More

    అక్కడ మరోసారి మొదలైన కరోనా టెన్షన్.. ఆ దేశంలో లాక్ డౌన్

    యూరప్ దేశాల్లో మరోసారి కరోనా మహమ్మారి టెన్షన్ మొదలైంది. కరోనావైరస్ సంక్రమణ యూరప్ దేశాలను మళ్లీ టెన్షన్ పెడుతోంది. తాజా వ్యాప్తిని పరిష్కరించడానికి యూరోపియన్ యూనియన్‌లో లాక్ డౌన్ ప్రకటించిన మొదటి దేశంగా ఆస్ట్రియా నిలిచింది. ఆస్ట్రియా దేశంలో లాక్‌డౌన్ విధించి, టీకాలు వేయడం తప్పనిసరి చేస్తామని ఆ దేశ అధికారులు ప్రకటించారు. కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తుల సంక్రమణ రేటు శీతాకాలం ప్రారంభంతో పెరగడంతో ఇతర యూరోపియన్ దేశాలు కూడా ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. ఆస్ట్రియాతో పాటు, వాటికన్ మాత్రమే అందరికీ టీకాలు వేయాలని తప్పనిసరి చేసింది. కానీ చలికాలం మొదలవ్వడంతో యూరప్ అంతటా కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ల సంఖ్య మరింత పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం. స్పెయిన్ మరియు పోర్చుగల్ వంటి దేశాలు అత్యధిక టీకా కవరేజీలో ఉన్నాయి.. కానీ ఈ దేశాల్లో కూడా COVID-19 కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది.

    ప్రభుత్వం తీసుకున్న విస్తృత చర్యలను ప్రకటిస్తూ ఆస్ట్రియా ఛాన్సలర్ అలెగ్జాండర్ షాలెన్‌బర్గ్ మాట్లాడుతూ, ఆస్ట్రియాలో లాక్‌డౌన్ సోమవారం( 22 నవంబర్ 2021) నుండి ప్రారంభమవుతుంది అని తెలిపారు. అయితే టీకాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుండి తప్పనిసరి చేస్తామని అన్నారు. ముగ్గురిలో ఇద్దరు ఆస్ట్రియన్లు పూర్తిగా టీకాలు వేసుకున్నారు.. అయితే ఇది ఐరోపాలో అతి తక్కువ టీకా రేటు అని చెబుతున్నారు. పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేయాలనే తన ప్రభుత్వ నిర్ణయానికి ప్రాథమిక కారణాలుగా తక్కువగా ప్రజలు టీకాలు తీసుకోవడమేనని తెలిపారు. ప్రజలు టీకాలు తీసుకోడానికి ముందుకు రాకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

    “నెలల తరబడి ప్రయత్నించినా.. టీకాలు వేయడానికి ఎక్కువ మంది ఒప్పించడంలో మేము విజయం సాధించలేకపోయాము” అని షాలెన్‌బర్గ్ పశ్చిమ టైరోల్ రాష్ట్రంలో విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. “టీకా రేటును పెంచడమే కరోనా మహమ్మారిని అడ్డుకోడానికి ఏకైక మార్గం” అని అతను చెప్పారు. టీకాలపై అనుమానాలను వ్యక్తం చేసే వారిని కూడా షాలెన్‌బర్గ్ నిందించారు. దేశంలో టీకా ప్రయత్నాలను బలహీనపరిచే చర్యలను దేశ ఆరోగ్య వ్యవస్థపై దాడి అని అన్నారు.

    ఆస్ట్రియాలో లాక్‌డౌన్ విధించిన తర్వాత.. పనికి వెళ్లడం, నిత్యావసరాల కోసం షాపింగ్ చేయడం, వ్యాయామం చేయడం మినహా ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వెళ్లడానికి అనుమతించరు. పాఠశాలలు తెరిచి ఉంటాయి కానీ వీలైతే తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంట్లోనే ఉంచమని అధికారులు కోరుతున్నారు. కార్యాలయాలలో రద్దీని నివారించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పెరుగుతున్న కరోనావైరస్ కేసులను అరికట్టడానికి భారీ లాక్డౌన్ విధించింది. దాదాపు తొమ్మిది మిలియన్ల జనాభా కలిగిన ఆస్ట్రియాలో 15,000 కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదయ్యాయి.

    Trending Stories

    Related Stories