దేవుళ్లపై దేవిశ్రీ పైత్యం..! ‘శృతి’మించిన అపచారం..!!

0
774

పాపభీతి లేకపోవడాన్ని పరమ నీతిగా భావించే వారికి.. దైవాపచారాలు సదాచారాలుగా ఎలా కనబడతాయి..? దైవదూషణ ఫ్యాషన్ అనుకునేవారికి రేషన్ సైజ్ దుస్తుల్లో డ్యాన్స్‎లు చేయించడంలో తప్పేం కనిపిస్తుంది. తప్పని తెలిసి తప్పులు చేస్తూ.. దాన్నే గొప్పగా చెప్పేసుకునేవారిని ఎవరు మాత్రం ఏం చేయగలరు. మొండి వాడు రాజు కంటే బలవంతుడు అనే సామెతలు తల్చేసుకుని.. తామెంత గ్రేటో అనుకునే వారికి ఛీత్కార సత్కారాలు తప్ప ఏమీ మిగలవనే విషయాలు ఎవరు వివరించగలరు. హిందూ దేవుళ్లపై అసభ్య కార్టూన్లు, అనుచిత వ్యాఖ్యలు, దేవుళ్ల చిత్రాలు, విగ్రహాలు ఛిద్రం చేయడం, సినిమాల్లో దేవుళ్లను కించపర్చే విధంగా అపహాస్యాన్ని పెట్టడం.. ఇలాంటి ఎన్నో అరాచక పనులు చూసి, చూసి హిందువుల మనోభావాలు ఎంతో దెబ్బతిన్నాయి, దెబ్బ తింటున్నాయి. ఏ ఇతర మతాల్లో దేవుళ్లను కాని, మత సంప్రదాయాలను కాని.. ఒక్క పరుషపు మాట అనని ఈ దైవ దూషకులు.. హిందూ దేవుళ్లు, సంప్రదాయాలు, మంత్రాలను ఇష్టానుసారం కించపరుస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.. హిందువుల మనోభావాలను దెబ్బతినేలా.. దేవుడి పాటను కంపోజ్ చేశారు. కంపోజ్ చేయడమే కాకుండా.. బికినీ డ్రెస్సులేసుకున్న నటీమణులతో ఆడిపాడాడు. దీంతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ పాటలో హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని ఐటం సాంగ్ గా మార్చారని హిందు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై నటి కరాటే కళ్యాణి, హిందు సంఘాల నేతలు.. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని ఐటెం సాంగ్ గా చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలిగించాలని లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కరాటే కల్యాణి వార్నింగ్ ఇచ్చారు. దేవిశ్రీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దేవుడి పాటను పేరడీ చేసి అసభ్యంగా పెట్టడంపై.. తీవ్రంగా ఛీత్కారాలు రావడంతో.. తప్పు తమది కాదంటే తమది కాదు అనుకుంటున్నట్టు సమాచారం. దైవదూషణకు పాల్పడి పనికి మాలిన ఆట, పాటగా మిగిలిన ఈ ఐటం సాంగ్ గురించి..మ్యూజిక్ డైరెక్టర్ తప్పేంలేదు, లిరిక్ రైటర్ దే అంతా తప్పు అని దేవీశ్రీ అనుయాయ వర్గం అంటుండగా..కాదు కాదు మ్యూజిక్ డైరెక్టర్ దే టోటల్ ఫాల్ట్ అని లిరిక్ మహాశయుని అభిమానం వర్గం అంటున్నట్టు బోగట్టా. మ్యూజిక్ డైరెక్టర్ దో, లిరిక్ రైటర్ దో.. తప్పెవరిదైనా భగవత్ మంత్రాన్ని కించపరుస్తూ కంపోజ్ చేసిన.. గ్యాంగ్ అందరూ.. తిలా పాపం తలా పిడికెడు మాదిరి… ఈ పాట పాపం అందరూ అందుకోవాల్సి వుంటుంది.

వట్టి శ్రీప్రసాద్.. దేవి సినిమాతో ఆ దేవి అనుగ్రహంతో దేవిశ్రీ ప్రసాద్ గా సినీ పరిశ్రమలో రంగప్రవేశం చేశాడు. ఆ తర్వాత పేరు ప్రఖ్యాతులు పొందుతూ.. దైవాలనే అపహాస్యం చేస్తున్నారని.. ఏరు దాటి తెప్ప.. సామెత ఆయనకు సరిపోతుందని కొందరు హిందూ బంధువులు అంటున్నారు. మరోవైపు బీజేపీ నేతలు దేవిశ్రీ ప్రసాద్ తీరుపై మండి పడ్డారు. హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా చిత్రీకరించిన ఈ పాటను వెంటనే అన్ని ప్రసార మాధ్యమాల నుంచి తొలగించాలని బీజేపీ జాతీయ బీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పార్థసారధి డిమాండ్ చేశారు. అనుచితంగా ప్రవర్తించి, హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిన దేవిశ్రీ ప్రసాద్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, పాటను తక్షణం అన్నింటా తొలగించాలని హైందవ చైతన్య వేదిక ధర్మధ్వజం డిమాండ్ చేసింది.

అయితే, ఈ పాట సినిమాలోనిది కాదు. ఇటీవలి కాలంలో దేవిశ్రీ ప్రసాద్ జాతీయ స్థాయిలో పాటలు చేస్తున్నారు. యూ ట్యూబ్ చానల్‌ టీ సిరీస్‌ కోసం దేవీ శ్రీ ప్రసాద్ ఈ పాట రూపొందించారు. నాలుగు వారాల కిందట యూట్యూబ్‌లోఅప్ లోడ్ చేశారు. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ నటించిన “పుష్ప”కి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చారు. “పుష్ప” రిలీజయ్యాక బాలీవుడ్ లో అనేక అవకాశాలు పొందాడు. సల్మాన్ ఖాన్ హీరోగా “కబీ ఈద్ కబీ దివాలి” అనే సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ వుండబోతున్నట్టు తెలిసింది. భగవంతుడి అనుగ్రహంతో…ఇంత మంచి భవిష్యత్ పొందుతున్న దేవిశ్రీ… ఆ భగవంతుడినే కించపర్చేలా విర్రవీగే పనులకు పాల్పడితే అధ:పాతాళానికి పోవడం ఖాయమని, ఆ దుర్దినాలు తెచ్చుకోకుండా..అందరి చేత మంచి అనిపించుకునేలా తన ప్రస్థానం సాగించాలని..ఆయనకు కొందరు మంచివారు హితవు పలుకుతున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

three − two =