యూపీలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంలోని కేబినెట్ సభ్యులకు సంబంధించిన నిర్ణయాలను బీజేపీ ఉన్నత స్థాయి సమావేశంలో ఖరారు చేశారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కేబినెట్‌లో కొనసాగనున్నారు, డాక్టర్ దినేష్ శర్మ కు వేరే అధికారాలు ఇచ్చినట్లు నివేదికలు కూడా వెలుగులోకి వచ్చాయి.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్, రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌సింగ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సమక్షంలో జరిగిన సమావేశంలో శాసనమండలి ఎన్నికల్లో ఆ పార్టీ 36 మంది అభ్యర్థుల జాబితాను కూడా ఖరారు చేశారు. పార్టీ ఆఫీస్ బేరర్లతోపాటు కార్యకర్తలు ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో మొదటి దశలో చేర్చుకునే సభ్యుల పేర్లను కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. సాధారణ, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన, అణగారిన వర్గాలలోని అన్ని కులాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయంలో మహిళల ఓటు బ్యాంకు కూడా పెద్ద పాత్ర పోషించింది. అందుకే కేబినెట్‌లో మహిళలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
యోగి సర్కార్ కేబినెట్ ప్రమాణస్వీకార కార్యక్రమం మార్చి 21న జరగాల్సి ఉంది. మార్చి 21 శాసన మండలి ఎన్నికలకు నామినేషన్ల చివరి రోజు కావడంతో నామినేషన్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు, పార్టీ ఆఫీస్ బేరర్లు హాజరుకానున్నారు. అందుకే 22న శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి, ఆ తర్వాత 23 లేదా 24న ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.