తమిళనాడులో మొదలైన ఎన్‌ఐఏ సోదాలు

0
1396

కోయంబత్తూరు కారు పేలుళ్ల కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తమిళనాడు వ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. కోయంబత్తూర్‌లో 30, చెన్నైలో ఎనిమిది, మధురైలో రెండు సహా 40 ప్రదేశాలకు పైగా ఉదయం 6 గంటలకు సోదాలు ప్రారంభమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. “విచారణలో ఉన్న వ్యక్తులంతా జమేషా ముబీన్ (అక్టోబర్ 23 న కారు పేలుడులో మరణించాడు)తో పరిచయం కలిగి ఉన్నారు.. వారు ముబీన్‌తో తరచుగా మాట్లాడడానికి, సంప్రదించడానికి దారితీసిన కారణాలను మేము పరిశీలిస్తున్నాము, ”అని ఒక అధికారి తెలిపారు. అనుమానితులు, తీవ్రవాదులకు సహకరించిన వారి ఇళ్లల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని పుడుపెట్‌, మన్నాడి, జమాలియా, పెరంబూరుతోపాటు కోయంబత్తూరు, కొట్టయ్‌మేడు, ఉక్కడం, పొన్విఝా నగర్‌, రతినపురి తదితర ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. దీపావళికి ఒకరోజు ముందు అంటే అక్టోబర్‌ 23న ఉదయం 4.30 గంటల సమయంలో తమిళనాడు కోయంబత్తూరులోని కొట్టే సంగమేశ్వర ఆలయం ముందు మారుతి కారులో ఉన్న సిలిండర్‌ పేలిపోయింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ పేలుడులో ఉగ్రకోణం ఉందని పోలీసులు నిర్ధారించారు. అక్టోబర్‌ 27న రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించింది.