ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. పారిస్ నుంచి శనివారం రాత్రి బయలుదేరిన జగన్ ఆదివారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి జోగి రమేశ్ ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తదితరులు కూడా జగన్‌కు స్వాగతం పలికారు. సీఎం వైఎస్ జగన్ కుమార్తె హర్షిణి రెడ్డి మాస్టర్స్ పూర్తి చేసుకున్న తరుణంలో పారిస్‌లోని ఇన్‌సీడ్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాలుపంచుకునే నిమిత్తం సతీసమేతంగా జగన్ పారిస్ వెళ్లారు.
శనివారం హర్షిణి రెడ్డి వర్సిటీ నుంచి మాస్టర్స్ పట్టాను తీసుకున్నారు. మాస్టర్స్‌ను డిస్టింక్షన్‌లో పాసయ్యారు. ఆమె ఈ ఘనత సాధించడం పట్ల వైఎస్ జగన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. డియర్ హర్షా చాలా గర్వంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు. నీవు ఎదిగిన తీరు అమిత సంతోషాన్నిచ్చిందని.. దేవుడు నీ పట్ల కృప చూపించాడని.. ఈ రోజు ఇన్‌సీడ్ నుంచి డిస్టింక్షన్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. వర్సిటీ నుంచి హర్షిణి రెడ్డి పట్టా తీసుకుంటున్న వీడియోను వైఎస్సార్సీపీ టీమ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తల్లిదండ్రుల సమక్షంలోనే హర్షిణి రెడ్డి పట్టా పుచ్చుకున్నారు. పట్టా అందుకున్న కూతురుతో కలిసి జగన్ దంపతులు ఫొటో దిగారు. ఈ ఫొటోను జగన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ కార్యక్రమం పూర్తి అయిన వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు సీఎం జగన్.