More

    బీజేపీ అస‌మ‌ర్థ‌త వ‌ల్ల దేశం ప‌రువుపోతోంది: సీఎం కేసీఆర్

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం లోని భారతీయ జనతా పార్టీపై నిప్పులు చెరిగారు. బీజేపీ అస‌మ‌ర్థ‌త వ‌ల్ల దేశం ప‌రువుపోతోందని అన్నారు. బీజేపీ అధికార ప్ర‌తినిధి నుపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల‌తో అంత‌ర్జాతీయంగా దేశం ప‌రువు పోయింద‌ని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. నుపుర్‌శ‌ర్మ వ్యాఖ్య‌ల‌తో విదేశాల్లో భార‌త రాయ‌బారిని నిల‌దీస్తే క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని గుర్తుచేశారు. నుపుర్‌శ‌ర్మ వేసిన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు జడ్జీలు మండిప‌డితే.. న‌లుగురు రిటైర్డ్ జ‌డ్జిల‌ను తీసుకొచ్చి సుప్రీంకోర్టు ల‌క్ష్మ‌ణ‌రేఖ దాటింద‌ని రిటైర్డ్ జ‌డ్జీల‌తో లేఖ రాయిస్తారా? అని ప్ర‌శ్నించారు. బీజేపీ నేత‌లు సుప్రీంకోర్టును కూడా బేఖాత‌రు చేస్తున్నార‌ని.. ప్రభుత్వం నడుపుతున్నారా? లేక‌ గుండాయిజం చేస్తున్నారా? అని నిల‌దీశారు. బీజేపీకి అహంకారం పెరిగిపోయింద‌ని, ఆ పార్టీ నాయ‌కుల‌కు క‌ళ్లు నెత్తికెక్కి కారుకూత‌లు కూస్తున్నార‌ని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు.

    దేశంలో ఎన్న‌డూ లేనివిధంగా నిరుద్యోగం పెరిగింద‌ని ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. దేశంలో ఏటా కోటి 30 ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోతున్నార‌ని తెలిపారు. చ‌రిత్ర‌లోనే ఎన్న‌డూ లేనివిధంగా మోదీ హ‌యాంలో రూపాయి ప‌త‌న‌మైంద‌ని.. రూపాయి ప‌త‌నంపై గుజ‌రాత్ సీఎంగా ఉన్న‌ప్పుడు మోదీ మాట్లాడార‌ని, భార‌త్‌లో రూపాయి విలువ ఘోరంగా ప‌త‌న‌మైన‌ట్లు గ‌తంలో చెప్పార‌న్నారు. మోదీ గతంలో లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ను ఇప్పుడు తాము అడుగుతున్నామ‌ని, ఆయ‌న స‌మాధానం చెప్పాల‌న్నారు. కేంద్రంలో కూడా తెలంగాణ మాదిరి స‌ర్కారు రావాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. కేంద్రంలో డ‌బుల్ ఇంజిన్ స‌ర్కారు రావాల‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వ వేగం త‌క్కువ‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వ‌ వేగం ఎక్కువ‌ని తెలిపారు. మ‌రి దేశంలో బీజేపీ డ‌బుల్ ఇంజిన్ ఉండాలా? బీజేపీయేత‌ర డ‌బుల్ ఇంజిన్ ఉండాలా? ప్ర‌జ‌లే తేల్చుకోవాల‌న్నారు. దేశంలో భీక‌ర కుంభ‌కోణాలు, భ‌యంక‌రమైన అనారోగ్య‌క‌ర విధానాలు పెరిగిపోయాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

    spot_img

    Trending Stories

    Related Stories