పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన భీమ్లా నాయక్ సినిమాపై ఆంధ్రదేశ్ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది. ఆ సినిమాలో కుమ్మరుల మనోభావాలు దెబ్బతినేలా ఓ సన్నివేశం ఉందని, దాన్ని తొలగించాలని ఏపీ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ ఎం.పురుషోత్తం గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు ఫిర్యాదు చేశారు. భీమ్లానాయక్ సినిమాలో దగ్గుబాటి రానా ఓ సన్నివేశంలో కుమ్మరి చక్రాన్ని కాలితో తంతాడని, అనంతరం తన ప్రత్యర్థిపై దాడి చేస్తాడని పురుషోత్తం తెలిపారు. కుమ్మరి చక్రం తమకు ఎంతో పవిత్రమైందని, అటువంటి దాన్ని తన్నడం కుమ్మరుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని చెప్పారు. సినిమా దర్శకులు, నిర్మాత, కథానాయకులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భీమ్లా నాయక్ సినిమాలోని ఆ సన్నివేశాన్ని తొలగించేలా చూడాలని కోరినట్లు ఆయన చెప్పారు.
ఫిబ్రవరి 25న విడుదలైన ‘భీమ్లా నాయక్’ సూపర్ హిట్ టాక్ అందుకుంది. సినిమా రిలీజ్ అయిన సమయంలో టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఆరోపించారు. అంతేకాకుండా జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా భీమ్లా నాయక్ సినిమా వివాదంపై మాట్లాడారు. సినిమాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ యత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నడూ లేని విధంగా సినీ పరిశ్రమకు సంబంధించి వీరు ట్వీట్లు చేస్తున్నారని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డారని కానీ ఆయన సినిమా గురించి చంద్రబాబు, లోకేశ్ ఏనాడూ ఆలోచించలేదని అన్నారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో గతంలో చంద్రబాబు ఇబ్బందులు పెట్టారని తమ్మినేని అన్నారు. తమ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ అయినా, ఆయన కుమారుడు అకీరానందన్ అయినా ఒకటేనని చెప్పారు. సినిమా విడుదలను మరో నాలుగు రోజులు వాయిదా వేసుకుని ఉంటే అదనపు షోలు, టికెట్ రేట్లు వచ్చేవని చెప్పారు. సినిమా బాగుంటే ఆడుతుందని, బాగాలేకపోతే ఫ్లాప్ అవుతుందని అన్నారు. ‘అఖండ’, ‘డీజే టిల్లు’ సినిమాలు బాగా ఆడాయని అన్నారు.