మణిపూర్‌లో తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. 46 అస్సాం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్, ఆయన కుటుంబమే లక్ష్యంగా దాడి చేశారు. చురాచంద్‌పూర్ జిల్లాలోని సింఘత్ సబ్ డివిజన్‌లో ఈ దాడి జరిగిన సమయంలో క్విక్ రియాక్షన్ టీమ్‌తో పాటు అధికారి కుటుంబ సభ్యులు కాన్వాయ్‌లో ఉన్నారు. ఉగ్రదాడిలో కల్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడు ఘటనలో మృతి చెందినట్లు సమాచారం. దాడిలో గాయపడ్డ వారిని బెహియాంగ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మరో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
ఒక్కసారిగా ఊహించని విధంగా తీవ్రవాదులు కాన్వాయ్ పై విరుచుకుపడినట్లు తెలుస్తోంది. మణిపూర్‌కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి పాల్పడినట్లు ఆర్మీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ దాడికి ఇంకా ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. ఆ ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. జిల్లాలోని ఈ మారుమూల ప్రాంతంలో ఉగ్రదాడిలో పౌరులు మరణించడం ఇదే తొలిసారి. ఈ ప్రదేశం చురచంద్‌పూర్ నుండి 50 కి.మీ దూరంలో ఉంది.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ దాడిని ఖండించడమే కాకుండా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. “మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌లో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై జరిగిన పిరికిపంద దాడి చాలా బాధాకరమైనది, ఖండించదగినది. కల్నల్ ఇద్దరు కుటుంబ సభ్యులతో సహా 5 మంది వీర సైనికులను దేశం కోల్పోయింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. నేరస్థులకు త్వరలోనే తగిన శిక్ష విధిస్తాం” అని మిస్టర్ సింగ్ ట్వీట్ చేశారు.
ఉగ్రవాదుల ఆచూకీ కోసం కౌంటర్ ఆపరేషన్ ప్రారంభించామని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ట్వీట్ చేశారు.