More

  కాంగ్రెస్ ముక్త్ భారత్ లో రాహుల్ పాత్ర ఎంత..?

  అనగనగా ఒక పార్టీ..! ఆ పార్టీ చరిత్ర కూడా పెద్దదే.! రిపబ్లిక్ భారత్ కంటే ముందే ఆ పార్టీపుట్టిందని గొప్పగా చెప్పుకుంటారు. ఇంకా జాతీయోద్యమాన్ని నడిపిన పార్టీ అని కూడా అంటారు. అయితే ఇప్పుడు అదంతా గతం.! గతాన్ని ఎవరు పట్టించుకోరు.! వర్తమానంలో ఉంటూ భవిష్యత్ దర్శనం చేయాలంటారు దార్శనికులు. కానీ ప్రస్తుత వర్తమానంలో, ఆ పార్టీ ఇప్పుడు కేవలం.., ఓ కుటుంబ పార్టీగా మారిపోయింది.! దానిపేరే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.! దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన ఈ పార్టీ ఇప్పుడు పూర్తిగా చతికిల పడిపోయింది.

  వరుసగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చేతుల్లో ఘోర ఓటమి పాలైంది. రోజు రోజుకు ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ తన బేస్ ను కోల్పోతూనే ఉంది. దేశంలో ఏదో ఒక మూల ఆ పార్టీకి చెందిన నేతలు రోజు గుడ్ బై చెబుతూనే ఉన్నారు. అంతేకాదు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి మెయిన్ బేస్ గా ఉన్న నేతలే… ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీకి అసలు బేసే లేకుండా చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో కొత్తగా ప్రాంతీయపార్టీలను పెట్టి.. కాంగ్రెస్ కు ఉన్న కాస్త ప్లేస్ ను ఆక్రమించేస్తున్నారు. మరికొంతమంది నేతలు బీజేపీలో చేరుతున్నారు.

  తాజాగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన సీనియర్ నేత జితిన్ ప్రసాద కూడా హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చేసి…, కమలం పార్టీతో తన ప్యూచర్ ను సెట్ చేసుకున్నాడు. నిజానికి జితిన్ ప్రసాద కుటుంబంలోని మూడు తరాల నాయకులు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా నెహ్రూ గాంధీ కుటుంబ సేవలోనే గడిపారు. అంతేకాదు స్వయంగా జితిన్ ప్రసాద… కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ అంతరంగికుల్లో ఒకడిగా ఉన్నవారు. ఆయనే పార్టీకి గుడ్ బై చెప్పడంతో తర్వాత వంతు ఎవరిదనే చర్చ దేశంలో మొదలైంది.

  ఎందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి దూరం అవుతున్నారు? కాంగ్రెస్ నాయకత్వ లోపం కారణంగానే పార్టీని విడిచి వెళ్తున్నారా? పార్టీ అధినేత్రి సోనియాకు లేఖాస్త్రాలు సంధించిన అసంతృప్త జీ-23 సీనియర్ల మాటేమిటీ? రాహుల్ గాంధీ మరోసారి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేది ఎప్పుడు? రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతగా ఉన్నంత వరకు కేంద్రంలో బీజేపీకి ఢోకా లేదా? ఎందుకు ఒక్కొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగు అవుతోంది? రాహుల్ గాంధీ వల్లే ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనుమరుగు అవుతోందా? తన పూర్వీకులనాటి నుంచి కంచుకోటలాంటి అమోథి లోక్ సభ స్థానంలో రాహుల్ ఓటమిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? హిందూ మెజారిటీ ఉన్న లోక్ సభ స్థానాల్లో రాహుల్ గాంధీ ఇక గెలవటమే కష్టమా? హస్తవిలాపానికి అసలు కారణం రాహుల్ అసమర్థతేనా? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  1984లో ఇందిరా గాంధీ హత్య అనంతరం రాజీవ్ గాంధీ నేతృత్వంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ…541 స్థానాలకు గాను 404 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత మరో 10 స్థానాలు గెలుచుకుంది. దేశ చరిత్రలో ఒక పార్టీకి ఇంత భారీ మెజారిటీ రావడం ఇదే ప్రథమం. అయితే 1989 సార్వత్రిక ఎన్నికల నాటికి 197 సీట్లకు పడిపోయింది. 1991లో రాజీవ్ గాంధీ హత్య జరగడంతో కాంగ్రెస్ పార్టీకి అన్ని తానై పీవీ నరసింహరావు నేతృత్వం వహించారు. 244 సీట్లతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు విజయవంతంగా నడిపారు. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైంది.

  దేశంలోఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటీ రాలేదు. దీంతో దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల యుగం మొదలైంది. కాంగ్రెస్, బీజేపీల జాతీయ స్థాయిలో కూటమి కట్టడం అప్పుడే మొదలైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 140 స్థానాలు గెలుచుకుంటే బీజేపీ 161 సీట్లల్లో విజయం సాధించింది. బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు అన్ని తొలిసారిగా కూటమి కట్టి యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్పాడ్డాయి. ఈ కూటమి కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి సపోర్ట్ చేసింది. అయితే రెండేళ్లల్లో ఇద్దరు ప్రధానమంత్రులు మారారు. దేవేగౌడ్ తర్వాత ఇంద్రకుమార్ గుజ్రాల్ పీఎం అయ్యారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సీతారాం కేసరి అధ్యక్షుడిగా ఉండేవారు. ఆ సమయంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు… పార్టీకి సోనియా గాంధీ నేతృత్వం వహించాలని ఆమె ఇంటికి క్యూ కట్డడం మొదలు పెట్టారు. దీంతో ఆమె పార్టీకి నేతృత్వం వహించేందుకు అంగీకరించింది. అయితే పార్టీకి నేతృత్వం వహించేందుకు సిద్ధమైన కొంతమంది నేతలు పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలోనే సోనియా గాంధీ విదేశీ మూలాలను ప్రశ్నించారు. వారిలో శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్ ఉన్నారు. వీరికి మద్దతుగా రాజేష్ పైలట్ నిలిచాడు. ఈ సమావేశం తర్వాత నుంచే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీన పడటం మొదలైందని అంటారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు.

  పార్టీ నుంచి బహిష్కృతుడైన శరద్ పవార్…1999లో మహారాష్ట్ర కేంద్రంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశాడు. తర్వాత మళ్లీ కాంగ్రెస్ తో కలిశాడు. యూపీఏ కూటమిలో భాగస్వామిగా మారాడు. అటు మేఘాలయాలో పీఏ సంగ్మా కొంతకాలం పాటు ఎన్సీపీలోనే ఉన్నారు. ఆ తర్వాత 2013లో మెఘాలయాలో నేషనల్ పీపుల్స్ పార్టీ అనే ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేశారు. మొఘాలయాలో కాంగ్రెస్ మూలాలను దెబ్బకొట్టాడు.

  అటు సోనియా నాయకత్వంతో విబేధించిన మమతా బెనర్జీ కూడా 1998లో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. బెంగాల్ కేంద్రంగా సొంతంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. మమతా బెనర్జీ దెబ్బకు ముఖ్యవిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ఇప్పుడు కనుమరుగు అయ్యింది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

  ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో… ఆయన వారసుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం పదవిని ఆశించారు. అయితే తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ ను అవినీతి కేసులపై సీబీఐ చేత విచారణ జరిపించడం…ఆయన్ను జైలుకు పంపించడంతో… కాంగ్రెస్ కు గుబ్ బై చెప్పిన జగన్ 2011లో సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి.., ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ అనేది నామమాత్రంగా మారింది. ఆ పార్టీ నేతలు అందరూ వైసీపీ, టీడీపీలో చేరిపోయారు. ఇక తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకి ఉన్న కాసింత ఉనికి కూడా ఆయా నియోజకవర్గాల్లో నేతల వల్లేనన్నది స్పష్టం. ప్రస్తుతం రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే.. ఆ పార్టీలోని సీనియర్ నేతలు అంతా బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్రమంగా కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తోంది. 2023లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్పేమాట.!

  అలాగే ఢిల్లీలో వరుసగా మూడు సార్లు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ…అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో… తన ఉన్న బేస్ ను సైతం పొగొట్టుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో కాంగ్రెస్ నామమాత్రం పార్టీగా మారింది. అటు రాజస్థాన్ లో అధికారంలో కొనసాగుతున్నా… అక్కడ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ కు సచిన్ పైలట్ కు పొసగటం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రమంతటా తిరిగి పార్టీని గెలిపించిన సచిన్ పైలట్ కు ముఖ్యమంత్రి పదవి అందినట్లే అందిచేజారింది. దీంతో ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ లోనూ ఉంటే అసమ్మతి నేతగా కొనసాగుతున్నాడు. తర్వలోనే సచిన్ పైలట్ కూడా బీజేపీలో చేరుతాడనే ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ నేత వసుంధర రాజే కారణంగా ఆయన కొంత వెనుకడుగు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే అతని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా…సచిన్ పైలట్ కు స్వయంగా మామ. ఆయన కూడా సచిన్ పైలట్ బీజేపీ వైపునకు వెళ్లకుండా ఆపుతున్నాడనే ప్రచారం ఉంది. అయితే బీజేపీ సచిన్ పైలట్ కు కేంద్రమంత్రి పదవిని సైతం ఆఫర్ చేసిందనే ప్రచారం జరుగుతోంది.

  ఇక ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన రీటా బహుగుణ జోషి కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్నారు. అటు ప్రస్తుతం అస్సాం సీఎంగా ఉన్న హిమంత బిశ్వ శర్మ కూడా ఒకప్పటి యూత్ కాంగ్రెస్ నేతనే. కాంగ్రెస్ లో చాలా కాలం పాటు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా కొనసాగాడు. అయితే అస్సాంలో పార్టీ నాయకత్వం విబేధించిన ఆయన.. తన గోడును వెల్లబోసుకునేందుకు ఢిల్లీలో రాహుల్ ను కలిశారట. అయితే రాహుల్ ఆయన చెప్పమాటలపై శ్రద్ధ పెట్టకుండా తన పెంపుడు కుక్కతో ఆడుకోవడం మొదలు పెట్టాడాట. దీంతో ఇక పార్టీలో ఉండి లాభం లేదని భావించిన ఆయన బీజేపీలో చేరాడు. వరుగా రెండు సార్లు అసోంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా తన వంతు ప్రయత్నం చేశాడు. అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్ లో కాంగ్రెస్ ముక్త అభియాన్ లో ముఖ్యపాత్ర పోషించాడు. నార్త్ ఈస్ట్ లోని ఏడు రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి బీహార్ లో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ నామమాత్రం పార్టీగా మారింది. ఆర్జేడీతో పొత్తు పెట్టుకుంటేనే ఆ పార్టీకి అక్కడ మనుగడ. ఇటు యూపీలోనూ సేమ్ సీన్. యూపీలో స్వయంగా తన సొంత సీటు అమోథిలోనే రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యారు. కేరళలోని ముస్లిం మెజారిటీ నియోజకవర్గమైన వయనాడ్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యాడు.

  ప్రస్తుతం దేశంలో మెజారిటీ హిందూ ఓటర్లున్న నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రాహుల్ గాంధీకి ధైర్యం లేదని నెటిజన్లు అంటున్నారు. అందుకే ఆయన ముస్లింలీగ్ అండతో కేరళలో వయనాడ్ నుంచి పోటీ చేశాడని చెబుతున్నారు.
  పంజాబ్ లోనూ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. సీఎం అమరీందర్ సింగ్ కు, బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన సిద్ధూకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. వచ్చే ఏడాది ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే రైతుల ఆందోళనల నేపథ్యంలో ఆర్తియాస్ అందరూ కూడా అకాళీదల్ వైపు మొగ్గుచూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు చల్లగా చాపకింద నీరులా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో విస్తరిస్తోంది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లల్లోనే కొల్లగొట్టబోతుందనే ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రలో సైతం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కొంత బేస్ ఉన్నా… శివసేనతో పొత్తు కారణంగా అది కూడా పోయిందని అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ క్రమంగా ఎన్సీపీ వైపునకు మల్లుతోందని అంటున్నారు. అటు హర్యానాలోనూ కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా అధికారానికి దూరం అయ్యింది.

  అటు మధ్యప్రదేశ్ లో 2018లో స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ…, జ్యోతిరాదిత్య సింధియా తో అధిష్ఠానం వ్యవహారించిన తీరు మూలంగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు. ఆయన్ను బీజేపీ తమ పార్టీ తరపున రాజ్యసభకు నామినెట్ చేసింది. కేంద్రమంత్రి వర్గ విస్తరణలో భాగంగా ఆయనకు కేంద్రమంత్రి పదవిని సైతం కట్టబెడతారే ప్రచారం జరుగుతోంది. నిజానికి మధ్యప్రదేశ్ పీపీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో కీలక పాత్ర పోషించారు. సింధియానే సీఎం చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఎలాగైతే రాజేష్ పైలట్ ను తప్పించారో అలాగే మధ్యప్రదేశ్ లోనూ సింధియాను తప్పించి సీనియర్ నేత కమల్ నాథ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అటు రాజస్థాన్ పైలట్, ఇటు మధ్య ప్రదేశ్ లో సింధియాలను సీఎం అభ్యర్థులుగా నియమిస్తే…, రాహుల్ గాంధీ కంటే ఎక్కువగా పాలన అనుభవంగడిస్తారని, పార్టీలో భవిష్యత్ లో రాహుల్ కు వీరి నుంచి పోటీ ఉంటుందని కొంతమంది సీనియర్లు సోనియా దృష్టికి తీసుకువెళ్లారని అందుకే చివరి నిమిషంలో వీరికి సీఎం పదవిని దూరం చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది.

  కర్ణాటకలోనూ మాజీ సీఎం సిద్ధరామయ్యకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య వర్గ పోరు కొనసాగుతోంది. ఛత్తీస్ గఢ్ లోనూ సీఎం భూపేష్ భగేల్ కు , ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ దేవ్ కు మధ్య వర్గపోరు కొనసాగుతోంది. 2018లో జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అంతా కూడా సింగ్ దేవ్ సీఎం అవుతారని భావించారు. అయితే చివరి నిమిషంలో భగేల్ పేరును ప్రకటించడంతో ఆనాటి నుంచి ప్రభుత్వంలో కొనసాగుతున్నా ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ పరంగా భగేల్ చేసిన ప్రకటనకు… సింగ్ దేవ్ పరోక్ష ప్రకటన చేయడం కామన్ గా మారింది. జార్ఖండ్ లో కూడా జేఎంఎం పార్టీతో పొత్తుతో అధికారంలో కొనసాగుతోంది. రాజస్థాన్, హర్యానా, హిమచల్, మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్ గఢ్, పంజాబ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రెండు పార్టీల వ్యవస్థ నడుస్తోంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్యనే నెలకొని ఉంటోంది. ఈ రాష్ట్రాల్లో సైతం కొంతమంది బలమైన నేతలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి ప్రాంతీయ ఏర్పాటు చేస్తే…ఈ రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్ బలహీన పడటం ఖాయం.

  ఏ పార్టీ నాయకుడైనా తన పార్టీ అన్ని రాష్ట్రాల్లో బలంగా ఉండాలని కోరుకుంటాడు. రాహుల్ గాంధీ మాత్రం… ఫైటింగ్ స్పీరిట్ చూపకుండా… బీజేపీపై గుడ్డి వ్యతిరేకతతో లెఫ్ట్ లుటియెన్స్ మాయలో పడి పార్టీని నాశనం చేసుకుంటున్నారని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? కాదంటారా? జస్ట్ ఆస్కింగ్.

  Trending Stories

  Related Stories