కారు వెనకసీట్లో కమ్యూనిస్టులు..! మునుగోడులో సాయంపట్టిన ఎర్రజెండాలు..!!

0
741

దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఫలితాలతో దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిన టీఆర్ఎస్.. మునుగోడులో పకడ్బందీగా ప్లాన్ చేసి విజయం సాధించింది. ఉప ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే కష్టమని భావించిన గులాబీ బాస్.. గతంలో చేసిన తప్పులకు పునారావృతం కాకుండా పక్కాగా లెక్కలేసుకుని ప్లాన్ చేశారు. పూర్వ నల్గొండ జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టుల కోట. ఇప్పటికీ అక్కడ లెఫ్ట్ పార్టీలకు పటిష్టమైన ఓటు బ్యాంకు వుంది. ఈ నేపథ్యంలో బీజేపీ జోరును తట్టుకోవాలంటే.. ఎర్రజెండాలను కలుపుకుంటేనే మంచిదని భావించారు కేసీఆర్. అందుకే కమ్యూనిస్టులో కలిసి మునుగోడు బరిలోకి దిగారు. ఈ పాచిక బాగానే పనిచేసింది. మునుగోడులో ఫలితాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ టీఆర్ఎస్‎కు గనుక ఒంటరిగా పోటీ చేసివుంటే.. ఈ విజయం సాధ్యమయ్యేది కాదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.

మునుగోడు నియోజకవర్గంలో కమ్యూనిస్టులు గతంలో అప్రతిహత విజయాలను సొంతం చేసుకున్నారు. 1985 నుంచి 2014 వరకు ఒక్కసారి తప్ప ఐదుసార్లు అధికారాన్ని కమ్యూనిస్టులు చేజిక్కించుకున్నారు. 2014లో మునుగోడు నియోజకవర్గం కమ్యూనిస్టుల నుంచి టీఆర్ఎస్ చేతికి వెళ్ళిపోయినా.. సాంప్రదాయక ఓటు బ్యాంకు కమ్యూనిస్టుల చేతిలోనే ఉంది. 2014లో ముప్పై వేల ఓట్లతో 15 శాతం ఓట్లు కమ్యూనిస్టులకే పోలయ్యాయి. అయితే 2018లో మహాఘట్ బంధన్ ముసుగులో కమ్యూనిస్టుల ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయి. దీని తర్వాత తాజాగా జరిగిన ఉపఎన్నికలో కమ్యూనిస్టుల ఓట్లను కేసీఆర్ బాగానే క్యాచ్ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సిద్దాంత పరంగా బీజేపీ కమ్యూనిస్టులకు పొసగదు. దీంతో పాటు అటు కాంగ్రెస్ కూడా కమ్యూనిస్టులతో కలిసే అవకాశం చాలా తక్కువ.

ఈ నేపథ్యంలో ఈ శూన్యతను కేసీఆర్ పసిగట్టి కమ్యూనిస్టులతో చర్చలు జరిపాడు. కమ్యూనిస్టు అగ్రనాయకులకు ప్రభుత్వం నుంచి కానీ, వ్యక్తిగతంగా కానీ ఏం కావాలంటే అది చేస్తాననే హామీలు గుప్పించారు కేసీఆర్. దీంతో ఎలాగో తాము పోటీ చేసినా గెలవలేమనే నిర్దారణకు వచ్చిన కమ్యూనిస్టులు తమ ఓట్లను టీఆర్ఎస్ వెంట నడిచారు. ఇదే కారు పార్టీకి మైలేజ్‎ను ఇచ్చింది. కమ్యూనిస్టుల క్యాడర్ కాస్తంత చెదిరిపోయినా సాంప్రదాయక ఓట్లు మాత్రం వీరివెంటే ఉన్నాయి. దీంతో అగ్రనాయకులు ఇచ్చిన పిలుపుమేరకు మునుగోడు కమ్యూనిస్టుల ఓట్లన్నీ గంపగుత్తగా టీఆర్ఎస్‎కే పడ్డాయి. ఒకవేళ కమ్యూనిస్టుల ఓట్లు కారు పార్టీ వైపుకు మళ్ళకుంటే ఈ మెజార్టీ మరింత తగ్గి గెలుపు అంత సులభం అయ్యేది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి, మునుగోడులో టీఆర్ఎస్ గెలుపుతో.. కమ్యూనిస్టులు తమ ఓటు బ్యాంకును తామే చేజార్చుకున్నట్టయింది. తాము గెలవకున్న పర్వాలేదు కానీ, బీజేపీ మాత్రం గెలవొద్దనే కుటిలనీతిని అవలంబించిన కమ్యూనిస్టులు తమ వేలితో తమ కంటినే పొడుచుకున్నట్టయింది. బలమైన ఓటు బ్యాంకు కాస్తా కకావికలమై బలహీనమైపోయింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

eighteen − 4 =