దివంగత కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర అవార్డు లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతోష్ బాబు భార్య, తల్లికి మహావీర్ చక్ర అవార్డును ప్రదానం చేశారు. గత సంవత్సరం గాల్వన్ లోయలో భారత్ – చైనా బలగాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో సంతోష్ బాబు వీరమరణం పొందారు. గాల్వన్ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు , నాయబ్ సుబేదార్, సుదురామ్ సోరేన్, హవల్దార్ కె. పళని, నాయక్ దీపక్ సింగ్, సిపాయి గుర్తేజ్ సింగ్ లు మరణించారు. వీరికి మరణించిన తర్వాత వీర చక్రలను ప్రకటించింది కేంద్రం.
కల్నల్ సంతోష్ బాబుది తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా. ఆయన మరణానంతరం సంతోష్ బాబు భార్యకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. సంతోష్ బాబు కుటుంబానికి హైద్రాబాద్ లో ఇంటి స్థలం ఇచ్చింది. 16 బీహార్ రెజిమెంట్ కు కమాండింగ్ అధికారిగా కల్నల్ సంతోష్ బాబు వ్యవహరించారు. గల్వాన్ లోయ వద్ద భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సమయంలో సంతోష్ బాబు నేతృత్వంలోని ఇండియన్ ఆర్మీ చైనాకు ధీటుగా సమాధానం చెప్పింది. ఈ క్రమంలో చెలరేగిన ఘర్షణలో 21 మంది భారత జవాన్లు మరణించారు. సంతోష్ బాబు మరణించిన తర్వాత మహావీర్ చక్ర పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. చైనా ఆర్మీ దాడిలో గాయపడినపప్పటికీ సంతోష్ బాబు తన సైన్యాన్ని సంపూర్ణ కమాండ్, కంట్రోల్ తో ముందుకు నడిపించారు. చైనా సైన్యంలో భారీగా సిపాయిలు మరణించారు. ఇప్పటికీ ఆ దేశ సైనికులు ఎంత మంది చనిపోయారో అనే విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు.
జమ్మూ కశ్మీర్ లోని కెరాన్ సెక్టార్ లో ఒక ఉగ్రవాదిని హత్య చేసి, మరో ఇద్దరిని గాయపర్చిన 4 పారా స్పెషల్ ఫోర్సెస్ జవాన్ సంజీవ్ కుమార్ కు చనిపోయిన తర్వాత కీర్తి చక్ర అవార్డు దక్కింది. యుద్ధ సమయాల్లో చూపే సాహసం, శౌర్యం, తెగువకు ప్రతీకగా ఈ అవార్డులు ఇస్తారు. మిలటరీ గ్యాలంటరీ అవార్డుల్లో ‘మహా వీర్ చక్ర’రెండో అత్యున్నత పురస్కారం.