More

  ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం.. కారణం ఇదేనట..!

  భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు హైదరాబాద్ రానున్న సంగతి తెలిసిందే. శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు స్వాగతం పలుకుతారని అందరూ భావించారు. అక్కడి నుంచి ప్రధాని నేరుగా హెలికాప్టర్‌లో పటాన్‌చెరులోని ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థకు చేరుకుని స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ముచ్చింతల్ చేరుకుని రామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

  ప్రధాని కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరమయ్యారు. స్వల్ప అస్వస్థత కారణంగా ఆయన మోదీ పర్యటకు దూరంగా ఉన్నారు.ప్రధానికి స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చీఫ్ సెక్రటరీ, డీజీపీలు ఇప్పటికే చేరుకున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

  మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్‌కు మోదీ చేరుకుంటారు. అక్క‌డి నుంచి పటాన్ చెరులోని ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ వేడుక‌ల‌కు వెళ్తారు. ఈ నేప‌థ్యంలో ఇక్రాశాట్ వ‌ద్ద క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. ముఖ ద్వారం నుంచి 150 మీట‌ర్ల వ‌ర‌కు ఎవ‌రినీ అనుమ‌తించట్లేదు. త‌నిఖీలు చేసి పాసులు ఉన్న శాస్త్ర‌వేత్త‌ల‌ను మాత్ర‌మే పోలీసులు అనుమ‌తిస్తున్నారు. నేటి హైదరాబాద్ పర్యటనకు సుమారు 7,000 మంది పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం భద్రత కోసం రంగంలోకి దింపింది. ప్రధాని ఎక్కడా రోడ్డు మార్గంలో ప్రయాణించకుండా ప్రణాళిక రూపొందించారు. ప్రధాని పర్యటించే పటాన్ చెరు (ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు), ముచ్చింతల్ (రామానుజాచార్య విగ్రహావిష్కరణ) చుట్టు పక్కల ప్రాంతాలు మొత్తం పోలీసులు, ఎస్పీజీ అధీనంలోకి వెళ్లిపోయాయి. ముచ్చింతల్ లో 270 సీసీటీవీ కెమెరాలను కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం పర్యవేక్షించనున్నారు. ప్రధాని భద్రతను చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) అధికారుల బృందం వారం ముందే హైదరాబాద్ చేరుకుంది. సైబరాబాద్ పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగంలో కలసి పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.

  Trending Stories

  Related Stories