు రాష్ట్రాల్లో బీజేపీ, హిందూవాద సంఘాల లీడర్లు ఉదయనిధి స్టాలిన్​పై పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు చేస్తున్నారు.

సనాతన ధర్మం.. సమానత్వం, సామాజిక న్యాయానికి విరుద్ధమని, దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి కామెంట్లు చేశారు. సనాతన ధర్మాన్ని కరోనా వైరస్, మలేరియా, డెంగ్యూ జ్వరాలతో పోల్చారు. అలాంటి వాటిని వ్యతిరేకించొద్దని.. పూర్తిగా నాశనం చేయాలని పిలుపునిచ్చారు. రాజస్థాన్ పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ఈ గొడవపై స్పందించారు. సోనియా, రాహుల్, అశోక్ గెహ్లాట్ ఎందుకు సైలెంట్​గా ఉన్నారని ప్రశ్నించారు. ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశ ప్రజలే బుద్ధి చెప్తారని విమర్శించారు.

హిందూ మతాన్ని లక్ష్యంగా చేసేందుకే ఇండియా కూటమి ముంబైలో సమావేశమైందా? అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, నితీశ్​కుమార్, మమతా బెనర్జీ లాంటి లీడర్లు ఓట్ల కోసం హిందువుల మనోభావాలతో ఆడుకోవద్దని సూచించారు. వందల ఏండ్ల ఇస్లామిక్ పాలన కూడా సనాతన ధర్మాన్ని నిర్మూలించలేకపోయిందన్నారు. సనాతన ధర్మంపై దాడి.. ప్రతిపక్షాల కుట్రలో భాగమే అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ముంబైలో ఇండియా కూటమి ఎజెండా తయారు చేసిందని, దేశ వ్యాప్తంగా ఇది అమలు చేసేందుకు చూస్తున్నదని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్​వాల్ విమర్శించారు. ఉదయనిధి మైండ్​సెట్ దోమలాగే చాలా చిన్నదని కర్నాటక మాజీ సీఎం బస్వరాజ్ బొమ్మై అన్నారు. ఉదయనిధిని హిట్లర్​తో పోల్చారు. తమిళనాడు భవన్ ముందు ప్రొటెస్ట్ చేస్తామంటూ ఢిల్లీ బీజేపీ లీడర్లు అక్కడి తమిళనాడు రెసిడెంట్ కమిషనర్​కు మెమొరాండం అందజేశారు.

ఉదయనిధి కామెంట్లపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌‌ షా విరుచుకుపడ్డారు. డీఎంకే పార్టీ విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నదని, వచ్చే ఎన్నికల్లో హిందూ వ్యతిరేక వ్యూహాన్ని ఇండియా కూటమి అనుసరించబోతున్నదా? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని జేపీ నడ్డా ప్రశ్నించారు. రెండు రోజులుగా ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నదని.. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే డీఎంకే, కాంగ్రెస్ నేతలు సనాతన ధర్మాన్ని అంతం చేయాలని మాట్లాడుతున్నారన్నారు. మన సనాతన ధర్మాన్ని అవమానించడం ఇదే మొదటిసారి కాదని అమిత్ షా మండిపడ్డారు. కాగా, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్​పై బీహార్ కోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. సనాతన ధర్మాన్ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్లతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముజఫర్​పూర్​కు చెందిన సుధీర్ కుమార్ ఓఝా ఈ పిటిషన్ ఫైల్ చేశారు.

ఇక ఉదయనిధి కామెంట్లపై కాంగ్రెస్​లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని మతాలను గౌరవించాలని కొందరంటే.. అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉందని మరికొందరు అంటున్నారు. తమ అభిప్రాయాన్ని వెల్లడించే స్వేచ్ఛ అందరికీ ఉంటుందని కేసీ వేణుగోపాల్ అన్నారు. తమది ‘సర్వధర్మ సంభవం’ సిద్ధాంతం అని స్పష్టం చేశారు. సమాన హక్కులు ఇవ్వని ఏ రిలీజియన్ అయినా.. మతం కాదని, ఉదయనిధి అన్నది కరెక్టేనని ప్రియాంక్ ఖర్గే అన్నారు. ఉదయనిధి కామెంట్లు దురదృష్టకరమని కేంద్ర మాజీ మంత్రి కరణ్​సింగ్ అన్నారు. ‘సనాతన ధర్మంపై చేసిన కామెంట్లు అతని వ్యక్తిగతమని.. తాను ఉదయనిధితో ఏకీభవించనని కమల్​నాథ్ అన్నారు. ఉద‌‌య‌‌నిధి స్టాలిన్ కామెంట్లను ఖండిస్తున్నామని, ఇండియా కూటమికి వీటితో సంబంధంలేదని టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు.

మరోవైపు ఉదయనిధి వ్యాఖ్యలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవని అన్నారు. అజ్ఞానంతో ఇలాంటి వ్యాఖ్యలను ఉదయనిధి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి సనాతన ధర్మం గురించి తెలియదని అన్నారు. ఉదయనిధి సమానత్వం గురించి మాట్లాడితే హిందువులపై ఎందుకు వివక్ష చూపుతున్నాడని తమిళిసై ప్రశ్నించారు. ఉదయనిధి స్టాలిన్ తండ్రి సీఎం ఎంకే స్టాలిన్ హిందువుల పండగలకు ప్రజలకు శుభాకాంక్షలు చెప్పరని గుర్తు చేశారు. దీపావళి, కృష్ణజయంతి, వినాయక చతుర్థి వంటి పండుగలకు ఆయన శుభాకాంక్షలు చెప్పరన్నారు. తనను తాను గొప్ప క్రైస్తవుడిగా పేర్కొంటున్న ఆయన ఎందుకు ఇంకో మతాన్ని నిర్మూలించాలని కోరుకుంటున్నారని ప్రశ్నించారు. ఉదయనిధి ప్రజలకు క్షమాపణ చెప్పాలని తమిళిసై డిమాండ్ చేశారు.

అటు ఉదయనిధి మరోసారి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని.. కేసులను ఎదుర్కోడానికి రెడీ అన్నారు. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అని ప్రధాని నరేంద్ర మోదీ అనలేదా? దాని అర్థం ఏంటి? నేను సనాతన ధర్మాన్ని మాత్రమే విమర్శించానన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించమని మళ్లీ చెబుతున్నానని.. పదే పదే ఇదే చెబుతా అన్నాడు. కొందరు ద్రవిడాన్ని రద్దు చేయాలంటున్నారని.. అంటే డీఎంకే వాళ్లను చంపాలా? అని ప్రశ్నించాడు. సనాతన అంటే ఏదీ మారొద్దు.. అన్నీ శాశ్వతమన్నారు. ద్రవిడం మార్పు కోసం పిలుపు నిస్తుందని.. అందరూ సమానంగా ఉండాలని చెబుతుందన్నారు. తన ప్రకటనను వక్రీకరించి ప్రచారం చేయడం బీజేపీకి మామూలే అని విమర్శించాడు.

ఇక దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించాడు. తన లోపాలను కప్పి పుచ్చుకోవడానికి బీజేపీ మతాన్ని ఆయుధంగా ఎంచుకుందన్నారు. ఉదయనిధి అన్నదాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. ప్రజల్లో మతపరమైన మనోభావాల మంటను రాజేసి, అందులో చలి కాచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని.. దేశంలో హింస, విద్వేష బీజాలను నాటిందన్నారు. మణిపూర్ లో చెలరేగిన మతపరమైన మంటలు రాష్ట్రాన్ని దగ్ధం చేస్తున్నాయని.. హర్యానాలో అమాయక ప్రజల ప్రాణాలను, ఆస్తులను బలి తీసుకుంటున్నా యన్నారు. ఇండియా కూటమి గెలవకుంటే దేశం అంతా మణిపూర్ అవుతుందన్నారు. ఇప్పటికైనా దీనికి ముగింపు పలకాలని.. లేకపోతే దేశాన్ని, ప్రజలను ఎవరూ కాపాడలేరని హితవు పలికారు.

అటు ఉదయనిధి తల నరికితే రూ.10 కోట్లు ఇస్తానంటూ అయోధ్యకు చెందిన పరమహంస ఆచార్య సంచలన ప్రకటన చేశారు. సనాతన ధర్మానికి లక్షల ఏండ్ల చరిత్ర ఉందన్నారు. కొన్ని మతాలు 2 వేల ఏండ్ల నుంచే ఉనికిలో ఉన్నాయని తెలిపారు. భూమిపై ఒకే ధర్మం ఉందని, అదే సనాతన ధర్మమని అన్నారు. దానికి అంతం లేదన్నారు. సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తే వాళ్లనే నాశనం చేస్తామని హెచ్చరించారు. ఇక తెలంగాణలోని నాగర్ కర్నూల్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జీ దిలీపాచారి మాట్లాడుతూ ఉదయనిధి దేశద్రోహి అని అన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న ఉదయనిధిని నిర్మూలించిన వారికి కోటి రూపాయల నజరానా ఇస్తానని ప్రకటించారు. సామాజిక న్యాయానికి, సమానత్వానికి సనాతన ధర్మం ప్రతీక అని చెప్పారు. దేశ ప్రజల మధ్య ఐకమత్యం కోసం బీజేపీ తాపత్రయ పడుతోందని అన్నారు. ద్రావిడం, సంస్కృతం అంటూ ప్రజల మధ్య విభేదాలను సృష్టించి, దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఉదయనిధి ప్రయత్నిస్తున్నారని అన్నారు. హిందువులంతా ఇప్పటికైనా ఏకతాటిపైకి వచ్చి సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే వారిని క్షమించకూడదని చెప్పారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

one + 15 =