కోడిపందేల కలకలం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్రభాక‌ర్ తప్పించుకున్నారట..!

0
796

హైద‌రాబాద్ శివారులోని పఠాన్‌చెరులో కోడిపందేల నిర్వహణ కలకలం సృష్టిస్తోంది. పటాన్ చెరు మండలం చిన్నకంజర్ల గ్రామ పరిధిలోని ఓ ఫామ్ హౌస్‌లో భారీ ఎత్తున కోడిపందేలు నిర్వహణ గురించి వెలుగులోకి వచ్చింది. సమాచారం మేరకు పటాన్ చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల బృందం కోడిపందేల కేంద్రం పై దాడి చేశారు. పోలీసుల రాకను గమనించిన పలువురు చెట్ల పొదలలో దూరి పరారయ్యారు. వీరిలో ఏపీలోని దెంద‌లూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు చింత‌మ‌నేని ప్రభాకర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

డీఎస్పీ భీమ్ రెడ్డి మాట్లాడుతూ.. సర్వే నెంబర్ 252 లో 25 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలో కోళ్ల పందేలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డే ఉన్న చింత‌మ‌నేని పోలీసుల క‌ళ్లుగ‌ప్పి ప‌రార‌య్యార‌ట‌. ఆయ‌న కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్టు తెలుస్తోంది. గ‌త కొన్ని రోజులుగా ప‌టాన్‌చెరులోనే మ‌కాం వేసిన చింత‌మ‌నేని జోరుగా కోడి పందేల‌ను నిర్వ‌హిస్తున్నట్లుగా స‌మాచారం. పోలీసులు చేసిన దాడుల్లో ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. 100 కోళ్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రూ.10 లక్ష‌లకు పైగా న‌గ‌దును కూడా స్వాధీనం చేసుకున్నారు.

అక్కినేని సతీష్, బర్ల శ్రీను, చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజు అనే నలుగురు ఆధ్వర్యంలో ఈ కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. వారిలో అక్కినేని సతీష్, బర్ల రాజు అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. మిగిలిన నిర్వాహకుల్లో చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజు తో తప్పించుకున్నారని తెలిపారు. ఈ పందెంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నట్లు తమకు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని డీఎస్పీ తెలిపారు. తప్పించుకున్న వారిని పట్టుకునేందుకు మూడు పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు.