ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్ళు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగు రామన్న పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా పత్తి వేలం పాట నిర్వహించారు. క్వింటాల్ పత్తి ధర 8వేల 300 రూపాయలు పలికింది. అనంతరం తూకం యంత్రం వద్ద పూజలు చేసి.. ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి కలెక్టర్ సిక్తా పట్నాయక్ పత్తి రైతును శాలువాతో సత్కరించారు. మార్కెట్ యార్డులో రైతులకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు. వ్యవసాయ మార్కెట్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, రైతులు పత్తిని అరబెట్టుకుని మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.