తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లకు కలెక్టర్లు మొక్కడం అత్యంత వివాదాస్పదమైంది. సిద్దిపేట కలెక్టర్ పి.వెంకటరామిరెడ్డి, కామారెడ్డి కలెక్టర్ శరత్ సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కారు. సిద్దిపేటలో ఆదివారం నాడు నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించారు. కలెక్టర్ చాంబర్‌లోని కుర్చీలో వెంకట్రామిరెడ్డిని సీఎం కేసీఆర్ కూర్చో బెట్టి అభినందించారు. వెంకటరామిరెడ్డి లేచి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కారు.
కామారెడ్డిలో కలెక్టరేట్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి కేసీఆర్ హాజరయ్యారు. కలెక్టర్ చాంబర్లోకి తెలంగాణ సీఎం వెళ్లారు. చాంబర్లో కలెక్టర్ శరత్ తన సీట్లో కూర్చునే ముందు సీఎం కేసీఆర్ కాళ్లకు మొక్కారు. అత్యున్నత సివిల్ సర్వెంట్లయిన ఐఏఎస్ ఆఫీసర్లు ఇలా రాజకీయ నాయకుడి కాళ్లు మొక్కడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే ఈ ఘటనపై సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి స్పందించారు. శుభకార్యం వేళ పెద్దల ఆశీస్సులు తీసుకోవడం తెలంగాణ సంప్రదాయమని అందుకే అలా చేశానని అన్నారు. ఇక నిన్న ఫాదర్స్ డే కూడా కావడంతో కేసీఆర్‌ను తండ్రిలా భావించి ఆశీస్సులు తీసుకున్నట్టు చెప్పారు.
2016లో సిద్దిపేట జిల్లా మొట్ట మొదటి కలెక్టర్ గా పి.వెంకటరామిరెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఆ సమయంలో కూడా కేసీఆర్ కాళ్లు మొక్కారు. వెంకటరామిరెడ్డి గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో మల్కాజిగిరి నుంచి.. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారనే ప్రచారాలు కూడా సాగిన సంగతి తెలిసిందే..! ఇప్పుడు మరో సారి వెంకటరామిరెడ్డి కాళ్లు మొక్కడం హాట్ టాపిక్ అయింది.